Operation Sindoor: 23 ఏళ్లకే యుద్ధ విమానాన్ని నడిపా..
ABN , Publish Date - May 09 , 2025 | 05:56 PM
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్, మే 09: భారత్‌కు చెందిన రఫెల్ విమానాన్ని కూల్చేశామంటూ పాకిస్థాన్ చెప్పడం అబద్దమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రఫెల్ యుద్ధ విమానం భారత సరిహద్దులు కూడా దాట లేదన్నారు. మన విమానాలు సరిహద్దు కూడా దాటకుండా ఉంటే.. వాటిని ఎలా పాకిస్థాన్ కూలుస్తుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం మన ఉద్దేశ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే భారత సైన్యం కొట్టేసిందని చెప్పారు. పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ పాకిస్థాన్‌ను మాత్రం ఆర్మీ నడిపిస్తుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను మిలిటరీ పర్సన్‌గా చెబుతున్నానని.. భారత సైన్యం అద్భుతంగా పాకిస్థాన్‌పై దాడి చేసిందన్నారు.
డ్రోన్స్, రఫెల్ యుద్ధ విమానాలతో సైన్యం దాడి చేసిందని చెప్పారు. డ్రోన్లు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్ళాయని.. అయితే రఫెల్ యుద్ధ విమానాలు మాత్రం భారత సరిహద్దును దాట లేదని తెలిపారు. అయితే తాను లోక్ సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్ డిఫెన్స్ కమిటీలో సభ్యుడినని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. కుటుంబాలని కళ్ళ ముందు విడదీసి మతం అడిగి మరి కాల్చి చంపారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాశ్మీర్‌లో హిందూ, ముస్లింల మధ్య విబేధాలు సృష్టించాలని ఉగ్రవాదులు ప్రయత్నం చేశారని విమర్శించారు. పహేల్గాం దాడి చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది లష్కర్ ఏ తోయిబాకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
పాకిస్థాన్ గురువారం దాడి చేసిన అనేక ప్రాంతాల్లో తాను సంవత్సరాల పాటు పని చేశానని ఆయన తెలిపారు. భారత దేశ రక్షణలో చాలా చిన్న వయసులోనే తాను మిగ్ 23 విమానాన్ని నడిపానని పేర్కొన్నారు. ఇరవై సంవత్సరాల వయస్సుకే తాను యుద్ధ విమానాన్ని నడిపానన్నారు.
మిగ్ 21 యుద్ధ విమానానికి తాను పైలెట్‌గా సైతం పని చేశానని చెప్పారు. మిగ్ 23 యుద్ధ విమానానికి సెలెక్ట్ అయ్యానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. శబ్ద వేగం కంటే 2.5 శాతం వేగంగా మిగ్ 23 పని చేస్తుందని ఆయన వివరించారు.
Also Read:
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..