Engineering Colleges: ఫీజులపై కమిటీ
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:42 AM
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నిర్ణయానికి సంబంధించి హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రామాణికం
గత విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికల పరిశీలన
పరిగణనలోకి సుప్రీం తీర్పులు.. కౌన్సెలింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నిర్ణయానికి సంబంధించి హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధన స్థాయి, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనాలు, ఇతర వసతులను క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ప్రతి మూడేళ్లకోసారి ఫీజులు పెంచాల్సి ఉండగా.. ఈసారి పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఫీజుల పెంపుపై తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఫీజులు ఎక్కువగా ఉన్నాయంటూ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కృత్రిమ మేధ (ఏఐ)వంటి కోర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్లు కళాశాలలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ప్రణాళికబద్ధంగా ముందుకువెళ్లేలా వ్యవస్థను రూపొందిస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మెరుగైన వసతులు, బోధన సిబ్బంది, ల్యాబ్‌లు.. ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూడనున్నారు. ఫీజుల నిర్ణయానికి వీటినే ప్రాతిపదిక తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఇస్లామిక్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్సెస్ కర్ణాటక, పీఏ ఇనాందార్ అండ్ అదర్స్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో... ఆయా కళాశాలల్లోని వసతులు, ల్యాబ్‌లు, లెక్చరర్లకు ఆ సంస్థ ఇచ్చే వేతనాలు, బోధన, బోధనేతర సిబ్బంది, కళాశాల భవిష్యత్తు ప్రణాళికలు, కళాశాల ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపాదిక చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫీజుల నిర్ణయంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులు, బోధన సిబ్బంది, ఇతర వ్యవహారాలపై గత ప్రభుత్వం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖతో తనిఖీలు చేయించింది. ఆ శాఖ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి నివేదిక రూపొందించింది. కానీ గత ప్రభుత్వం ఆ నివేదికపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ తమకు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచుకునే అవకాశాన్ని కల్పించి.. మరికొన్ని కళాశాలలకు మొండి చేయి చూపిందని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదిక పరిశీలనతోపాటు ఇంజనీరింగ్ కళాశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలను మదింపు చేసి ఫీజులపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
Read Latest Telangana News and Telugu News