మండలిలో వైసీపీ రచ్చ!
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:51 AM
సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని ఆరోపిస్తూ మంగళవారం శాసనమండలిలో వైసీపీ సభ్యులు రగడ సృష్టించారు.
హెరిటేజ్‌పై చర్చకు పట్టు.. గంటల తరబడి నినాదాలు
చైర్మన్ పోడియంను చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు
సంబంధం లేని అంశాన్ని ప్రస్తావిస్తారా?: మంత్రుల ఆగ్రహం
పలుమార్లు సభను వాయిదా వేసిన చైర్మన్
హిందూ దేవుళ్లు, భక్తులపై జగన్ పగబట్టారు: అచ్చెన్న
కల్తీ లడ్డూ పాపాన్ని దారి మళ్లించేందుకే: కొలుసు
ఆధారాల్లేని నిందారోపణలు వైసీపీకి అలవాటే: సత్యకుమార్
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని ఆరోపిస్తూ మంగళవారం శాసనమండలిలో వైసీపీ సభ్యులు రగడ సృష్టించారు. మండలి ప్రారంభం కాగానే మైకుల్లో సాంకేతిక సమస్య కారణంగా సభను చైర్మన్ గంటసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే.. ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలపై చర్చించాలని వైసీపీ సభ్యులు కేఆర్‌జే భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి, వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పీహెచ్‌సీ భవనాల పునర్ధురణపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇస్తుండగా, వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. కొందరు పోడియం పైకి ఎక్కి, హెరిటేజ్‌పై చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. ‘హెరిటేజ్ పాలు, పెరుగు, నెయ్యి, కూటమి పాలన, సీఎం చంద్రబాబు విధానాలు కల్తీ.. గోవిందా.. గోవిందా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పశువైద్యశాలల్లో పరికరాల కొరతపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా వైసీపీ సభ్యులు పెద్దగా నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేశారు. మంత్రి పార్థసారథి జోక్యం చేసుకుని, శ్రీవారి లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేసిన పాపం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ వల్ల ప్రభుత్వానికి, టీటీడీకి ఏ నష్టం జరిగిందో చెప్పాలన్నారు. వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ పార్టీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. ‘మంత్రులు మాట్లాడేటప్పుడు నినాదాలు చేస్తున్నారు. సభను గౌరవించి, పోడియం దిగండి. మీ పార్టీ నేత మాట్లాడతారు’ అని చైర్మన్ కోరారు.
అయినా వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే సభ్యుల విజ్ఞప్తి మేరకు మిగిలిన ప్రశ్నలను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో హెరిటేజ్‌పై చర్చకు అనుమతించాలని వైసీపీ సభ్యులు మరోసారి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రత్యేక అంశాల ప్రస్తావనకు చైర్మన్ అనుమతించడంతో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు, జనసేన సభ్యుడు నాగేంద్రబాబు, టీడీపీ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపీమూర్తి తదితరులు వివిధ అంశాలపై మాట్లాడుతుండగా, వైసీపీ సభ్యులు పెద్దగా నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. ఆందోళన విరమిస్తే బడ్జెట్‌పై చర్చ చేపడతామని చైర్మన్ చెప్పినా వారు నినాదాలు చేస్తుండటంతో సభను మరో 15 నిమిషాలు వాయిదా వేశారు. గంట తర్వాత సభ ప్రారంభం కాగానే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడబోతుండగా, వాయిదా తీర్మానంపై చర్చ కోరుతూ వైసీపీ సభ్యులు మరోసారి తమ స్థానాల నుంచి లేచి, పోడియం వద్దకు వచ్చారు. దీంతో అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. దేవుడిపైన, హిందూ భక్తులపైనా జగన్ పగబట్టారని, లడ్డూల కల్తీని పక్కదారి పట్టించడానికి హెరిటేజ్ అంశాన్ని తెచ్చారని అచ్చెన్న మండిపడ్డారు. సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడాలని కూటమి ఎమ్మెల్సీలు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘అన్నీ కల్తీ కల్తీ’ అంటూ నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యుడు రుహుల్లాపై చైర్మన్ మండిపడ్డారు. ‘దేవుడి పేరు చెప్పి.. లడ్డూల కల్తీ అంటూ కూటమి ప్రభుత్వమే అవినీతికి పాల్పడుతోంది’ అని బొత్స ఆరోపించారు. వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మండలి దద్దరిల్లడంతో చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
సిగ్గు పడాల్సింది పోయి ఎదురుదాడా?: అచ్చెన్న ఫైర్
‘మండలిలో పెద్ద డ్రామా జరుగుతోంది. సభకు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని వైసీపీ సభ్యులు ప్రస్తావించి, డ్రామా ఆడుతున్నారు. దేవుళ్లు, హిందువులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘హెరిటేజ్‌కు తిరుపతి లడ్డూకి సంబంధం ఏమిటి? కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డే అంగీకరించారు. హెరిటేజ్‌పై ఆరోపణలకు ఆధారాలేవీ? ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్న వైసీపీకి దమ్ముంటే లడ్డూ కల్తీపై చర్చకు రావాలి. ఏడుకొండల వాడికి జగన్ తండ్రి రెండు కొండలు చాలన్నారు. చేసిన తప్పిదానికి లెంపలేసుకోవాల్సింది పోయి, వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. తప్పుచేసి, ఇరుక్కుపోయిన వైసీపీని యావత్ హిందూ సమాజం ఛీ కొడుతోంది. సిగ్గు పడాల్సింది పోయి, ఎదురు దాడిచేసి, సభను పక్కదారి పట్టించాలనే ఆందోళన చేస్తున్నారు. కుట్ర రాజకీయాలు సాగవు. మండలి స్తంభించిపోయినట్లు మీ పత్రికలో రాసుకోవాలనా? హిందూ దేవుళ్లు, హిందూ భక్తులపై జగన్‌తో సహా వైసీపీ వారు పగబట్టారు. హిందూ సంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. నిజం దాగదు. బాధ్యులపై చర్యలు తప్పవు’ అని అచ్చెన్న హెచ్చరించారు. హెరిటేజ్ విషయంలో ఆధారాలుంటే చూపించాలని వైసీపీ సభ్యులను మండలి చైర్మన్ కోరాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.