Srisailam Project: మూడో సారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:36 AM
ప్రస్తుత సీజన్‌లో మూడో సారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. భీమా, తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలానికి 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
4 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల విడుదల
సాగర్‌లో 18గేట్ల ద్వారా 1.44లక్షల క్యూసెక్కులు
ఆల్మట్టి నుంచి జలాశయాలన్నీ ఫుల్
హైదరాబాద్/గద్వాల/నాగార్జున సాగర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో మూడో సారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. భీమా, తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలానికి 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాలుగు గేట్లను ఎత్తి 1.08 లక్షల క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి 66 వేలు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,818, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800, పోతిరెడ్డి పాడుకు 32,000 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు.. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల మేర వరద వస్తుండగా... దిగువకు 30వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 64వేల క్యూసెక్కులు, తుంగభద్ర రిజర్వాయర్ నుంచి 31వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 18 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,44,864 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,910 క్యూసెక్కులను తరలిస్తుండగా.., విద్యుదుత్పత్తి కోసం 28,420 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(సామర్థ్యం 312.04టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగులుగా(310.5510 టీఎంసీలు) నమోదైంది. కృష్ణా బేసిన్‌లో అన్ని రిజర్వాయర్లు నిండుగా ఉండడంతో.. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కాగా, గోదావరిలో ఎగువ నుంచి పెద్దగా ప్రవాహం లేకపోవడంతో మహారాష్ట్రలోని జైక్వాడి తప్ప... ఏ రిజర్వాయర్ కూడా నిండుగా లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 5184 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దిగువ గోదావరిలో భారీ ప్రవాహం ఉన్నా.. నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గోదావరిలో చిట్టచివరన రాజమహేంద్రవరంలో ఉన్నకాటన్ బ్యారేజీకి 1.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో కూడా అంతే ఉంది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా కృష్ణా పరిధిలో 105 టీఎంసీలు, గోదావరి పరిధిలో 894.724 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News