బడులకు 5 స్టార్ రేటింగ్: లోకేశ్
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:59 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ 5స్టార్ రేటింగ్‌లోకి తెస్తామని, రూ.వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
ప్రస్తుతం ఒక్కటీ లేదు.. అన్నింటినీ ఆ పరిధిలోకి తెస్తాం
వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
వైసీపీ తెచ్చిన జీవో 117తో పిల్లలు బడికి దూరం
కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశాం
‘వన్ క్లాస్-వన్ టీచర్’ విధానం 33 శాతానికి పెంచాం: మంత్రి లోకేశ్
‘నాడు-నేడు’లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: గౌతు శిరీష
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ 5స్టార్ రేటింగ్‌లోకి తెస్తామని, రూ.వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ‘నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ఆధునీకరణలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఆ పనులకు సకాలంలో బిల్లులు చెల్లించిన విషయం వాస్తవమేనా?’ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలల్ని మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 వల్ల పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవో రద్దు చేశామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్‌ఎంసీ అకౌంట్‌లో రూ.200 కోట్లు ఉన్నాయని, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.800 కోట్లు అదనంగా కేటాయించామన్నారు. ఈ రెండూ కలిపి వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1000 కోట్లు ఖర్చు చేసే అవకాశం వచ్చిందన్నారు. మరోవైపు పాఠశాలల విద్యాభివృద్ధిలో ‘వన్ క్లాస్- వన్ టీచర్’ విధానం చాలా కీలకమైందన్నారు. గతంలో 3 శాతం పాఠశాలల్లోనే ఈ విధానం ఉంటే.. ఇప్పుడు 33 శాతానికి పెంచామన్నారు. దీనిద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, పెయింట్స్, బెంచీలు, టాయ్‌లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నామని, అన్ని పాఠశాలలను 5 స్టార్ రేటింగ్‌కు తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకూ ఒక్క పాఠశాల కూడా 5 స్టార్ రేటింగ్‌లో లేదన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అవసరమైనచోట పాఠశాల భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. 2014-19లో చేసిన పనులకు బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడతామన్నారు. తొలుత మాట్లాడిన గౌతు శిరీష గత ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, నేటికీ అనేకచోట్ల అసంపూర్తి నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ‘నాడు-నేడు’లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయాలని కోరారు.