Share News

కృష్ణాలో చిక్కుకున్న పంటు

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:51 AM

రాజధాని నిర్మాణ సామాగ్రితో కూడిన లారీలను తీసుకెళ్తున్న భారీ పంట్‌.. ఇసుక మేటలు తగలడంతో కృష్ణా నదిలో చిక్కుపడింది.

కృష్ణాలో చిక్కుకున్న పంటు

10 లారీల్లో రాజధానికి నిర్మాణ సామాగ్రి

గోదావరి జలాలతో ఇసుక మేట

రెండు రోజులుగా నదిలోనే వాహనాలు

‘అమరావతి’ నిర్మాణ పనులకు ఆటంకం

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణ సామాగ్రితో కూడిన లారీలను తీసుకెళ్తున్న భారీ పంట్‌.. ఇసుక మేటలు తగలడంతో కృష్ణా నదిలో చిక్కుపడింది. దీంతో నిర్మాణ పనులకు రెండ్రోజులుగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రి నుంచి సోమవారం రాత్రి నిర్మాణ సామగ్రి... కంకర, డస్ట్‌, గ్రావెల్‌తో కూడిన సుమారు 10 లారీలతో పంట్‌ బయలుదేరింది. రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం ప్రాంతానికి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్తున్న ఈ భారీ పంట్‌ 514 టన్నుల బరువు ఉంటుంది. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు వస్తున్న గోదావరి జలాల ధాటికి పవిత్ర సంగమం ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో ఇసుక భారీగా మేట వేసింది. ఆ మేటలో చిక్కుపడి పంట్‌ నిలిచిపోయింది. దీంతో జలమార్గం ద్వారా మెటల్‌ రవాణా నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జి.కొండూరు మండలాల్లోని క్రషర్లు, మెటల్‌, గ్రావెల్‌ క్వారీల నుంచి నిత్యం రాజధానికి ప్రాంతానికి కంకర, డస్ట్‌, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఫెర్రీ దగ్గరున్న 1000 టన్నుల రవాణా సామర్థ్యం కలిగిన భారీ పంట్‌పైకి మెటీరియల్‌ లోడ్‌ చేసుకున్న లారీలను ఎక్కిస్తారు. ఆ లారీలను కృష్ణను దాటించి రాజధాని ప్రాంతానికి పంపిస్తారు. సుమారు 20 లారీలను తరలించే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 10 లారీలనే తీసుకెళ్తున్నారు. అయినా ఇసుక మేటల కారణంగా ఈ మెటీరియల్‌ రవాణాకు అంతరాయం ఏర్పడింది. మేట వేసిన ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసి పంట్‌ను బయటకు తీసేందుకు నిర్వాహకులు శ్రమిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు పంట్‌ కదలలేదు.


జలమార్గంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటేనే

రోడ్డు మార్గంలో భారీగా నిర్మాణ సామాగ్రిని తరలించాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక ఖర్చు, పర్యావరణకి కలిగే నష్టాలు సరేసరి. వీటిని పరిగణనలోకి తీసుకునే జల మర్గాన్ని ఎంచుకున్నారు. కృష్ణా నదిలో జల రవాణా జరిగే ఈ మార్గాన్ని ‘జాతీయ జలమార్గం-4’ గా గుర్తించారు. అయితే జల రవాణాలో ఎదురయ్యే ఇటువంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, వేగంగా పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు లేకపోతే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 04:51 AM