Share News

Vantalu: తెల్లవిషం.. ఓ తెల్లబోయే నిజం.. మైదా

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:36 PM

భారతీయుల రోటీలు నచ్చక మొగలాయీ ప్రభువు బాబర్‌, ‘నాన్‌’ రోటీలు తయారు చేసే వంటవాళ్లనీ, వంటపదార్థాల్నీ ఇరాన్‌, ఉజ్బెకి స్తాన్‌ నుండి వెంట తెచ్చుకున్నాడు. వాళ్లతో వచ్చింది ఇక్కడికి మైదా! మొగలాయీలకు, యూరోపియన్లకూ ఇది విలాస రుచి!

Vantalu: తెల్లవిషం.. ఓ తెల్లబోయే నిజం.. మైదా

- తెల్లవిషం... మైదా

గోధుమ గింజలోని జీవసారపు పొరల్ని తొలగిస్తే, లోపల ఒక మృదువైన పదార్థం ఉందని మొదట కనుగొన్నాడు మనిషి. అది నిస్సారం అని తెలిసినా రుచే ముఖ్యంగా, ఆ మృదువైన మాయకి ‘మైదా’ అని ముద్దుపేరు పెట్టుకున్నాడు. ఆర్మేనియన్‌ ‘మైడ్‌’ (సుకు మారి), అరబిక్‌ ‘మయిదా’ (విందుభోజనం) పదాలను బట్టి, రాజభోజనాలకు ప్రతీకగా ‘మైదా’ పేరు స్థిరపడింది!

భారతీయుల రోటీలు నచ్చక మొగలాయీ ప్రభువు బాబర్‌, ‘నాన్‌’ రోటీలు తయారు చేసే వంటవాళ్లనీ, వంటపదార్థాల్నీ ఇరాన్‌, ఉజ్బెకి స్తాన్‌ నుండి వెంట తెచ్చుకున్నాడు. వాళ్లతో వచ్చింది ఇక్కడికి మైదా! మొగలాయీలకు, యూరోపియన్లకూ ఇది విలాస రుచి!


ప్రపంచ యుద్ధాల కాలంలో ధాన్యం కరువు ఏర్పడినప్పుడు తమిళనాడులోని రైసుమిల్లులు మైదాని గోధుమల్లోంచి వేరు చేసే తేలిక పద్ధతిని అభివృద్ధి చేశాయి. వెనకొచ్చిన కొమ్ముల్లాగా మైదా జన సామాన్యాన్ని చేరి, మన వంటకాల్ని శాసించడం మొదలు పెట్టింది. గోధుమ పిండి నామమాత్రం అయ్యింది. ఆఖరికి బొబ్బట్లు, కజ్జికాయలు, సజ్జప్పాల్లాంటి సంప్రదాయ వంటకాలు కూడా మైదాకి దాసోహం అయ్యాయి.


తెల్లవిషం - ఓ తెల్లబోయే నిజం!

జాంథోఫిల్స్‌ అనే వర్ణకాల కారణంగా మైదా పచ్చగా ఉండటంతో హానికారక రసాయనా లతో తెల్లగా అయ్యేలా బ్లీచ్‌ చేయటం మొదలు పెట్టారు. ఇందుకు ప్లాస్టిక్‌, సింథటిక్‌ లెదర్‌ తయారీకి వాడే ‘అజోడికార్బోనామైడ్‌’, పేలుడు రసాయనం అసిటోన్‌ పెరాక్సైడ్‌’, పైపూతగా మందు ‘బెన్జాయిల్‌ పెరాక్సైడ్‌’, పేపర్‌, డిట ర్జెంట్లు, పేస్ట్‌, కాస్మెటిక్స్‌, పుళ్లు కడిగేందుకూ వాడే ‘హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌’, మూర్ఛల రోగంలో వాడే పొటాషియం బ్రోమైడ్‌, క్లోరిన్‌, క్లోరిన్‌ డయాక్సైడ్‌ లాంటి రసాయనాల్ని ఇష్టా రాజ్యంగా వాడి మైదాని తెల్లవిషం చేశారు.


సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నిర్వహించిన పరీక్షలో 84ు బ్రెడ్‌, బేకరీ ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకమైన పొటాషియం బ్రోమేట్‌/ఐడేట్‌ ఉందని కను గొన్నారు. 1917లోనే ఈ బ్లీచింగ్‌ ఏజెంట్లను కలపటాన్ని నిషేధించాలని ఈ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది! ఆస్ట్రేలియా, జపాన్‌, బ్రెజిల్‌, న్యూజిలాండ్‌, కెనడా, యుకె, చైనా వంటి దేశాలు ఈ బ్లీచింగ్‌ ఏజెంట్లను నిషేధించాయి. అజోడికార్బోనా మైడ్‌ను యూరోపియన్‌ యూనియన్‌ పూర్తిగా నిషేధించింది. మన ఆహారంలో ఉండకూడని ఈ రసాయనాలు కేవలం అదనపు రుచి, రూపు, ఆకర్షణ కోసం అమితంగా వాడుతున్నారు. మైదా పోషకాహారం కాదు, స్లోపాయిజన్‌.


మైదాతో మానసిక వ్యాధులు

ఒకవేళ బ్లీచింగ్‌ చెయ్యకపోయినా మైదా ప్రమాదకరమే! ఇందులోని గ్లూటెన్‌ పేగుల్ని ధ్వంసం చేసి, తీసుకున్న ఆహారాన్ని వంట బట్టకుండా చేస్తుంది. గోధుమ గింజల్లోని మైదా ఉన్న భాగంలో తప్ప మిగతా గింజంతా పోషకాలు వ్యాపించి ఉన్నాయంటే, ఆ మైదాలో గ్లూటెన్‌ ఉండటమే కారణం అని గ్రహించాలి. గ్లూటెన్‌ పోషకాల శత్రువుగా పనిచేసిపేగులకు దూరంగా తోసేస్తుంది. ‘స్ర్పూ’ లాంటి విరేచన వ్యాధుల్ని కలిగిస్తుంది. మెదడులో చేరి ఆనందానుభూతిని కలిగించే నల్లమందులా పనిచేసి మనల్ని వ్యసనపరుల్ని చేస్తుంది. అందువల్ల మైదాకి అలవాటుపడితే విడిచిపెట్టలేరింక! షిజోఫ్రేనియాతో బాధపడుతున్న రోగుల్లోనూ, ప్రసవానంతర మానసిక వికారాలు కలిగే వారిలోనూ, మెదడు ద్రవంలో (సెరిబ్రోస్పైనల్‌ ఫ్లూయిడ్‌) గ్లూటెన్‌ అవశేషాల్ని కనుగొన్నారు. మైదాతో తయారయ్యే బ్రెడ్లూ, బిస్కట్లూ,నాన్లూ, బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు, సమోసాలు, మైసూరు బజ్జీలు, మైదా స్వీట్లూ, పానీపూరీలు తరచూ తినేవారికి క్యాన్సరు, మెదడు వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. పేగులు, లివరు, కిడ్నీల పైన దీని చెడు ప్రభావం ఎక్కువ!

మైదా మోహానికీ, మార్కెటింగ్‌ మాయకూ ప్రతీక. మైదా విషకోరల్లో చిక్కుకోవలసిన అవసరమూ లేదు. గోధుమల్ని మరపట్టించుకుని పిండి వాడుకోవటం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book8.2.jpgగుజరాతీ ఖాండ్వి

కావలసిన పదార్థాలు: శనగపిండి - కప్పు, కారం - పావు స్పూను, పెరుగు - కప్పు, ఇంగువ - కాస్త, నీళ్లు - రెండు కప్పులు, ఉప్పు - పావు స్పూను, పోపు గింజలు - స్పూను, కరివేపాకు రెబ్బలు - కొన్ని, కొత్తిమీర తురుము - స్పూను.

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, ఇంగువ, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లు జతచేసి కలపాలి. బాణలిలో ఈ మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. అంతా దగ్గరవుతుంటే పొడవాటి స్టీలు పళ్లెం వెనక భాగంలో పోసి, గరిటెతో మొత్తం స్ర్పెడ్‌ అయ్యేలా చేయాలి. పళ్లానికి మాత్రం నెయ్యి రాయకూడదు. ఓ పది నిమిషాలు చల్లారాక, రెండు అంగుళాల మేర పొడుగ్గా చాకుతో కట్‌ చేయాలి. ఒక్కో భాగాన్ని చేతితో చుడితే ఖాండ్వి తయారు. అన్నింటినీ ఓ స్టీలు పళ్లెంలో పెట్టి పైన పోపు వేస్తే సరి. కొత్తిమీర అంతా చల్లాలి. సాయంత్రాల్లో వేడి టీతో ఈ ఖాండ్వి భలేగా ఉంటుంది.


క్యారెట్‌ డిలైట్‌

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ - 500 గ్రాములు, చక్కెర - అర కప్పు, మొక్కజొన్న పిండి - పావు కప్పు, నీళ్లు - కప్పు, నెయ్యి - రెండు స్పూన్లు, కొబ్బరి పొడి - రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం: ప్రెషర్‌కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వరకు క్యారెట్లను ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకోవాలి. మరింత మెత్తగా ఉండేందుకు ప్యూరీని వడగట్టి, ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో చక్కెర, మొక్కజొన్న పిండి, నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ బాణలిలో వేసి ఉడికించాలి. అయిదు నిమిషాల తరవాత నెయ్యి కలిపి అలా తిప్పుతూ ఉండాలి. అంతా దగ్గరవుతుంటే పొయ్యి కట్టేసి, నెయ్యి రాసిన ప్లేటులో చదునుగా వేయాలి. గంట తరవాత ముక్కలుగా కోసి, పైన కొబ్బరి పొడి చల్లితే సరి.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

చిరిగిన జీన్స్‌.. స్లీవ్‌లెస్ పై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2025 | 01:05 PM