Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: టీపీసీసీ చీఫ్
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:46 PM
బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్ అమలుపై హైకోర్టు స్టే ఇచ్చినందున సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ వెసులు బాటు దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు ఆపటంలో అసలైన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
గవర్నర్ దగ్గర బిల్లుని పెండింగ్ లో ఉంచారని.. గవర్నర్ ను నియమించేది ఎవరు? అని ప్రశ్నించారు మహేశ్ గౌడ్. మూడు చట్టాలు ఒక ఆర్డినెన్సు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో చేయాల్సిందంతా చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఉదాసీనత వల్ల జీవో ఇచ్చారని దుయ్యబట్టారు.
రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు మహేశ్ గౌడ్. అధికారంలోకి వచ్చాకా కాంగ్రెస్ అడ్డుకునేందుకు ఫిర్యాదు చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలు అన్ని సర్దుబాటు చేసుకుంటామని వివరించారు. ఆర్ఓబీ నిర్మాణాల కోసం కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని.. కేంద్రం నిధులు రాకపోవటం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Kavitha: ఆలస్యం అయ్యింది.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి: కవిత
Uttam Kumar Slams Harish Rao: అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ఆరోపణలు చేయడం సరికాదు