సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:03 AM
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఓఎంసీ కేసును ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలన్న అత్యున్నత న్యాయస్థానం
గతంలో మరో పిటిషన్ అనుకుని స్టే ఇచ్చామన్న కోర్టు
ఇన్నిరోజులు స్టేను ఎంజాయ్ చేశారు కదా అంటూ వ్యాఖ్య
నిర్దోషిగా ప్రకటించాలన్న పిటిషన్ డిస్మిస్
శ్రీలక్ష్మి మరిది అక్రమాస్తులు కూడబెట్టారు
గనుల కేటాయింపులో లంచం అడిగారు
విచారణలో అక్రమాలన్నీ బయటపడతాయి
సుప్రీం కోర్టులో దర్యాప్తు సంస్థ వాదనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున, తామిప్పుడు మెరిట్స్‌లోకి వెళ్లలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. శ్రీలక్ష్మి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో శ్రీలక్ష్మి పిటిషన్ విచారణ సందర్భంగా మరో పిటిషన్‌గా భావించి స్టే ఇచ్చామని ధర్మాసనం తెలిపింది. పొరపాటున ఇచ్చిన స్టేను ఇన్నిరోజులు ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఓబుళాపురం కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును గతేడాది ఆగస్టు 12న శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అప్పటి రాష్ట్ర గనుల శాఖ మంత్రి (సబితా ఇంద్రారెడ్డి), అప్పటి ప్రభుత్వ కార్యదర్శి (కృపానందం) సహా కీలకంగా ఉన్నవారు అందరూ నిర్దోషులేనని తేలిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన కొత్తలో శ్రీలక్ష్మి వద్దకు ఆ ఫైల్ వచ్చిందని గుర్తు చేశారు.
నిర్ణయాధికారంలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కేసులో నిర్దోషులుగా తేలగా, ఒక ఆఫీసర్‌ను మాత్రం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. ‘‘ఓఎంసీకి మైనింగ్ లీజులు ఇచ్చే సమయంలో.. ప్రభుత్వ ఉత్తర్వులో ‘క్యాప్టివ్ మైనింగ్’ (సొంత పరిశ్రమల అవసరాలకు మాత్రమే ఖనిజాన్ని వాడుకునే) అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే శ్రీలక్ష్మి తొలగించి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే, శ్రీలక్ష్మి కేంద్రం చెప్పినట్లు పనిచేేస్త అది నిబంధనల ఉల్లంఘన అనడం సరికాదు. ఐరన్ ఓర్ అనేది మేజర్ మినరల్. ఈ విషయంలో రాష్ట్రం సిఫారసులు మాత్రమే చేసింది. కావున, లీజుల కేటాయింపులో తుది నిర్ణయం కేంద్రానిదే. అసలు.. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటే లంచం అడిగి తీసుకున్నట్లు ఆధారాలు ఉండాలి. శ్రీలక్ష్మి విషయంలో ఎక్కడా డబ్బు చేతులు మారలేదు. నీరజ్ దత్తా కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఆరోపణల ఆధారంగానే అవినీతి ముద్ర వేయజాలము’’ అని సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. శ్రీలక్ష్మి సోదరి భర్త (రాకేష్ బాబు) 2005-09 మధ్య కాలంలో ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని తెలిపింది. గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి కూడా లంచాలు డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని కోర్టుకు వివరించింది. ట్రయల్ కోర్టులో విచారణలో అక్రమ వ్యవహారాలన్నీ బయటపడే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. దీని వెనుక క్విడ్ ప్రో కో ఉందన్న కోణంలో విచారణ జరిగిందని గుర్తు చేసింది. శ్రీలక్ష్మిపై అవినీతి ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేసు విచారణ దశలో ఉన్నందున, మెరిట్స్‌లోకి వెళ్లలేమని తెలిపింది. ఈ అంశాన్ని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని చెబుతూ శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది.
అసలు ఏం జరిగిందంటే...
కర్ణాటక - ఆంధ్ర సరిహద్దుల్లోని బళ్లారి, అనంతపురం జిల్లాల పరిధిలో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వకాలు జరుపుతున్నారంటూ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ)పై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం ఆ కేసు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. 2007లో ఆ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇనుప గనుల లైసెన్సు ఇవ్వగా, ఆ సంస్థ గనుల తవ్వకాల్లో అక్రమాలు చేస్తోందంటూ 2009 డిసెంబరులో కేసు నమోదైంది. బీవీ శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన రెడ్డి, వీడీ రాజగోపాల్, లింగారెడ్డి, వై శ్రీలక్ష్మి, మెఫజ్ అలీఖాన్, కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిందితులుగా సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. ఇందులో లింగారెడ్డి మరణించగా, ఏ6 గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును 2022లో హైకోర్టు కొట్టేసింది. అలాగే, కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చిన న్యాయస్థానం, మిగిలిన ఐదుగురికి ఏడేళ్ల శిక్షను విధించిన విషయం విదితమే. అయితే, శ్రీలక్ష్మిని నిర్దోషిగా తేల్చడంపై 3 ఆగస్టు 2023న సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. మూడు నెలల్లో శీలక్ష్మి పాత్ర తేల్చాలని 2025, మే7న తెలంగాణ హైకోర్టుకు సూచించింది. 25 జూలై 2025న తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును శ్రీలక్ష్మి 12 ఆగస్టు 2025న సుప్రీంకోర్టులో మళ్లీ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని తీర్పునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
బడులకు 5 స్టార్ రేటింగ్: లోకేశ్