Share News

అ‘ధర’హో.. అరటి క్వింటా రూ.25 వేలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:06 AM

పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు.

అ‘ధర’హో.. అరటి క్వింటా రూ.25 వేలు

  • రోజురోజుకీ పెరుగుతున్న ధరలు

  • అన్నదాతల హర్షం

తాడిమర్రి(అనంతపురం): పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. లాభాలు కళ్లచూస్తున్నారు. జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ధరలు ఇలాగే కొనసాగితే జిల్లా రైతులకు రూ.377 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.


నెలన్నర క్రితం పాతాళానికి..

అరటి క్వింటా ధర నెలన్నర క్రితం వరకు రూ.2 వేలు పలికింది. అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ధరకు విక్రయిస్తే పంట కోసే కూలీల ఖర్చులు కూడా రావని రైతులను గెలలను చెట్లపైనే వదిలేశారు. ఇంకొందరు వాటిని కోసే పశువులకు మేతగా వేశారు. ఇలా పెట్టుబడులు మొత్తంగా కోల్పోయి జిల్లాలో కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకున్నారు. అప్పట్లో అరటి రైతు కష్టాలపై తీవ్ర చర్చ సాగింది.


పెరుగుతూనే..

పాతాళానికి పడిపోయిన అరటి ధరలు చిన్నగా పెరుగుతూ వచ్చాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అరటికి డిమాండ్‌ పెరగడంతో రోజురోజుకీ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.25 వేల వరకు టన్ను ధర పలుకుతోంది. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెడుతున్నారు. సాగు ఖర్చులు పోను రూ.లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పండే అరటిని ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.


aarati1.jpgలాభాలు వస్తున్నాయి

ఆరెకరాల్లో 7,200 అరటి మొక్కలు సాగుచేశా. గెల 25 నుంచి 30కిలోల బరువు ఉంది. రూ.625 వరకు ధర పలుకుతుంది. ఖర్చులన్నీ పోను మంచి లాభంతోనే బయటపడతాం.

-ఆదినారాయణ, రైతు, రామాపురం


20 టన్నులు వచ్చినా చాలు

అరటి ధర తక్కువగా ఉందని బాధపడేవారం. ప్రస్తుతం టన్ను రూ.25వేల వరకు పలుకుతోంది. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వచ్చినా చాలు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.

-రమణ, రైతు, చిల్లకొండయ్యపల్లి


ఇలాంటి ధర కోసమే ఎదురుచూశాం

డిసెంబరులో ధరలు దారుణంగా పడిపోయాయి. తీవ్ర నష్టాలు తప్పవనుకుంటున్న తరుణంలో టన్ను రూ.22వేలతో అమ్ముతున్నాం. ఇలాంటి ధరల కోసం రెండు నెలలుగా ఎదురుచూశాం.

-భక్తవత్సలం, రైతు, తురకవారిపల్లి


ఈ వార్తలు కూడా చదవండి:

కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్‌ ప్లాంట్‌

మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2026 | 11:06 AM