Uttam Kumar Reddy: మామ, అల్లుళ్లు మేడిగడ్డను కుంగబెట్టారు
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:47 AM
మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్, హరీశ్‌లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
వారిది రూ.లక్ష కోట్ల దుర్మార్గం
అలాంటి వారికి మాట్లాడే హక్కు లేదు
తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పండి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్, హరీశ్‌లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మామ, అల్లుళ్లు సంతకాలు చేసి రూ.లక్ష కోట్ల దుర్మార్గానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అలాంటి నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. వారు చేసిన పాపాలకు నాలుగు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పిదాలను సమర్థించుకుంటూ న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలంటే బీఆర్‌ఎ్‌సకు చులకన భావమని.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని ఆరోపించారు. ‘న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో నియమించిన కమిషన్ అంటే కూడా లెక్కలేదు. ప్ర జలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయింది’ అని ఉత్తమ్ ఆక్షేపించారు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా జస్టిస్ పీసీ ఘోష్‌ను అవమానిస్తున్నారా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు పాల్పడిందో.. ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడీషియల్ కమిషన్ విచారణలో తేటతెల్లమైందని చెప్పారు. కేసీఆర్, హరీశ్‌రావుల బండారం బట్టబయలైందన్నారు.
ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్‌రావు.. కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదని ప్రశ్నించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న భయం వాళ్లను వెంటాడుతోందన్నారు. నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. కాళేశ్వరంలో దోషులుగా తేలినవారు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఆహ్వానించిందని చెప్పా రు. ఫాంహౌ్‌సలో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీసులో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపి.. అసెంబ్లీకి వచ్చి తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలోనే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం జీవో ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని.. ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ పూర్తి కాకుండా బిల్లులు చెల్లించవద్దని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News