ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్!
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:59 AM
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. కానీ, చాలాసందర్భాల్లో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించేసరికే అది ఏ మూడో దశలోనో, నాలుగో దశలోనో ఉంటుంది.
శానిటరీ న్యాప్కిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ గుర్తింపు
అంధులకు తోడుగా.. ఏఐతో పనిచేసే స్మార్ట్ కేన్
క్యాన్సర్ ముప్పును 15 ఏళ్ల ముందే గుర్తించే కిట్
బయో ఆసియా సదస్సులో వినూత్న ఆవిష్కరణలు
హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా-2026 సదస్సు వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన కంపెనీలతో పాటుగా ఆ రంగంలో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న సంస్థలెన్నో హైటెక్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ సదస్సులో.. తమ ఉత్పత్తులు, సేవలు, ఆవిష్కరణల గురించి తెలిపే ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటుచేశాయి. క్యాన్సర్‌ను కనీసం 15-20 సంవత్సరాలు ముందుగానే గుర్తించే కిట్ రూపకల్పనలో ఒకరు కృషి చేస్తుంటే.. ఒక్క కిట్‌తో ఏడు రకాల క్యాన్సర్‌లను నిర్ధారించే సాంకేతికతను ఆవిష్కరించిన వారు మరొకరు. వారి ఆవిష్కరణలను పరిశీలిస్తే..
రెట్రో ఇండికా ఏడు క్యాన్సర్ల కిట్
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. కానీ, చాలాసందర్భాల్లో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించేసరికే అది ఏ మూడో దశలోనో, నాలుగో దశలోనో ఉంటుంది. కానీ.. తాము రూపొందించిన ఒక్క కిట్‌తో థైరాయిడ్, రొమ్ము, క్లోమ, కాలేయ, పెద్ద పేగు, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ల ముప్పును ముందే గుర్తించవచ్చని రెట్రో ఇండికా సంస్థ చెబుతోంది. రక్తపరీక్ష ద్వారా ఈ క్యాన్సర్‌లను నిర్ధారించే ఫ్లోరోసెన్స్ కిట్‌ను ఉస్మానియా వర్సిటీ సాంకేతిక సహకారంతో ఆ సంస్థ రూపొందిస్తున్నట్లు ఓయూ ప్రొఫెసర్ ఎం. రాధాకృష్ణ తెలిపారు. క్యాన్సర్ నిర్థారణతో పాటు.. వ్యాధి దశలను కూడా తెలిపే ఫ్లోరోసెన్స్ రీడర్ మెషీన్‌ను కూడా అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. శరీరంపై కోత లేకుండా కేవలం రక్త నమూనా ద్వారా ఈ కిట్‌తో సుమారు రూ.200నుంచి రూ.400లోపే క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ అరుదైన కిట్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని రాధాకృష్ణ వివరించారు. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతి పొందిన తర్వాత ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని.. అందుకు దాదాపు ఆర్నెల్ల నుంచి ఏడాది దాకా సమయం పడుతుందని వెల్లడించారు. ఇక ఇదే సంస్థ.. కరోనా, ఇన్‌ఫ్లూయెంజాతో పాటు శ్వాసకోశ వ్యాధులను ముక్కులోని స్రావాల ద్వారా నిర్ధారించడంతోపాటు, వైరస్ లోడ్‌ను కనుగొనే ప్రత్యేక డివైజ్(కిట్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.100కే ఈ పరికరం లభ్యమవుతోందని రాధాకృష్ణ తెలిపారు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణకు స్క్రీనారి
దేశంలో ఏటా లక్షకు పైగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా 80 వేల మందికిపైగా మరణిస్తున్నారు. ప్రతి ముగ్గురు సర్వైకల్ క్యాన్సర్ బాధితుల్లో ఇద్దరు.. బాగా ముదిరిన తరువాత మాత్రమే ఈ మహమ్మారిని గుర్తించగలుతున్నారు. మరి, మహిళలను రక్షించుకునేదెలా? దానికి తమ ‘స్ర్కీనారి’యే ఒక మార్గమని ప్రవికామా ఇన్నోవేషన్స్ వ్యవస్ధాపకురాలు మాన్య సాహు అంటున్నారు. పుణెకు చెందిన ఈ సంస్థ అతి తక్కువ ఖర్చులో రూపొందించిన సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కిట్... స్ర్కీనారి. దీనిసాయంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును పదేళ్ల ముందే గుర్తించవచ్చని మాన్య పేర్కొన్నారు. దీని వాడడానికి కేవలం ఓ శానిటరీ న్యాప్కిన్ చాలు. తాము రూపొందించిన ప్రత్యేకమైన శానిటరీ ప్యాడ్‌లు స్త్రీ జననేంద్రియాల నుంచి స్రావాలను సేకరిస్తాయని, వాటిలోని బయోమార్కర్ల ఆధారంగా తాము పరీక్షలను చేస్తామని చెబుతున్నారామె. సాధారణంగా హాస్పిటల్స్‌లో చేసే ఇబ్బందికరమైన పరీక్షల అవసరాన్ని ఇది తప్పిస్తుందంటూనే, తమ ఇంటి వద్ద తామే శాంపిల్ కలెక్ట్ చేసుకునే అవకాశం మహిళలకు కలుగుతుందని, ఒక్క రాత్రి ఈ పాడ్‌ను ధరించి, ఉదయమే ఆ ప్యాడ్‌ను ల్యాబ్‌కు పంపితే కొన్ని గంటలలోనే ఫలితాలు మొబైల్‌లో వచ్చేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం పీజీఐఎంఈఆర్ చండీగఢ్‌లో ఈ కిట్ పనితీరుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయన్న ఆమె.. ఇది మార్కెట్లో అందుబాటులోకి రావడానికి రెండు సంవత్సరాల దాకా సమయం పడుతుందన్నారు. ఈ కిట్‌ను పరీక్షతో సహా రూ.1500 లోపు ఉండేలా చూస్తామన్నారు.

అంధులకు ఏఐ ఊత కర్ర
దృష్టిలోపంతో బాధపడేవారికి, అంధులకు చేతి కర్రలే ఆలంబన! ఆ చేతికర్రకే తెలివి ఉంటే? కృత్రిమ మేధతో పనిచేసే అలాంటి తెలివైన ఊతకర్రను తాము తయరుచేశామని క్వాడ్రిక్ ఐటీ సొల్యూషన్స్ సంస్ధ చెబుతోంది. ఈ సరికొత్త స్మార్ట్ ఏఐ కేన్ సాయంతో అంధులు ఎక్కడికైనా నిశ్చింతగా వెళ్లొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ స్మార్ట్ కేన్‌లో నేవిగేషన్ వ్యవస్ధ ఉంటుందని, అంతర్గతం ఆడియో ఏర్పాట్లు ఉండటం వల్ల.. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ముందే హెచ్చరిస్తుందని వివరించారు. ఇషాన్వీ సబ్నివీస్ అనే హైస్కూలు విద్యార్థిని ఆలోచనల నుంచి ఈ ఏఐ కేన్ పుట్టిందని.. దృష్టిలోపం ఉన్నవారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇది తోడ్పడుతుందని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సులువుగా రోగ నిర్ధారణ పరీక్షలు
గ్రామీణ ప్రాంతాలలో అందరికీ ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉండవు. మధుమేహ పరీక్షల వంటి చిన్నపాటి టెస్టులకు సైతం వేరే చోటికి వెళ్లాల్సొస్తుంది. ఇక పెద్ద పెద్ద టెస్టుల సంగతి చెప్పనే అక్కర్లేదు! అలాంటి వారికి చేరువలో, అతి తక్కువ ఖర్చులో పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేసే బయోస్పెకా్ట్ర యంత్రాన్ని తాము అభివృద్ధి చేశామని బయోమెక్సీయా హెల్త్‌కేర్ సంస్ధ ప్రతినిధులు తెలిపారు. ప్రజలే తమ ఆరోగ్య పరిస్థితులను స్వయంగా తెలుసుకునే విధంగా అనలాగ్ డివైజె్‌సను వారి అవసరాలకు తగినట్లుగా తయారుచేసి కూడా ఇవ్వగలమంటున్నారు.

నవజాత శిశువుల్లో కామెర్ల గుర్తింపునకు..
చుక్క రక్తం లేకుండా.. అసలు రక్తపరీక్షల అవసరమే లేకుండా.. నవజాత శిశువుల్లో కామెర్లను గుర్తించే యంత్రాన్ని.. జనిత్రి సంస్థ అభివృద్ధి చేసింది. శిశువుల హృదయ స్పందనను పర్యవేక్షించే పరికరాన్ని కూడా ఈ సంస్థ అభివృద్ధి చేసింది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. ఇది గర్భస్థ శిశువుల హార్ట్ రేట్‌ను పరీక్షిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.