Share News

Chevella Bus Accident: చేవెళ్ల ప్రమాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లోనే...

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:54 AM

బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా.. వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Chevella Bus Accident: చేవెళ్ల ప్రమాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లోనే...
Chevella Bus Accident

రంగారెడ్డి, నవంబర్ 3: చేవెళ్ల బస్సు ప్రమాదం (Chevella Bus Accident) ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణం అయ్యింది. ఏం జరిగిందో తెలిసే లోపే అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాద ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు.


ఈరోజు (సోమవారం) ఉదయం ముగ్గురు అక్కా చెల్లెళ్లను కన్న తండ్రి స్వయంగా బస్టాప్‌లో దింపి వెళ్లాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన ఆ సోదరీమణులకు అదే ఆఖరి ప్రయాణం అని తెలీదు. ఎంతో సంతోషంగా బస్సు ఎక్కి ప్రయాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా.. వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.


మృతులు సాయిప్రియ, తనుషా, నందినిగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఒకరు మొదటి సంవత్సరం, మరొకరు రెండవ సంవత్సరం, ఇంకొకరు మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి వృత్తి రీత్యా డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ‘మా పిల్లల్ని మాకు తిరిగి ఇప్పించండి’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు.. అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది.


ఇవి కూడా చదవండి...

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 01:24 PM