Share News

48 ఏళ్లుగా పోరాటం

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:00 PM

పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు.

48 ఏళ్లుగా పోరాటం

  • పట్టా ఉన్నా సాగు చేసుకోలేని రైతులు

  • అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం

రొద్దం(అనంతపురం): పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు. మండలంలోని గౌరాజుపల్లి రైతులకు 1978లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. సర్వేనంబరు 731-4లో సుబ్బరాయుడు 1.14ఎకరాలు, 637లో పెద్దమల్లప్పకు మూడెకరాలు, చిన్న మల్లప్పకు 637-3లో 2.14ఎకరాల భూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది.


అయితే అప్పటి నుంచి ఆ భూములు సాగు చేయకుండా కొందరు అడ్డు తగులుతున్నారు. పొలం సాగుచేయడానికి వెళ్తే రాళ్లు, కట్టెలతో దాడులు చేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. భూమి కోసం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ 48ఏళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఒక్క రోజైనా...

ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిన 1.14ఎకరాల భూమిలో ఒక్కరోజైనా దున్నాలని సుబ్బరాయుడు పరితపించాడు. అది నెరవేరకుండానే ఇటీవల మృతి చెందాడు. వారసత్వంగా ఆ భూమి ఆయన భార్య శాంతమ్మకు సంక్రమించింది. ఆమె పేరుపై పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. అయితే ఆమె కూడా మృతి చెందడంతో వారసులు మాధవయ్య, సుబ్బరాయుడు, శంకరప్పలు 0.48సెంట్లు చొప్పున పంచుకుని పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్నారు. అయితే ఆ ముగ్గురు భూమి సాగుచేయడానికి వెళ్తే కొందరు దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు. 2005లో నారాయణప్ప అనే రైతుకు 731-3లో 1.17ఎకరాల భూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది.


ఉగ్రనరసింహ అనే రైతుకు 731-4లో 1.17ఎకరా భూమికి పట్టా ఇచ్చింది. ఈ భూముల్లోకి గత 20ఏళ్లుగా రానీయకుండా స్థానికంగా కొందరు అడ్డుకుంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పెద్దమల్లప్పకు 637లో 3ఎకరాల భూమికి 1978లో పట్టా ఇచ్చింది. అయితే అందులో 30సెంట్లను ఓ సామాజికవర్గం వారు ఆక్రమించారని బాధిత రైతు వాపోయాడు. చిన్న మల్లప్పకు 2.14ఎకరాలు భూమిని పట్టా ఇచ్చింది. అయితే ఈ రైతులను వారి భూమిపైకి రాకుండా ఓ సామాజికవర్గం వారు అడ్డుకుంటున్నారు. దీనిపై తహసీల్దార్‌ ఉదయ్‌శంకర్‌రాజును వివరణ కోరగా ఈ విషయం వారం కిందట తన దృష్టికి వచ్చిందని, సర్వేచేసి బాధిత రైతులకు న్యాయం చేస్తామన్నారు.


ఆత్మహత్యలే శరణ్యం..

1978లో ప్రభుత్వం నా పేరుమీద సర్వేనంబరు 637లో మూడెకరాలకు పట్టా ఇచ్చింది. గౌరాజుపల్లికి చెందిన ఓ సామాజిక వర్గం వారు భూమి తమదంటూ 48ఏళ్లుగా దౌర్జన్యం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్‏స్టేషన్‌, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఆత్మహత్యలే శరణ్యం.

-పెద్దమల్లప్ప, గౌరాజుపల్లి


20ఏళ్లుగా పోరాటం

2005లో రెండో విడత భూపంపిణీలో ప్రభుత్వం సర్వేనంబరు 731-4లో 1.17ఎకరాల భూమికి పట్టా ఇచ్చింది. సాగుకోసం వెళ్తే కొంతమంది దాడులు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలిపినా న్యాయం జరగలేదు. వారికి భయపడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథులులేరు.

-ఉగ్ర నరసింహ, గౌరాజుపల్లి


ఈ వార్తలు కూడా చదవండి:

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2026 | 12:00 PM