Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:57 AM
అరటి సాగు చేసిన రైతులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల్లో రూ. 4వేల వరకు ధర తగ్గిపోవడంతో రైతలరే ఏమి చేయాలో అర్ధంగాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులతో తగ్గిన ఎగుమతులు
- వ్యాపారుల సిండికేట్!
- దెబ్బకొడుతున్న చాక్లెట్ తెగులు
- మొదటి పంట టన్ను రూ.17వేలు
అరటి ధరలు అమాంతం తగ్గిపోయాయి. నాలుగు రోజుల వ్యవధిలో టన్నుపై ఏకంగా రూ.4వేలు తగ్గాయి. ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులతో ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. దానిని సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్ అయి, ధరలను తగ్గించేశారని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చాక్కెట్ తెగులు సైతం వ్యాపిస్తోంది. తెగులు సోకిన పంటను కొనేవారు కరువయ్యారు. దీంతో అన్నదాతలు కుదేలవుతున్నారు.
యాడికి(అనంతపురం): పూర్తిగా పడిపోయిన అరటి ధరలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు టన్ను రూ.21వేలు పలికిన అరటి ఉన్నట్లుండి రూ.17వేలకు పడిపోయింది. నాలుగు రోజుల వ్యవధిలో అరటి ధరలు పడిపోవడానికి కారణం వ్యాపారుల సిండికేట్ అవడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. అరటి వ్యాపారులు మాత్రం ఇరాన్‌లో ఆందోళనల నేపథ్యంలో ఎగుమతులు తగ్గిపోయాయనీ, ఇదే ధరలు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.
మండలవ్యాప్తంగా 1200ఎకరాలకుపైగా అరటి మొదటి పంట సాగు చేశారు. ప్రస్తుతం పదుల ఎకరాల్లో కోతకు వచ్చింది. ఇరాన్‌లో యుద్ధ వాతావరణం ఒకవైపు, వ్యాపారుల సిండికేట్ మరోవైపు, చాక్లెట్ తెగులు ఇంకో వైపు వెరసి.. టన్ను రూ.21వేలు ఉన్న అరటి అమాంతం రూ.17వేలకు పడిపోయింది. నెలాఖరు, ఫిబ్రవరిలో దిగుబడికి వస్తాయి. ధరలు ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వ్యాపారుల సిండికేట్
ప్రస్తుతం అరటి ఎగుమతులు కొనసాగుతున్నా.. ఇరాన్‌లో ఆందోళనలను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను అమాంతం తగ్గించేశారని రైతులు చర్చించుకుంటున్నారు. దిగుబడికి వచ్చిన అరటి పంటను తోటలోనే ఉంచలేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో, మూడో పంటలకు ధరలులేక తీవ్రంగా నష్టపోయామనీ, ఇప్పుడు వ్యాపారుల సిండికేట్‌తో మొదటి పంటకు కూడా నష్టపోవాల్సి వస్తోందని పలువురు అరటి రైతులు తెలిపారు.
చాక్లెట్ తెగులు ప్రభావం
అరటిని చాక్లెట్ తెగులు ఆశిస్తోంది. తెగులు సోకిన అరటి దిగుబడిని కొనడానికి వ్యాపారులు మొగ్గుచూపడం లేదు. కొన్నా.. చాలా తక్కువ ధరలకు అడుగుతున్నారను. చాక్లెట్ తెగులు సోకితే అరటికాయ రంగు కాంతివంతంగా ఉండదు. తోలుతీసి చూస్తే లోపల చాక్లెట్ రంగులో నల్లటి మచ్చలు ఉంటాయి. చాక్లెట్ మచ్చలు ఏర్పడిన అరటికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పోషకాల లోపంతో చాక్లెట్ తెగులు సోకుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. చాక్లెట్ తెగులు సోకిన అరటి దిగుబడిని కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యుద్ధం అని టన్నుపై రూ.5వేలు తగ్గించారు
ఆరెకరాల్లో అరటి సాగుచేశా. వారంరోజుల క్రితం అరటి మొదటి పంట టన్ను రూ.22 వేలు ధర పలికింది. ఇరాన్‌లో యుద్ధం అని చెప్పి వ్యాపారులు ధర అమాంతం తగ్గించేశారు. టన్ను రూ.17వేల నుంచి 18వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఇరాన్‌లో యుద్ధం జరుగుతోందనీ, ఎగుమతులు తగ్గిపోయాయనీ, తామేమి చేస్తామని అంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి సాగుకు లక్షలకు లక్షలు ఖర్చుచేశాం. తగ్గిన ధరలతో అరటి రైతు డీలా పడాల్సి వస్తోంది.
-త్రినాథ్‌రెడ్డి, రైతు, వెంగన్నపల్లి
వ్యాపారుల సిండికేట్‌తోనే..
అరటి వ్యాపారులు ఎప్పటికప్పుడు సిండికేట్ అవుతూ ధరలను ఇష్టానుసారంగా తగ్గించేస్తున్నారు. వారంరోజుల క్రితం అరటి మొదటి పంట రూ.22 వేల వరకు పలికింది. ఇప్పుడేమో టన్ను రూ.17వేల నుంచి రూ.18వేలు అంటున్నారు. ఇరాన్ యుద్ధం అంటున్నారు. చాక్లెట్ తెగులు అని చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాలు చెప్పి అరటి ధరలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
-అనిల్‌కుమార్, అరటిరైతు, రాయలచెరువు
ఇరాన్‌కు తగ్గిన ఎగుమతులు
అరటి ఎక్కువగా ఇరాన్‌కు ఎగుమతి అవుతుంది. ఇటీవలిగా ఇరాన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడడంతో అరటి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరాక్‌కు మాత్రమే కొద్ది మొత్తంలో అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరటి ధరలు అమాంతం పడిపోయాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇరాన్‌కు ఎగుమతులు మొదలయ్యేదాకా పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. ఈలోపు అరటి దిగుబడి వచ్చే రైతులకు ధరలు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవన్న చర్చ వినిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News