Share News

అమరావతి సంగమానికి 759 కోట్లు

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:18 AM

రాజధాని అమరావతి నిర్మాణాలు మరో అడుగు ముందుకేశాయి. రాజధానిలోని శాఖమూరు వద్ద ’అమరావతి సంగమం’ నిర్మాణానికి సంబంధించి రూ.759 కోట్ల అంచనాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఒకే ప్రాంగణంలో రాష్ట్ర పబ్లిక్‌ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌ గవర్నెన్స్‌ భవనాలు నిర్మాణాలు కానున్నాయి.

అమరావతి సంగమానికి 759 కోట్లు

  • ఒకే ప్రాంగణంలో లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌.. శాఖమూరు వద్ద నిర్మాణం

  • పౌల్ర్టీ రంగ అభివృద్ధి, విస్తరణ లక్ష్యంగా ముసాయిదాను ఆమోదించిన క్యాబినెట్‌

  • పొగాకు రైతులకు ధర లోటు కింద 94 కోట్లు.. ఎర్రుపాలెం-నంబూరు లైన్‌కు భూసమీకరణ

  • రాజమండ్రి ఈఎస్ఐ 100 పడకలకు పెంపు.. పోలీసులకు కొత్తగా 4,760 వాహనాలు

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణాలు మరో అడుగు ముందుకేశాయి. రాజధానిలోని శాఖమూరు వద్ద ’అమరావతి సంగమం’ నిర్మాణానికి సంబంధించి రూ.759 కోట్ల అంచనాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఒకే ప్రాంగణంలో రాష్ట్ర పబ్లిక్‌ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌ గవర్నెన్స్‌ భవనాలు నిర్మాణాలు కానున్నాయి. రాష్ట్రంలో పౌల్ర్టీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, మార్కెట్‌, ఎగుమతి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా రూపకల్పన చేసిన ఏపీ పౌల్ర్టీ డెవల్‌పమెంట్‌ పాలసీ 2026-29కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు డీపీఎల్‌ నుంచి రూ.310.080 కోట్లు, ఏపీహెచ్‌ఆర్‌డీఐ నుంచి రూ.277.649 కోట్లు నిధుల సమీకరణ చేయనున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.


క్యాబినెట్‌ ముఖ్య తీర్మానాలు..

  • అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి 100 మీటర్ల బఫర్‌తోపాటు రాజధాని నగర సరిహద్దు నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వరకు గ్రిడ్‌ రోడ్ల విస్తరణకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద భూములు సేకరణకు క్యాబినెట్‌ అధికారం కల్పించింది.

  • రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి 50పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌.

  • జల్‌జీవన్‌ మిషన్‌ 2.0 నిర్దేశించిన గడువులోగా గ్రామాల్లో ’హర్‌ ఘర్‌ జల్‌’ లక్ష్యం వేగవంతం.

  • పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కొత్తగా 4,760 వాహనాల కొనుగోలుకు నిర్ణయం.

  • రూ.324.20కోట్ల టర్మ్‌లోన్‌కు ప్రభుత్వ పూచీకత్తు.

  • పల్నాడు జిల్లా అచ్చమ్మకుంటలో వెటర్నరీ డిస్పెన్సరీ ఏర్పాటు.

  • 2026-27 మార్కెటింగ్‌ సీజన్‌లో తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర అమలుకు నిర్ణయం.

  • పొగాకు సీజన్‌లో 94 మిలియన్‌ కిలోల తక్కువ రకం పొగాకు కొనుగోలుకు సంబంధించి ధర లోటు భర్తీ మద్దతు కింద రూ.94కోట్లు ఇవ్వడానికి ఆమోదం.

  • కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రూ.624.88లక్షల విలువైన 78 వరద నష్ట నివారణ పనులకు ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకున్న చర్యలకు ఆమోదం.

  • అమరావతిలోని టైప్‌ బీ, సీ, డీ, ఈ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం రోడ్లకు సిమెంట్‌ కాంక్రీటుకు బదులు బిటుమినస్‌ (ఫ్లెక్సిబుల్‌) పేవ్‌మెంట్లను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం.

  • ట్రాన్స్‌కో మెస్సెర్స్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న మధ్యకాలిక రుణం చెల్లింపునకు పూచీగా రూ.950కోట్ల ప్రభుత్వ హామీ.


ఏపీఐఐసీకి..

  • చిత్తూరు జిల్లా వావిల్‌తోట గ్రామంలో 18.20ఎకరాల భూమిపారిశ్రామిక పార్కు కోసం ఎకరా రూ.28.75లక్షల చొప్పున బదిలీ. ఇదే జిల్లా పోగురుపల్లెలో 50.56 ఎకరాల భూమి; కోసల నగరంలో 17.13 ఎకరాలను పారిశ్రామిక పార్కు అప్రోచ్‌ రోడ్డు ఏర్పాటుకు, తెనబండలో 10.33 ఎకరాలు ఆ సంస్థకు బదిలీ.

  • కొత్త కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, జిల్లా కార్యాలయాల నిర్మాణానికి మార్కాపురం మండలం గోగులదిన్నెలో 20.01 ఎకరాల భూమి ఉచితంగా బదిలీ.

  • కడప జిల్లా దువ్వూరులో 25ఎకరాల భూమిని పీఎం కుసుమ్‌ ఫీడర్‌ లెవల్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు లీజుకు బదులుగా, మార్కెట్‌ విలువపై బదిలీకి ఆమోదం.

  • విజయవాడ రూరల్‌ వేమవరంలో 10.21 ఎకరాల ప్రభుత్వభూమి ఏపీ ఎకనామిక్‌ సిటీస్‌ప్రమోషన్ అండ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు కేటాయింపు.


ప్రాజెక్టులపై వైసీపీ విషం

బాధ్యతారాహిత్యంతో వ్యవహరించే ప్రతిపక్షం ఉండటం రాష్ట్రం దురదృష్టమని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ‘‘నిన్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తే.. ఇతర ప్రాంతాలకు దాని వల్ల నష్టం అంటూ ప్రాంతీయ విద్వేషాలను గొడ్డలి పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారు. పోలవరం, వెలుగొండ, అమరావతిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతి నుంచి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థను ఎత్తేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 05:14 AM