Kavitha: ఆలస్యం అయ్యింది.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి: కవిత
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:07 PM
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని కవిత గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరినా ఆమోదం పొందలేదని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును రేవంత్ సర్కార్ ఆశ్రయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని.. ఇకనైనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరినా ఆమోదం పొందలేదని తెలిపారు. ఈ బిల్లుల చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పారు.
అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిందని చెప్పారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలని పేర్కొన్నారు.
అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై యోచిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించనుంది.
ఇవి కూడా చదవండి:
CM Revanth Reddy: ఏఐ హబ్, టీస్క్వేర్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana Water Row: బనకచర్ల వివాదం.. రేవంత్‌కు హరీష్ సూటి ప్రశ్న