‘స్థానిక’ రిజర్వేషన్ల కోసం ఓటర్ల గుర్తింపు
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:23 AM
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ శనివారం పేర్కొంది.
‘స్థానిక’ రిజర్వేషన్ల కోసం ఓటర్ల గుర్తింపు
8 నుంచి ఇంటింటి సర్వే.. 21న తుది జాబితా
విజయనగరం కార్పొరేషన్, 58 మున్సిపాలిటీలు,
నగర పంచాయతీల పరిధిలో ప్రక్రియ
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ శనివారం పేర్కొంది. 2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకొని, వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఓటర్ల జాబితాలను వార్డు, పోలింగ్ స్టేషన్ వారీగా విభజించి ఈ నెల 8 నుంచి 12 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను వివిధ రంగుల ఇంకులతో మార్క్ చేస్తారు. అనంతరం 14న ముసాయిదా ఓటర్ల జాబితాలను మున్సిపల్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రచురిస్తారు. వీటిపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలుకు 15 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. 19, 20 తేదీల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి వాటిని మెరిట్ ఆధారంగా పరిష్కరిస్తారు. 21న తుది ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపులను నమోదు చేస్తారు.
ఈ వార్తలను కూడా చదవండి
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?