Share News

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:04 PM

చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

- 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గుదల

- లబోదిబోమంటున్న రైతులు

పుట్లూరు(అనంతపురం): ధరలు తగ్గడంతో చామంతి రైతులు కుదేలవుతున్నారు. కేవలం 15రోజుల వ్యవధిలోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో చామంతి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత నెలలో ఆశాజనకంగా కనిపించిన ధరలు హఠాత్తుగా పాతాళానికి పడిపోయాయి. గత నెలలో టన్ను రూ.లక్షకు పైబడి అమ్ముడుపోగా ప్రస్తుతం రూ.30వేలకు పడిపోయింది. పుట్లూరు మండలంలో సుమారు 200ఎకరాల్లో వివిధ రకాల పూలతోటలను సాగుచేస్తున్నారు. అరకటవేముల, కొండాపురం, సూరేపల్లి, గొల్లపల్లి, పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లి, కొత్తపల్లి, ముచ్చుకోట తదితర గ్రామాల్లో పూల తోటలు సాగు చేస్తున్నారు.


pandu3.4.jpg

రెండు వారాల్లో తలకిందులు

చామంతి పూల ధరలు సరిగ్గా రెండు వారాల కిందట కిలో రూ.90నుంచి వంద దాకా ఉండేవి. ప్రస్తుతం కిలో రూ.20నుంచి రూ.30 ధరతో అమ్ముడుపోతున్నాయి. అవికూడా వ్యాపారులు తీసుకు రమ్మంటేనే కోత కోస్తున్నారు. లేకపోతే కోత కోసే పరిస్థితి కూడా లేదని చామంతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోసిన పూలను నెల్లూరు, గుంటూరు, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ధరలేకపోవడంతో రైతులే వ్యాపారులకు ఫోన్లు చేసి తమ పంటను కొనుగోలు చేయాలని బతిమాలుతున్నారు.


pandu3.2.jpg

పెట్టుబడి ఎకరాకు లక్షపైమాటే..

నాలుగు నెలల పంట కాలం ఉండే చామంతిని ఎకరాలో సాగు చేయాలంటే లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దిగుబడి ఎకరాకు ఐదారు టన్నుల మేర వస్తోంది. గత ఏడాది ధర బాగుండటంతో ఈ ఏడాది మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లో చామంతిపూల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దీంతో దిగుబడి పెరిగి పూలకు డిమాండ్‌ లేక ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మూఢం కొనసాగుతుండటంతో ఎటువంటి శుభకార్యాలు జరగడం లేదు. దీంతో పూలకు గిరాకీ కూడా తగ్గింది. ఫిబ్రవరి రెండో వారం వరకు చామంతి రైతులకు కష్టాలు తప్పవని పలువురు పేర్కొంటున్నారు.


నష్టాలు తప్పవు

చామంతి పూల ధరలు ఇలాగే కొనసాగితే నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఈ సారి పూలతోటలు రెండెకరాల్లో సాగు చేశా. ఇప్పటికే రూ.2లక్షల మేర పెట్టుబడి పెట్టా. దిగుబడి బాగా ఉన్నా ధరలు లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. మార్కెట్‌లో పూలను అడిగే వ్యాపారులే కరువయ్యారు.

-శివప్రసాద్‌, రైతు, సూరేపల్లి


ఆశలన్నీ సంక్రాంతిపైనే..

వచ్చే సంక్రాంతిపై ఆశలు పెట్టుకున్నాము. ధర కొంచెం పుంజుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. మూడెకరాల్లో రూ.3లక్షల మేర పెట్టుబడులు పెట్టి పంట సాగుచేశా. మొదట్లో రేటు బాగా ఉన్నప్పటికి 15రోజుల నుంచి ధరలు అమాంతం పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సంక్రాంతి పండుగకైనా ధర పెరిగితే గట్టెక్కుతాం.

- రామాంజనేయులు, రైతు, సూరేపల్లి


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 07 , 2026 | 12:05 PM