బీసీలకు 34 శాతం కోటా చరిత్రాత్మకం
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:28 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. మెగా డీఎస్సీపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్మూ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
నాడు ఎన్టీఆర్.. ఇప్పుడు బాబుతోనే న్యాయం
జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి
‘జయహో బీసీ’ సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రిజర్వేషన్ల గండికి గొడ్డలి పార్టీ యత్నం: మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీకి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి: పల్లా శ్రీనివాసరావు
బీసీల్లో వెలుగు నింపిన చంద్రబాబు: చింతకాయల విజయ్
నర్సీపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. మెగా డీఎస్సీపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్మూ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీసీలు తమకు లభించిన వచ్చిన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాసరావును నియమించడం బీసీలకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఎన్.టి.రామారావు రాజకీయాల్లోకి రాకముందు బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉండేవారని గుర్తుచేశారు. తాను 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా, గెలిచానని గుర్తుచేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు వేశారని, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకురావడం ద్వారా దశాబ్దాల కలను చంద్రబాబు సాకారం చేశారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. 1983 తర్వాత అన్న ఎన్టీఆర్ ఆధ్వర్యంలో బీసీలకు గుర్తింపు వచ్చిందని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
బీసీలకు ప్రాధాన్యం పెంచారు: పల్లా
బీసీలకు 34 శాతం కల్పించి, వారికి రాజకీయ ప్రాధాన్యతను సీఎం మరింత పెంచారని పల్లా తెలిపారు. బీసీ బిడ్డలపై దాడులకు తెగబడిన పార్టీ గొడ్డలి పార్టీ అని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చట్టం చేసి 34 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. ‘‘1983లోనే బీసీలకు ఎన్‌టీఆర్ 20 శాతం రిజర్వేషన్ కల్పించారు. చంద్రబాబు 1996లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 137 వెనుకబడిన కులాలకు మంచి జరిగింది. బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కోర్డుల చుట్టూ తిరుగుతున్న వైసీపీకి స్థానిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి’’ అని పల్లా కోరారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో చంద్రబాబు వెలుగులు నింపారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ సెల్ ఫోన్‌లో టార్చ్ లైట్లు వెలిగించి చూపాలని కోరారు. ‘‘వైసీపీ ప్రభుత్వం నాడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు నరకం చూపించింది. అందుకే 53 దీపాలు వెలిగించాం. మొదట రూ.3 వేల కోట్ల స్కామ్ చేశారు. కానీ, చివరికి ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు.’’ అని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఈ సభలో ఎమ్మెల్యేలు శంకర్, మామిడి గోవిందరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి