చెరువులో మృతదేహం.. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడిగా గుర్తింపు
ABN , Publish Date - Feb 18 , 2026 | 09:22 AM
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు మృతిచెందాడు. ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ మృతదేహం లభించగా.. చిన్నారి హత్య కేసు నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
అన్నమయ్య, ఫిబ్రవరి 18: ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో మృతదేహం కలకలం రేపింది. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం మొత్తం ఉబ్బిపోయి ఉండటంతో దాదాపు 10 గంటల క్రితమే చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుడు పారిపోయే క్రమంలో చెరువులో పడి చనిపోయాడా? లేక ఇంకేదైనా జరిగిందా? దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇక, నిన్న (మంగళవారం) మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురవ్వడం సంచలనం రేపింది. ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అతికిరాతంగా హత్య చేసి.. ఆపై డ్రమ్ములో కుక్కాడు. చిన్నారి హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితుడిని అప్పగించాలని, ఎన్‌కౌంటర్ చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పి.. తల్లిదండ్రులను ఒప్పించి సాయంత్రం సమయంలో బాలిక మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే బాలిక లైంగిక దాడికి కూడా గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఈ ఘటన తర్వాత పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెరువులో లభించిన మృతదేహం నిందితుడిదే అని అక్కడి ప్రజలు, పోలీసులు నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి...
సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ
ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్!
Read Latest AP News And Telugu News