Sanskrit: సంస్కృతానికే దండ.. తెలుగుకేదీ అండ?
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:00 AM
పదో తరగతి వరకూ సంస్కృతం ఒక్క ముక్క కూడా రాదు! కానీ.. ఇంటర్‌లో రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకునే విద్యార్థులకు 100కి 90కి పైగా మార్కులు వచ్చేస్తాయి.
కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం
తెలుగు, ఇంగ్లిష్, హిందీ.. ఏ లిపిలో రాసినా 90కి పైనే
గత 30 ఏళ్లలో అందులో తప్పినవారు అతి తక్కువమంది
ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల తగ్గుదలకు ఇదీ ఓ కారణం
ఐనా సర్కారు పట్టించుకోవట్లేదని విద్యావేత్తల ఆవేదన
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వరకూ సంస్కృతం ఒక్క ముక్క కూడా రాదు! కానీ.. ఇంటర్‌లో రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకునే విద్యార్థులకు 100కి 90కి పైగా మార్కులు వచ్చేస్తాయి. అదే.. పుట్టినప్పటి నుంచీ అమ్మ మాట వింటూ, అమ్మభాష అయిన తెలుగులో మాట్లాడుతూ పెరిగిన విద్యార్థులు తెలుగును ద్వితీయ భాషగా తీసుకుంటే మాత్రం పరీక్ష ఎంత అద్భుతంగా రాసినా బొటాబొటి మార్కులే వస్తాయి. దేవభాష అయిన సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులకు దేవతలు మెచ్చి ఇచ్చే వరం కాదిది.. ఇంటర్ బోర్డు ఇష్టారాజ్యానికి నిదర్శనం. అదే బోర్డు.. తల్లిభాష అయిన తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకున్న విద్యార్థులకు మాత్రం గీచిగీచి మార్కులేస్తోంది! సంస్కృత పరీక్ష రాసే విద్యార్థులు తమకు తోచిన సమాధానాలు రాసినా.. కొందరు విద్యార్థులైతే క్వశ్చన్ పేపర్‌లో ఇచ్చిన ప్రశ్నల్నే తిరిగి సమాధానాలుగా రాసినా.. పేపర్ దిద్దేవారు దాన్ని పట్టించుకోకుండా మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులు కొంచెం బాగా రాస్తే.. 100కి 99 మార్కులు కూడా వేస్తున్న దాఖలాలున్నాయి. ఇన్నిమాటలేల.. గత 30 సంవత్సరాల్లో జరిగిన ఇంటర్ పరీక్షల్లో సంస్కృతం పేపర్‌లో తప్పినవారు వేళ్లమీద లెక్కపెట్టదగిన సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిరుడు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కేవలం ఒక్క మార్కుతో తప్పిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా ఉంది. కానీ.. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకున్నవారిలో అత్యధికులకు అందులో కనీసం 90 మార్కులు వచ్చాయి. అదే సమయంలో.. తెలుగులో అత్యధికులకు 70 మార్కులకు మించి రాలేదు. అంతేనా.. నిరుడు తెలుగులో ఫెయిలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల సంఖ్య దాదాపు 7 వేల దాకా ఉంది.
బట్టి కొట్టి.. ముక్కునపట్టి..
ఇంటర్‌లో సంస్కృతాన్ని రెండో భాషగా తీసుకుంటున్న విద్యార్థులు.. ఆ భాషను కాస్తంతైనా నేర్చుకుంటున్నారా అంటే అదీ లేదు. అంతా బట్టీ వ్యవహారమే. అయినప్పటికీ.. విద్యార్థులకు వ్యవహారపరంగా ఏమాత్రం ఉపయోగపడని సంస్కృతాన్ని ప్రోత్సహిస్తూ ఇంటర్‌బోర్డు అధికారులు తెలుగు చదివేవారిని నిరుత్సాహపరుస్తున్నారని భాషాభిమానులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు తెలుగు పరీక్షను చక్కటి చేతిరాతతో, అక్షర, అన్వయ దోషాలు లేకుండా ఎంత బాగా రాసినా 80-85 మార్కులు కూడా వేయని అధికారులు.. కనీసం ఒక్క సంస్కృత తరగతి కూడా వినని విద్యార్థులకు 90కి పైగా మార్కులు వేయడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృత పరీక్షలో సమాధానాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఇలా ఏ భాషలోనైనా రాసే వీలుండడం.. భారీగా మార్కులు వచ్చే అవకాశం ఉండడంతో అది కార్పొరేట్ విద్యార్థులకు ఒక వరంగా, స్కోరింగ్ సబ్జెక్టుగా మారిపోయింది.
నిబంధనల ఉల్లంఘన..
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం.. కాలేజీల్లో బోధించే ఏ భాషకైనా అందులో సబ్జెక్టు నిపుణుడైన అధ్యాపకుడు ఒకరు ఉండాల్సిందే. గణితంలో ఎమ్మెస్సీ చేసినవారే లెక్కల పాఠాలు చెప్పాలి. ఆంగ్లంలో ఎంఏ చేసినవారే ఇంగ్లిష్ బోధించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇదే కోవలోసంస్కృతంలో పీజీ చేసినవారే ఆ భాషను బోధించడానికి అర్హులు. కానీ, రాష్ట్రంలోని 1500కి పైగా కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో చాలాచోట్ల ఆ పరిస్థితి లేదు. సబ్జెక్టు నిపుణులు లేకపోవడం సంగతి అటుంచితే.. కనీసం తరగతులు కూడా ఏడాది పొడుగునా జరగవు. వార్షిక పరీక్షలకు కొద్దిరోజుల ముందు.. కొంత మెటీరియల్ ఇచ్చి విద్యార్థులతో బట్టీపట్టిస్తున్నారంతే. ఆ కాస్త బట్టీతోనే పరీక్ష రాసేస్తున్నారు. వారి సమాధాన పత్రాలు దిద్దేందుకు అర్హులైన సంస్కృత అధ్యాపకులు సైతం తగిన సంఖ్యలో రాష్ట్రంలో లేరు. దీంతో, ఉన్న అతి కొద్దిమందితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో.. ఒకసారి దిద్దిన సమాధాన పత్రాలను పునఃసమీక్షించకుండానే (రీ-వెరిఫికేషన్ చేయకుండానే) మార్కులు ఖరారు చేస్తున్నారు.
ఎందుకీ ప్రాధాన్యం
కిందటి నెలలో ముగిసిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 8,54,726 (85.73ు) మంది.. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు కేవలం 1,42,245 మంది (14.26ు) మాత్రమే. రాష్ట్రంలో మొత్తం 436 ప్రభుత్వ కాలేజీలున్నాయి. అంటే.. ఒక్కో కాలేజీలో సగటున 326 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు. ఉన్న 436 కళాశాలల్లోనూ కేవలం 15 చోట్ల మాత్రమే మాత్రమే సంస్కృత అధ్యాపకుల పోస్టులు మంజూరయ్యాయి. మిగతా 421 కాలేజీల్లో చేరే విద్యార్థులు.. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకునే అవకాశం లేదు. తెలుగే తీసుకోవాలి. కాదూ కూడదూ.. సంస్కృతం తీసుకుని ఎక్కువ మార్కులు పొందాలని భావిస్తే..ఆ సబ్జెక్టు బోధించే 15 ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కడో ఒకచోట చేరాలి. లేదా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లాలి. దీంతో.. స్కోరింగ్ కోసం ఎక్కడో ఉన్న ప్రభుత్వ కాలేజీకి వెళ్లే అవకాశం లేని చాలా మంది విద్యార్థులు తమకు సమీపంలో ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. తెలుగుపై అభిమానం ఉన్న విద్యార్థులు మాత్రమే తెలుగును రెండో భాషగా తీసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో చేరేవారి సంఖ్య తగ్గుతోందని, మాతృభాషకు విద్యార్థులు దూరం కావడానికి ఇదీ ఒక కారణమవుతోందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అయినప్పటికీ తెలుగును పక్కనబెట్టి ఇంటర్ బోర్డు సంస్కృతానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తోందో అంతుచిక్కట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌లో ద్వితీయ భాషగా హిందీ, ఉర్దూ, అరబ్బీ, తమిళం, కన్నడం, మలయాళం కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, వాటిల్లో ఏ భాష తీసుకున్నవారికీ వేయనన్ని మార్కులు సంస్కృతం తీసుకున్న వారికి వేయడం వెనక మతలబు ఏమిటో అర్థం కాని పరిస్థితి అని వారు వాపోతున్నారు.
‘సంస్కృతం’పై పునరాలోచన చేయాలి: వెంకయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతంను ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలన్న అంశంపై పునరాలోచన చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పులేదని, అదే సమయంలో విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోందంటూ వచ్చిన వార్తలు విని తాను విచారించానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుందని, అందుకే జాతీయ విద్యా విధానం-2020 కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ఫస్ట్ ర్యాంక్ కోల్పోతానని తెలిసినా తెలుగునే ఎంచుకున్నా
ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించా
సంస్కృతం ఎంచుకోలేదని పశ్చాత్తాపం లేదు
ఐపీఎస్ అధికారి మస్తిపురం రమేశ్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతంను అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆలోచనలు చేస్తున్న వేళ.. రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి, ఐజీపీ మస్తిపురం రమేశ్ తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకోవడం వల్ల ఎదురైన అనుభవాన్ని ఎక్స్ వేదికగా శనివారం పంచుకున్నారు. నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ నైవాస్య(ఏపీఆర్జేసీ) కళాశాలలో 1989లో సంస్కృతం కాదని ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకొని ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ సాధించానని ఐజీపీ రమేశ్ పేర్కొన్నారు. ఆంగ్లంలో పరీక్షలు రాయగలిగిన వెసులుబాటు ఉన్నా సంస్కృతం ఎంచుకొని ఉంటే తనకు మొదటి ర్యాంకు వచ్చేదని తెలిసినా కూడా తెలుగునే ఎంచుకున్నానని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఐజీపీ రమేశ్ పేర్కొన్నారు. భాషలను ర్యాంకుల పరిగణనలోకి తీసుకోవడం తగదని తన అభిప్రాయమని స్పష్టం చేశారు. విద్యా సంస్థలకు కాసులు కురిపిస్తున్న ర్యాంకులకు భాషను ముడిపెట్టడం తగదన్నారు.ఈ అంశంలో ఇంటర్మీడియట్ బోర్డు పునః సమీక్ష చేయాలని కోరుతూ పోస్టు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆలోచనపై ‘మార్కుల కోసం మాతృభాషకు మంట’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి సంబంధించిన చిత్రాలను కూడా ఐజీపీ రమేశ్ తన పోస్టుకు జత చేశారు.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు