Share News

Hyderabad: తెలంగాణ.. జరూర్‌ ఆనా

ABN , Publish Date - May 06 , 2025 | 04:34 AM

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన 11వ సంవత్సరంలోనే ప్రపంచ అందాల పోటీల చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో తెలంగాణ పేరు చేర్చే తరుణం ఆసన్నమైంది.

Hyderabad: తెలంగాణ.. జరూర్‌ ఆనా

మిస్‌ వరల్డ్‌ పోటీలకు రాష్ట్రం ముస్తాబు.. ఈనెల 10 నుంచి 31 వరకు అందాల పోటీల నిర్వహణ

  • రాష్ట్ర వ్యాప్తంగా అందగత్తెల పర్యటనలు

  • ప్రపంచానికి తెలంగాణ అందాలను.. పరిచయం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన 11వ సంవత్సరంలోనే ప్రపంచ అందాల పోటీల చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో తెలంగాణ పేరు చేర్చే తరుణం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ‘మిస్‌ వరల్డ్‌ - 2025’ వేడుకలకు ‘చార్‌సౌ సాల్‌-కా-షహర్‌’ హైదరాబాద్‌ ముస్తాబవుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా హెరిటేజ్‌, మెడికల్‌, టెంపుల్‌ టూరిజానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ థీమ్‌తో.. అటు అందగత్తెల పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూనే.. ఇటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. 116 దేశాల సుందరీమణులు, దేశవిదేశీ అతిథులు, 3 వేల మంది పాత్రికేయులు పాల్గొనే ఈ పోటీలను హైదరాబాద్‌ మహానగరానికే పరిమితం చేయకుండా.. రామప్ప ఆలయ దర్శనం, యాదగిరిగుట్ట నారసింహుడి ఆశీర్వాదం పోటీదారులకు కలిగేలా షెడ్యూల్‌ను రూపొందించింది. అంతేకాదు.. భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్‌ పట్టు చీరల తయారీ తీరు.. ఇప్పటికీ ఆద్యంతం చిక్కుముడిగా ఉండే మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి, ప్రఖ్యాత బౌద్ధారామమైన నాగార్జునసాగర్‌, హైదరాబాద్‌కు మకుటాయమానం గా ఉన్న చార్మినార్‌.. ఆ పక్కనే అపురూపమైన గాజులకు నిలయమైన లాడ్‌బజార్‌, ఆణిముత్యాల ఆభరణాలను విక్రయించే వీధులు, అస్‌ఫజాహీల కాలం నుంచి దేశవిదేశీ ప్రతినిధులకు ఆతిథ్యమిచ్చే చౌమొహల్లా ప్యాలె్‌సలను మిస్‌వరల్డ్‌ పోటీదారులకు పరిచయం చేయనుంది. ఈ పోటీలకు వచ్చిన వారు ‘హైదరాబాద్‌ యాత్ర’ అనుభూతి గురించి తమ డైరీల్లో ప్రముఖంగా రాసుకునేలా కార్యక్రమాలను రూపొందించింది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయగా.. అతిథులకు ఇక్కడి వంటకాల రుచి చూపించనుంది.


21 రోజుల వేడుక

మిస్‌వరల్డ్‌ పోటీలు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 10న ప్రారంభమై.. 31న జరిగే గ్రాండ్‌ ఫినాలేతో ముగుస్తాయి. ఈ 21 రోజులు అడుగడుగునా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోటీలో పాల్గొనే సుందరీమణులకు ఇక్కడి కళలను పరిచయం చేసేలా కార్యక్రమాలను రూపొందించింది. 31వ తేదీన ముగింపు కార్యక్రమం రాత్రి 10 గంటలకు మొదలై.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. విజేతల ప్రకటనతో వేడుకలు ముగిసినా.. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మిస్‌వరల్డ్‌ విజేతతోపాటు.. ఆరు ఖండాల టైటిళ్లను గెలుచుకునే అందగత్తెలు, జూలియా మోర్లీ.. ఇలా 8 మందికి రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ తేనీటి విందును ఇస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఈ 21 రోజులు మిస్‌ వరల్డ్‌ పోటీల కారణంగా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయనుంది.

13.jpg


రోజువారీ కార్యక్రమాలు ఇలా..

మిస్‌వరల్డ్‌ పోటీల్లో భాగంగా రోజూవారీ కార్యక్రమాలను పర్యాటక శాఖ ఖరారు చేసింది. అందాల తారలను బృందాలుగా విభజించి, రోజూవారీ కార్యక్రమాలను రూపొందించింది.


కార్యక్రమాలు/షెడ్యూల్‌

10న సాయంత్రం 5గంటలకు, గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌-2025 ప్రారంభోత్సవం

12 నాగార్జునసాగర్‌ బుద్ధవనానికి బౌద్ధ ఆధ్యాత్మిక యాత్ర. ఆసియాకు చెందిన 28 మంది మిస్‌ వరల్డ్‌ 2025 టీమ్‌ ఈ యాత్రలో పాల్గొంటారు.

13 చార్మినార్‌, లాడ్‌బజార్‌ ప్రాంతాల్లో హైదరాబాద్‌ హెరిటేజ్‌ వాక్‌. 116 మంది సుందరీమణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు చౌమొహల్లా ప్యాలెస్‌ సందర్శన, మ్యూజికల్‌ కన్సర్ట్‌తో వెల్‌ కమ్‌ డిన్నర్‌

14 సాయంత్రం 5 గంటలకు అమెరికాకు చెందిన 22 మంది పోటీదారులు వరంగల్‌ హెరిటేజ్‌ టూర్‌లో భాగంగా వేయి స్తంభాల గుడి, వరంగల్‌ కోటను సందర్శిస్తారు. సాయంత్రం 4.30కు రామప్ప టెంపుల్‌ టూర్‌లో భాగంగా ఐరోపాకు చెందిన 35 మంది పోటీదారులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. వీరికోసం ఇక్కడ కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ పేరిణి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు

15 సాయంత్రం 5 గంటలకు కరేబియన్‌ దేశాలకు చెందిన 10 మంది భామలు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్‌ ఎక్స్పీరెన్సియల్‌ టూర్‌లో భాగంగా ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది అందగత్తెలు సాయంత్రం 6 గంటలకు పోచంపల్లిలోని తెలంగాణ చేనేత పరిశ్రమను సందర్శిస్తారు

16 తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న మెడికల్‌ టూరిజంను మిస్‌ వరల్ట్‌ పోటీదారులు సందర్శిస్తారు

  • మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పిల్లలమర్రి వనంలో అమెరికా గ్రూప్‌ పోటీదారులు పర్యటిస్తారు

  • ఆసియాకు చెందిన 24 మందితో కూడిన బృందం.. ఎక్స్పీరియం ఎకో టూరిజం

పార్క్‌ను సందర్శిస్తారు

17 స్పోర్ట్స్‌ ఫినాలేలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు స్పోర్ట్స్‌ ఫైనల్స్‌లో పాలుపంచుకుంటారు

  • మరో బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీ, ఫిల్మ్‌ స్టూడియోను సందర్శిస్తుంది

18 సేఫ్టీ టూరిజంలో భాగంగా పోటీదారులు ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)ను సందర్శిస్తారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయాన్ని(తెలంగాణ రైజింగ్‌ విజన్‌) పోటీదారులు సందర్శించనున్నారు. సాయంత్రం సచివాలయం, ట్యాంక్‌బండ్‌, నెక్లె్‌సరోడ్‌లో నిర్వహించే సండే ఫన్‌డే కార్నివాల్‌లో పాల్గొంటారు

20, 21 కాంటినెంటల్‌ ఫైనల్‌ జరుగుతుంది. ఖండాల వారీగా పోటీదారుల ఫాస్ట్‌-ట్రాక్‌ సెలెక్షన్స్‌ ప్రక్రియ ఉంటుంది. ఈ రెండు రోజుల్లో ఏదో ఒకరోజు ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ ఆడే దేశాలకు చెందిన ఓ 20 మంది పోటీదారులు సందడి చేస్తారు

21 ఐరోపాకు చెందిన 35 మంది శిల్పారామంలో తెలంగాణ డ్వాక్రా బజార్‌ స్టాళ్లను సందర్శిస్తారు

22 మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫైనల్‌లో భాగంగా సాయంత్రం శిల్పకళావేదికలో 116 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.

23 హెడ్‌-టు-హెడ్‌ చాలెంజ్‌లో భాగంగా హోటల్‌ ట్రైడెంట్‌లో మిస్‌ వరల్డ్‌ చాలెంజ్‌లో నిర్వహించే పోటీల్లో అందాల తారలు పాల్గొంటారు

24 మిస్‌ వరల్డ్‌ టాప్‌ మోడల్‌.. ఫ్యాషన్‌ ఫైనల్‌లో భాగంగా.. హోటల్‌ ట్రైడెంట్‌/హైటెక్స్‌లో సుందరీమణులంతా ఫ్యాషన్‌, జ్యువెలరీ షోలో పాల్గొంటారు. అదే రోజు బ్యూటీ విత్‌ పర్పస్‌ పేరుతో హైటెక్స్‌లో విందును ఏర్పాటు చేస్తారు

31 సాయంత్రం 5.30 గంటలకు మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ రెడ్‌ కార్పెట్‌ వేడుక ప్రారంభమవుతుంది. రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ఫైనల్స్‌ ఉంటుంది. మిస్‌ వరల్డ్‌ విజేతను ప్రకటిస్తారు

జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున రాజ్‌భవన్‌లో కొత్త మిస్‌ వరల్డ్‌, ఆరు ఖండాల విజేతలు, జూలియా మోర్లీతో సహా 8 మంది భామలు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి తేనేటి విందులో పాల్గొంటారు


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:34 AM