Share News

Crop Loss: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:54 AM

మండువేసవిలో అకాలవర్షం మరోసారి రైతులను నష్టాల పాల్జేసింది. శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షానికి పలుచోట్ల వరి నేలకొరిగింది. ఇంకొన్నిచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. నారాయణపేట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

Crop Loss: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

వివిధ జిల్లాల్లో వాన.. ఈదురుగాలుల బీభత్సం.. నారాయణపేటలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి

  • ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో ఒకరు, పొలం పనుల్లో ఉండగా మరొకరు మృత్యువాత

  • పలుచోట్ల పిడుగులకు బలైన మూగజీవాలు

  • ఈదురుగాలులకు కూలిన చెట్లు, స్తంభాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మండువేసవిలో అకాలవర్షం మరోసారి రైతులను నష్టాల పాల్జేసింది. శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షానికి పలుచోట్ల వరి నేలకొరిగింది. ఇంకొన్నిచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. నారాయణపేట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లాలో పిడుగులు పడి అనేక మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. వివిధ జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. సోమవారం వరంగల్‌, మహబుబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షం, పిడుగులు బెంబేలెత్తించాయి. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగులు పడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఉప్పర్‌పల్లికి చెందిన పట్నం ఆంజనేయులు (36) పొలంలోని కల్లంలో ఆరబెట్టిన ధాన్యంపై కవర్లు కప్పుతుండగా పిడుగు పడి మృతిచెందాడు.


దాదన్‌పల్లికి చెందిన యువకుడు కురుమూర్తి (17) పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పలు గ్రామాల్లో పిడుగులు పడి 2 ఆవులు, 2 ఎద్దులు, 2 గేదెలు, కోడెదూడ, 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మేకలసోంపల్లిలో ఓ ఇల్లు పిడుగు పడి పాక్షికంగా దెబ్బతిన్నది. ఇంట్లో వారు క్షేమంగా ఉన్నారు. గద్వాల, ధరూరు, కేటీదొడ్డి మండలాలతో పాటు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరారు. నారాయణపేట జిల్లా మాగనూరు సమీపంలో 167వ జాతీయ రహదారిపై 11 కేవీ, 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. తాళంకేరిలో ఇళ్ల మధ్య ఉన్న విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం, పెంచికలపేట, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల మండలాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దహెగాం మండలం గిరివెల్లి, ఖర్జీ తదితర గ్రామాల్లో వరి నేలకొరిగింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. అయినం గ్రామంలో ఈదురుగాలులకు నాలుగు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కోరుట్ల మండలలో మామిడి నేలరాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, వలిగొండ, భువనగిరి మండలాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులు తడిసిసోయాయి.


ఎండ తీవ్రత పెరుగుతుంది!

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి.. 37 నుంచి 40 డిగ్రీల్లోపే నమోదైనా.. సోమవారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43-45 డిగ్రీల మధ్య నమోదవుతుందని తెలిపింది. కాగా ఆదివారం హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. నిన్నటి వరకు 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ఆదివారం ఒకేసారి 4-5 డిగ్రీలు తగ్గింది. కాగా, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో వడదెబ్బ తగిలి చికిత్సపొందుతున్న ఇద్దరు ఆదివారం మృతిచెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 03:54 AM