Share News

యుద్ధ నౌకలు సిద్ధం

ABN , Publish Date - Feb 18 , 2026 | 07:11 AM

విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్)కు సమయం ఆసన్నమైంది. భారత నౌకాదళం నుంచి 70కిపైగా యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, కోస్ట్‌గార్డు నౌకలు...

యుద్ధ నౌకలు సిద్ధం
International Fleet Review 2026

  • నేడే విశాఖలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ.. భారత్‌ నుంచి 70కి పైగా నౌకలు, జలాంతర్గాములు

  • ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

  • ‘ఐఎన్‌ఎస్ సుమేధ’ నుంచి రాష్ట్రపతి సమీక్ష

  • విశాఖకు చంద్రబాబు.. నేడు రివ్యూకు హాజరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్)కు సమయం ఆసన్నమైంది. భారత నౌకాదళం నుంచి 70కిపైగా యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, కోస్ట్‌గార్డు నౌకలు, 20 దేశాల నుంచి మరికొన్ని నౌకలు ఈ రివ్యూలో పాల్గొంటున్నాయి. బంగాళాఖాతంలో బుధవారం ఉదయం 8.55 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ, విదేశీ నౌకలను సమీక్షించనున్నారు. అంతర్జాతీయ నౌకల సమీక్ష చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఆమె కోసం తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ‘ఐఎన్‌ఎస్‌ సుమేధ’ యుద్ధనౌకను అందంగా తీర్చిదిద్దింది. ఆపరేషన్‌ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఈ సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనితో పాటు వివిధ నగరాల పేరుతో నేవీ నిర్మించిన నౌకలు ఐఎన్‌ఎస్‌ చెన్నై, ఐఎన్‌ఎస్‌ విశాఖ, ఐఎన్‌ఎస్‌ ముంబై, ఐఎన్‌ఎస్‌ మైసూర్‌.. అలాగే, ఐఎన్‌ఎస్‌ రాణా, రణ్‌వీర్‌, రణ్‌విజయ్‌, తరఖాన, తమల్‌, నీలగిరి, హిమగిరి, ఉదయగిరి తదితర నౌకలతో పాటు సబ్‌మెరైన్లు సింధుకీర్తి, సింధుకేసరి, కోస్ట్‌గార్డు నౌకలు రివ్యూలో పాల్గొంటున్నాయి.


హిమగిరి, ఉదయగిరి ఒకేసారి

విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి మంగళవారం విశాఖపట్నంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా నౌకాదళంలో చేరాయి. వేర్వేరు షిప్‌యార్డుల్లో తయారై ఒకేసారి ఒకే చోట కమిషనింగ్‌ కావడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్టు 17ఏలో మొదటిదైన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ హిమగిరి (ఎఫ్‌34)ని కోల్‌కత్తాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించగా, ఉదయగిరి (ఎఫ్‌35)ని ముంబైలోని మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ రూపొందించింది. భారత నౌకాదళం వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. సూపర్‌ సోనిక్‌ క్షిపణులు, మీడియం రేంజ్‌ క్షిపణులు, 76 ఎంఎం మీడియం రేంజ్‌ గన్‌, 30 ఎంఎం, 12.7 ఎంఎం ఆయుధాలు, యాంటీ సబ్‌మెరైన్‌, సముద్రం అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు వీటిపై అమర్చారు.

ఐఎఫ్ఆర్‌కు రిహార్సల్స్‌ పూర్తి

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష నేపథ్యంలో భారత నౌకాదళం మంగళవారం రిహార్సల్‌ నిర్వహించింది. నౌకాదళాధిపతి దినేష్‌ కె త్రిపాఠి ఈ సమీక్ష చేశారు. ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధనౌక ముందు వెళుతుండగా, వెనుక ఐఎన్‌ఎస్‌ సుకన్యలో మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన సమీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. సముద్రంలో వరుసగా లంగరేసిన నౌకల మధ్య నుంచి రాష్ట్రపతి రథం నెమ్మదిగా వెళుతుండగా, ఆయా నౌకల్లోని సిబ్బంది డెక్‌ పైకి వచ్చి సుమేధకు సెల్యూట్‌ చేశారు. రిహార్సల్స్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో నేవీ కమోండోలు ప్రదర్శించిన సాహస విన్యాసాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


రాష్ట్రపతి రథం ప్రత్యేకత ఇదీ..

రాష్ట్రపతి రథంగా పిలుస్తున్న ఐఎన్‌ఎస్‌ సుమేధ.. సరయూ తరగతికి చెందిన యుద్ధనౌక. దేశీయ పరిజ్ఞానంతో గోవా షిప్‌యార్డులో తయారు చేశారు. ఇది 2014 మార్చిలో నౌకాదళంలో చేరగా, విశాఖపట్నం కేంద్రంగా తూర్పు నౌకాదళం నుంచి సేవలందిస్తోంది. ఇది తీర ప్రాంత గస్తీ నౌక. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి యుద్ధవిమాన వాహక నౌక. దీని బరువు 43 వేల టన్నులు. పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. ఎత్తు 59 మీటర్లు. ఇందులో 14 డెక్‌లు ఉంటాయి. 1,700 మంది సిబ్బంది ఉంటారు. దీనికోసం విశాఖపట్నం పోర్టు అవుటర్‌ హార్బర్‌లో ప్రత్యేకంగా జెట్టీ నిర్మిస్తున్నారు.

35 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న డేగా

తూర్పు నౌకాదళం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వైమానిక స్థావరం పేరు ఐఎన్‌ఎస్‌ డేగా. దీనిని 1991 అక్టోబరులో ప్రారంభించారు. 35 ఏళ్లు పూర్తి చేసుకోబోంది. ఇక్కడ జెట్‌ విమానాలను నడపడంలో పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఇక్కడే పౌర విమానాశ్రయం కూడా ఉంది. ఈ జూన్‌లో భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా నేవీనే ఉపయోగించుకోనుంది.


విశాఖ చేరుకున్న రాష్ట్రపతి

త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రత్యేక విమానంలో విశాఖకు విచ్చేశారు. ఐఎన్‌ఎస్‌ డేగాలో ఆమెకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భారత నౌకాదళం చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠిలు కూడా విశాఖకు వచ్చారు. వీరితో పాటు తూర్పు నౌకాదళం ఉన్నతాధికారులు, విశాఖకు చెందిన ప్రముఖ నాయకులకు రాష్ట్రపతి ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌ రాజ్‌పుత్‌ హాలులో రాత్రి విందు ఏర్పాటు చేశారు. తర్వాత రాష్ట్రపతి తన విడిదిచోళ సూట్‌కు వెళ్లిపోయారు.

విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు

ఐఎఫ్ఆర్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎంపీ ఎం.శ్రీభరత్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, నేవీ అధికారులు తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా పోర్టు గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని బస చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

బడులకు 5 స్టార్‌ రేటింగ్‌: లోకేశ్‌

సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ

Updated Date - Feb 18 , 2026 | 08:24 AM