Share News

Corruption ACB Raids: ఏసీబీ వలలో ముగ్గురు

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:43 AM

తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు లంచాలు తీసుకున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఓ ప్రైవేటు సర్వేయర్‌ వేర్వేరు ఘటనల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు.

Corruption ACB Raids: ఏసీబీ వలలో ముగ్గురు

  • కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్‌కు ఫైలు పంపేందుకు రూ.15 వేలు లంచం

  • పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌

  • భూమి హద్దులు నిర్ణయించేందుకు ఫోన్‌ పే ద్వారా రూ.10 వేలు లంచం

  • పెద్దపల్లిలో సర్వేయర్‌ అరెస్టు

  • డీఏ బకాయిల ఫైలుకు 6 వేల లంచం

  • పీహెచ్‌సీ జూనియర్‌ అసిస్టెంట్‌ అరెస్టు

వికారాబాద్‌, నస్పూర్‌, పెద్దపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు లంచాలు తీసుకున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఓ ప్రైవేటు సర్వేయర్‌ వేర్వేరు ఘటనల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. ఓ పట్టాకు సంబంధించి కలెక్టర్‌ ఆమోదం పొందిన ఫైలును సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి పంపేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్‌ చేసిన వికారాబాద్‌ కలెక్టరేట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సుజాత ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి ఆమె రూ.15వేలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల భూమిని తల్లి పేరును పట్టా చేసేందుకు నవాబుపేట తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఫైలు కలెక్టర్‌ ముందుకు వెళ్లేందుకు జూనియర్‌ అసిస్టెంట్‌ సుజాత సదరు రైతు నుంచి రూ.5వేలు లంచం తీసుకున్నారు. కలెక్టర్‌ ఆమోదం పొందిన ఫైలును తిరిగి నవాబుపేట తహసీల్దార్‌ వద్దకు పంపేందుకు సుజాత మరో రూ.20వేలు డిమాండ్‌ చేశారు. గతంలో రూ.5వేలు ఇచ్చాను కదా ? అని రైతు అంటే మొత్తం రూ.25వేలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు.


అనంతరం రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటున్నప్పుడు సుజాతను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో భూమి హద్దులు నిర్ణయించేందుకు ఫోన్‌ పే ద్వారా ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న పెద్దపల్లి మండల సర్వేయర్‌ పెండ్యాల సునీల్‌, అతనికి సహకరించిన ప్రైవేటు సర్వేయర్‌ కే.రాజేందర్‌ రెడ్డిని ఏసీబీ మంగళవారం అరెస్టు చేసింది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన ఓ రైతు తన భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి నివేదిక ఇవ్వాలని సర్వేయర్‌ సునీల్‌కు ఎనిమిది నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. పని జరగాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని సునీల్‌ డిమాండ్‌ చేశాడు. ప్రైవేట్‌ సర్వేయర్‌ కె రాజేందర్‌ రెడ్డి ద్వారా మంతనాలు జరిపిన సునీల్‌ చివరికి రూ.10వేలకు అంగీకరించారు. కానీ సదరు రైతు జూలై 2న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ సూచన మేరకు ఆ రైతు నగదు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ప్రైవేట్‌ సర్వేయర్‌ రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌పే ద్వారా పంపాలని సర్వేయర్‌ సూచించాడు. దీంతో సదరు రైతు జూలై 9న రాజేందర్‌ రెడ్డికి రూ.10వేలు ఫోన్‌ పే చేయగా అదే రోజు ఆ సొమ్ము రాజేందర్‌ రెడ్డి నుంచి సునీల్‌కు బదిలీ అయింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు సునీల్‌, రాజేందర్‌ రెడ్డిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.


పదవీ విరమణ పొందిన ఉద్యోగి నుంచి లంచం

మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గడియారం శ్రీనివాసులు.. ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి నుంచి రూ. 6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. చెన్నూరు మండలం అంగ్రాజుపల్లి పీహెచ్‌సీ ఉద్యోగి శ్రీనివాసులు.. కోటపల్లి పీహెచ్‌సీలో ఇన్‌చార్జి జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రెండు డీఏ బకాయి బిల్లులను తయారు చేసి డీడీవోకు పంపించేందుకు పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి నుంచి శ్రీనివాసులు రూ. 6వేలు డిమాండ్‌ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. మంచిర్యాల జిల్లా నన్పూర్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ.6వేలు తీసుకుంటున్నప్పుడు శ్రీనివా్‌సను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:43 AM