Share News

ఐకానిక్‌ కూల్‌ కూల్‌!

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:33 AM

రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాలకు సెంట్రలైజ్డ్‌ కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఐకానిక్‌ కూల్‌ కూల్‌!

  • ఆ భవనాలకు సెంట్రలైజ్డ్‌ ఏసీ.. సింగపూర్‌, దుబాయ్‌ తరహా ‘డిస్ట్రిక్ట్‌’ కూలింగ్‌ వ్యవస్థ

  • ఒకే చోట ప్లాంటు, భూగర్భ పైపులైన్‌తో సరఫరా

  • 30,000 టీఆర్‌ సామర్థ్యంతో ప్లాంటు నిర్మాణం

  • పీపీపీ పద్ధతిలో రూ.415 కోట్లతో భారీ ప్రాజెక్టు

  • పర్యావరణహితం.. 40 శాతం విద్యుత్‌ ఆదా

గుంటూరు(రాజధాని), సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాలకు సెంట్రలైజ్డ్‌ కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దుబాయ్‌, సింగపూర్‌ వంటి అంతర్జాతీయస్థాయి నగరాల్లో కనిపించే ఈ అత్యాధునిక కూలింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అమరావతిని కూడా ఆ నగరాల సరసన నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అధునాతన డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ ప్రొసీజర్‌(డీసీపీ) ద్వారా ఐకానిక్‌ సెక్రటేరియట్‌ భవన సముదాయమైన జీఏడీ టవర్‌, 4 హెచ్‌వోడీ టవర్లు, సీఎం కార్యాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు ఏసీ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనికిగాను రూ.415 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో సీఆర్డీఏ అధికారులు ఇటీవల టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు అవకాశం ఉంది. టెండర్‌ దక్కించుకున్న సంస్థ ఏడాదిన్నరలో పనులు పూర్తిచేసి, 30 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ భారీ అత్యాధునిక ప్రాజెక్టును పీపీపీ పద్థతిలో బిల్ట్‌-డెవల్‌ప-ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు. కాంట్రాక్ట్‌ సంస్థకు లీజు రూపంలో స్థలాన్ని కేటాయిస్తారు. కూలింగ్‌ యాజ్‌ ఏ సర్వీస్(సీఏఏఎస్‌) మోడల్‌లో ఈ ప్రాజెక్ట్‌ నడుస్తుంది.


హరిత ఇంధనంతో..

పర్యావరణహిత విధానంలో ఏర్పాటు చేసే ఈ డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ విధానంలో పెద్ద మొత్తంలో కరెంటు కూడా ఆదా కానుంది. విడివిడిగా ఏసీలు పెట్టడం వల్ల కరెంట్‌ బిల్లులు పెరగడమే కాకుండా పర్యావరణానికి హాని చేేస గ్రీన్‌హౌస్‌ వాయువులు భారీగా విడుదలవుతాయి. సెంట్రలైజ్డ్‌ కూలింగ్‌ విధానంతో ఈ నష్టం భారీగా తగ్గనుంది. 30-40 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో హరిత ఇంధనాన్ని వినియోగించి ప్లాంట్‌ నడిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

డీసీపీ ఎలా పనిచేస్తుందంటే..

సాధారణంగా ప్రతి ఆఫీస్‌ లేదా గదికి విడివిడిగా ఏసీలు వాడతారు. డిస్ర్టిక్ట్‌ కూలింగ్‌ విధానం(డీసీపీ)లో ఒకే ఒక ప్లాంటు ఉంటుంది. 1,350 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రభుత్వ భవన సముదాయం పరిధిలో ఒకే ఒక సెంట్రలైజ్డ్‌ రిఫ్రిజిరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. 30వేల టన్నుల కూలింగ్‌(టీఆర్‌) సామర్థ్యంతో ప్లాంట్‌ పనిచేస్తుంది. ఇక్కడి నుంచి ఏసీ సరఫరా చేయాలనుకున్న అన్ని భవనాలకు భూగర్భ పైపులైన్లు అమరుస్తారు. చల్లదనం పోకుండా వాటిని ఇన్సులేట్‌ చేస్తారు. ఈ భూగర్భ ఇన్సులేటెడ్‌ పైపులైన్ల నెట్‌వర్క్‌ ద్వారా శీతల గాలిని ప్రతి ప్రభుత్వ భవనానికి పంపిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 06:44 AM