Share News

రెండో దశలోనూ కూటమి జయభేరి!

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:22 AM

పల్లె ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కడుతున్నారు

రెండో దశలోనూ కూటమి జయభేరి!
vijayothsham

  • 3350కిపైగా పంచాయతీల్లో ఘనవిజయం

  • 1330 చోట్ల వైసీపీ మద్దతుదారుల గెలుపు

  • 190కిపైగా స్థానాలు స్వతంత్రుల కైవసం

  • 2 దశల్లో కలిపి 8924 చోట్ల ఎన్నికలు

  • వీటిలో 6083 కూటమి కైవసం

  • 2400 స్థానాల్లో వైసీపీ గెలుపు

పంచాయతీ మలి సమరంలోనూ కూటమి విజయదుందుభి మోగించింది. 4975 పంచాయతీలకు భారీగా పోలింగ్‌ నమోదు కాగా.. కడపటి వార్తలందేసరికి పాలక కూటమి మద్దతుదారులు 3350కిపైగా గ్రామాల్లో విజయం సాధించారు. వైసీపీ బలపరచిన అభ్యర్థులు సుమారు 1330 పంచాయతీల్లో పాగా వేశారు. ఇతరులు సైతం 190 దాకా గెలుచుకున్నారు. వీరిలో కూటమి రెబల్సే ఎక్కువని తెలుస్తోంది. మిగతా పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పల్లె ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కడుతున్నారు. తొలి విడత పంచాయతీ పోరులో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి పట్టాభిషేకం చేసిన గ్రామీణ ప్రజలు.. రెండో విడతలోనూ దానికే జై కొట్టారు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 4975 పంచాయతీలకు గాను.. అర్ధరాత్రి 11 గంటల సమయానికి కూటమి బలపరచిన అభ్యర్థులు 3350కి పైగా స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ కూడా 1331 పంచాయతీల్లో గెలుపొందింది. మరో 190కి పైగా స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఈ నెల 26న జరిగిన తొలి విడత ఎన్నికల్లో 3949 పంచాయతీలకు గాను కూటమి 2724 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ 1104 స్థానాలకు పరిమితమైంది. ఓటమిపాలవుతామనే ఆందోళనతో ఆదివారం వైసీపీ మూకలు పలు చోట్ల విధ్వంసాలకు దిగాయి. హింసాకాండతో ఓటర్లను భయబ్రాంతులను చేసేందుకు ప్రయత్నించాయి. అయితే వైసీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టి.. కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థులకు విజయాలను కట్టబెట్టారు. మొదటి దశ విజయాల్లో కూటమి 68.9 శాతం స్ట్రయిక్‌ రేట్‌ సాధించగా.. రెండో విడతలో సుమారు 67.5 శాతం స్ట్రయిక్‌ రేట్‌ సాధించింది.తొలి దశ ఫలితాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. తొలి దశలో పార్వతీపురం మన్యం జిల్లాలో 226 స్థానాలకు 61 స్థానాలు గెలుచుకున్న వారు.. రెండో దశలో అదే జిల్లాలో 146 స్థానాలకు 47 స్థానాల్లో విజయం సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొలి దశలో 66 స్థానాలకు 26 స్థానాలు గెలుచుకున్న వైసీపీ.. రెండో దశలోనూ 87 స్థానాలకు 37 స్థానాలకుపైగా దక్కించుకుంది. కూటమి 35 పంచాయతీల్లో విజయం సాధించింది. పోలవరం జిల్లాలో కూటమి కాస్త ఆధిక్యంలో నిలిచింది.


tdp3 copy.jpgశ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తొలి దశలో 60, 71 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ.. ఈసారి చెరో 81 స్థానాలను గెలుచుకుంది. గోదావరి జిల్లాల్లో కూటమి ధాటికి వైసీపీ మద్దతుదారులు కుదేలయ్యారు. నెల్లూరు తప్ప కోస్తా జిల్లాలన్నిటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో 297 పంచాయతీలకు గాను ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 197 గెలుచుకోగా.. వైసీపీ 72 చోట్ల విజయం సాధించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 630 పంచాయతీల్లో కూటమి హవా కొనసాగింది. సీమ జిల్లాల్లో వైసీపీ ఓ మోస్తరు విజయాలు సాధించింది. అనంతపురంలో 186కి గాను 63, శ్రీసత్యసాయిలో 169కి 80 చోట్ల గెలిచింది. కర్నూలు జిల్లాలో 186కి 59, నంద్యాలలో 195కి 58 స్థానాలను కైవసం చేసుకుంది. మిగతావన్నీ కూటమి ఖాతాలోనే పడ్డాయి. కడప జిల్లాలో 202 పంచాయతీలకు గాను కూటమి 132 గెలుచుకోగా.. వైసీపీ 65, ఇతరులు 2 చోట్ల గెలిచారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి రెండో విడత ఫలితాలు వెలువడ్డాక.. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో కలిపి మొత్తం 8924 స్థానాలకు గాను కూటమి 6083 చోట్ల విజయం సాధించగా.. వైసీపీ 2435 స్థానాల్లో గెలిచింది. మూడో విడతలో 3307 స్థానాలకు రెండో తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఇక 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఈ నెల 26న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. వాటికి సోమవారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 04:40 AM