‘స్థానికం’లో బీసీలకు 34% కోటా సమర్థనీయమే
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:19 AM
రాష్ట్రంలోని పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, 33.33% చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవోలు సరైనవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. శాస్త్రీయ సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
కుటుంబ సర్వే, మిశ్రా కమిషన్ అధ్యయనం ఆధారంగా నిర్ణయం.. బీసీ జనాభా 50.42%
హైకోర్టులో పురపాలక, పంచాయతీరాజ్ శాఖల కౌంటర్లు.. పిల్ కొట్టివేతకు వినతి
కుటుంబ సర్వే, మిశ్రా కమిషన్ అధ్యయనం ఆధారంగా నిర్ణయం
హైకోర్టులో పురపాలక, పంచాయతీరాజ్ కౌంటర్లు
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, 33.33% చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవోలు సరైనవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. శాస్త్రీయ సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ‘రిజర్వేషన్లపై 2020లో హైకోర్టు విచారణ జరిగిన నాటికి, ఇప్పటికి గణనీయమైన మార్పులు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చేపట్టిన బీసీ గణనలో రాష్ట్రవ్యాప్తంగా వారి జనాభా 50.42 శాతంగా ఉన్నట్లు తేలింది. బీసీల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ చేసిన అధ్యయనం ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించాం’ అని పేర్కొంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి బీవీఏపీ కుమారరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవో 105, 1065 రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిల్‌పై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం... అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖలు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి.
కౌంటర్లలో ఏముందంటే
‘స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ విషయం లో రాజ్యాంగంలోని అధికరణ 243డీ(6), 243టీ(6)లలో స్పష్టమైన ప్రతిపాదన ఉంది. వీటి ఉద్దేశం వనరుల పంపిణీల్లో ప్రాతినిధ్యం కల్పించడం మాత్రమే కాదు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం వల్ల రాజకీయ అధికారానికి, నిర్ణయాధికారానికి దూరమైన వర్గాలను ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో క్రియాశీల భాగస్వామ్యాన్ని కల్పించడమే లక్ష్యం. బీసీలకు 33.33శాతం రిజర్వేషన్ పునరుద్ధరణ ప్రతిపాదనను క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా చూడాలి. జనాభాలో అతిపెద్ద, వైవిద్యభరిత భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న బీసీలు అనేక వర్గాలు, సంప్రదాయ వృత్తుల్లో విస్తరించారు. రిజర్వేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఆధునిక పద్ధతిలో బీసీ జనాభా గణన చేపట్టింది. ఏపీలో 33శాతం రిజర్వేషన్ ప్రతిపాదనకు సుదీర్ఘ శాసనపరమైన చరిత్ర ఉంది. బీసీలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించడాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, ఏపీ పంచాయతీరాజ్ చట్టం గుర్తించాయి. శాసనసభ 34శాతం రిజర్వేషన్ విధానాన్ని ఆమోదించింది. ప్రస్తుత నిర్ణయం కేవలం చరిత్రపై ఆధారపడి తీసుకోలేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సఫలమవుతుంది. బిర్రు ప్రతాపరెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును, ఎస్‌ఎల్‌పీ కొట్టివేతను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తోంది. అయితే 2019 డిసెంబరు 28న ఇచ్చిన జీవో 176 ఆధారంగా కల్పించిన 59.85 శాతం రిజర్వేషన్‌కు ప్రసుత్తం చేపట్టిన ప్రక్రియ భిన్నమైంది. ప్రస్తుత ప్రతిపాదన సమగ్ర కుటుంబ సర్వే, డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం ఆధారంగా రూపొందింది. కేవలం రిజర్వేషన్ శాతం సంఖ్యాపరంగా ఒకేలా ఉన్నంత మాత్రాన బీసీలకు 34శాతం పునరుద్ధరించే ప్రతిపాదనను పాత ప్రక్రియను యథాతథంగా తిరిగి చేపట్టడంగా పరిగణించకూడదు. దీని చెల్లుబాటును నూతన గణాంకాల ఆధారంగా స్వతంత్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిబంధన లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తాము. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిల్ కొట్టివేయండి’ అని కౌంటర్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్
వైసీపీ కీలక నేత అరెస్ట్.. పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన ఆ పార్టీ శ్రేణులు