Hyderabad: బాబోయ్.. బాబా చెప్పాడని ఈ అక్కాచెల్లెళ్లు ఎంతపని చేశారంటే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:13 PM
మూఢ విశ్వాసాలు నమ్మే మరికొందరు దేవుళ్ల పేరుతో ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటారు. ఎవరు ఎలాంటి పనులు చెప్పినా చేసేస్తుంటారు. అలా చేసిన జైలుపాలైన వారు ఎందరో ఉండగా.. ఇప్పుడు ..

హైదరాబాద్, మార్చి 11: టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతోంది. ఏఐ టెక్నాలజీతో ఎన్నో పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. అనేక సమస్యలను టెక్నాలజీతో పరిష్కరిస్తున్నారు. ఇలాంటి కాలంలో ఉండి కూడా కొందరు ఇంకా మూఢ నమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన భాగ్యనగరంలో వెలుగు చూసింది. మంత్రాలకు చింతకాయలు రాలవని నానుడి ఉంది. కానీ, కొందరు మాత్రం ఖచ్చితంగా రాలుతాయనే భ్రమలో బ్రతికేస్తుంటారు. సమస్యల సుడిగుండలంలో ఉన్న కొందరు.. మూఢ విశ్వాసాలు నమ్మే మరికొందరు దేవుళ్ల పేరుతో ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటారు. ఎవరు ఎలాంటి పనులు చెప్పినా చేసేస్తుంటారు. అలా చేసిన జైలుపాలైన వారు ఎందరో ఉండగా.. ఇప్పుడు అక్కాచెల్లెళ్లు ఇద్దరు అదే పని చేసి ఊచలు లెక్కిస్తున్నారు. ఇంతకీ వారు ఏం చేశారు.. జైల్లో వేసే అంత నేరం ఏం చేశారు.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్ఆర్ నగరంలో చోటు చేసుకున్న విగ్రహాల చోరీ కేసును పోలీసులు చేధించారు. శివపార్వతుల విగ్రహాలను దొంగిలించిన వారిని పోలీసులు పట్టుకున్నారు. విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారు ఇద్దరూ స్వర్ణలత, పావని అక్కాచెల్లెళ్లుగా గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు. అయితే, దేవుళ్ల విగ్రహాలు చోరీ చేయడానికి గల కారణంపై పోలీసులు ఆరా తీయంగా.. షాకింగ్ విషయాలు చెప్పారు. అది విని పోలీసులే ఖంగుతిన్నారు. కుటుంబంలో తరచూ ఒకరు చనిపోతుండటంతో వీరు ఓ బాబాను ఆశ్రయించారట. అతను.. వారికి ఒక పరిహారం చెప్పాడట. కుటుంబంలో ఎలాంటి మరణాలు సంభవించకుండా ఉండేందుకు దేవతామూర్తుల విగ్రహాలను ఇంట్లో ప్రతిష్టించాలని సదరు కుటుంబ సభ్యులకు బాబా సూచించాడట.
దీంతో విగ్రహాల ప్రతిష్టాపన చేసేందుకు సిద్ధమయ్యారు ఆ ఇంటివారు. అయితే, విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో.. గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్వర్ణలత, పావని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్‌లో ఉన్న ఓ గుడిపై కన్నేశారు. పక్కా ప్లాన్‌తో గుడిలో ఉన్న శివ పార్వతుల విగ్రహాలను చోరీ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి ఫిర్యాదు చేయగా.. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. నిందితులైన స్వర్ణలత, పావనీలను అరెస్ట్ చేశారు.
Also Read:
ఏప్రిల్‌లో వీరి దశ తిరగనుంది..!
ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టిన పాండ్యా
For More Telangana News and Telugu News..