Share News

Hyderabad: ఇలా ఆర్డినెన్స్‌.. అలా నోటిఫికేషన్‌!

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:39 AM

స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నెల్లోనే సాధ్యమైనంత తొందర్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Hyderabad: ఇలా ఆర్డినెన్స్‌.. అలా నోటిఫికేషన్‌!

  • స్థానిక సమరానికి సర్కారు సన్నద్ధం.. సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్‌ ఫైలు

  • ఏ క్షణమైనా గవర్నర్‌కు పంపే అవకాశం.. సోమవారానికే ఆర్డినెన్స్‌ వచ్చే చాన్స్‌

  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం

  • సీఎంకు బీసీ సంఘాల కృతజ్ఞతలు.. ఆర్డినెన్స్‌, జీవో ఒకేసారి ఇవ్వాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నెల్లోనే సాధ్యమైనంత తొందర్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. బీసీలకు 42 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించాలని తాజా క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లో పలు సవరణలు చేసి, ఆర్డినెన్స్‌ రూపంలో గవర్నర్‌ ఆమోదం పొందాలని, వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం -2018లోని సెక్షన్‌ 285(ఎ)లో పలు సవరణలు చేస్తూ ఫైలును రూపొందించారు. దాన్ని ఏక్షణమైనా గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్‌ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్‌ జారీ అవుతుంది. సోమవారం నాటికే ఆర్డినెన్స్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్డినెన్స్‌తో పాటు సవరించిన చట్టానికి అనుగుణంగా ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు. జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ నెల 25 లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి, సెప్టెంబరు 30 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించింది.


ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్‌ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని సర్కారు యోచిస్తోంది. ఆ వెంటనే ఎన్నికల ప్రకటన కూడా చేయాలని భావిస్తోంది. వీటిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకొనే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేవియట్‌ పిటిషన్లు వేస్తున్నారు. మొదటి దశలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించి, తరువాత దశలో సర్పంచ్‌ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై అధికారులు ఒక నివేదికను రూపొందించినట్టు తెలిసింది. కాగా, బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య శుక్రవారం రేవంత్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆర్డినెన్స్‌తో పాటు జీవోను ఒకేసారి విడుదల చేయాలని సూచించారు. న్యాయపరమైన సమస్యల గురించి కూడా చర్చించారు. కోర్టులో ఎవరైనా కేసులు వేసి, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా ముందు జాగ్రత్తగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేవియట్‌ పిటిషన్‌లు దాఖలు చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌ సానుకూలంగా స్పందించారు.


వేడెక్కిన స్థానికం

ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చర్యలను ప్రారంభించడంతో క్షేత్రస్థాయిలో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీల చూపు స్థానిక ఎన్నికల మీదకు మళ్లింది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు అంతా స్థానికంగానే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపైనే గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మండల పరిషత్‌ ఎన్నికల్లో తమకు టికెట్‌ వస్తుందా లేదా? అని లెక్కేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 03:39 AM