Maoist Party Letter: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:12 PM
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.
వరంగల్, నవంబర్ 3: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ (Maoist Party) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తూ మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని.. అందుకు తెలంగాణ సర్కార్ కూడా స్పందించిందని పేర్కొంది. ఈక్రమంలో గత మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని తెలిపింది. ఇదే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.
లేఖలో ముఖ్యాంశాలు:
కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నామని.. గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది.
ఈ క్రమంలో గత మే నెలలో తాము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించాం.
ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్దతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలాగా వ్యవహరించాం.
ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.
కావున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాం.
గతంలో కొనసాగిన విధంగానే మా వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషిచేస్తాం.
ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నాం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల అయ్యింది.
ఇవి కూడా చదవండి...
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం
Read Latest Telangana News And Telugu News