కేంద్రం కరుణించేనా!?
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:41 AM
కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. మోదీ సర్కారు ఈసారైనా కరుణిస్తుందని భావిస్తోంది. కొన్ని ప్రాజెక్టులకైనా నిధులు ఇస్తుందని ఆశిస్తోంది.

ఈసారి బడ్జెట్లోనైనా నిధులు వచ్చేనా?.. ఇప్పటికే పలు డిమాండ్లను తెలిపిన రాష్ట్రం
‘పాలమూరు’కు 60ు నిధులివ్వండి
ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో రైలు, లెదర్ పార్కులను పట్టించుకోండి
రూ.1,63,559 కోట్ల మేర ప్రతిపాదనలు
1న బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. మోదీ సర్కారు ఈసారైనా కరుణిస్తుందని భావిస్తోంది. కొన్ని ప్రాజెక్టులకైనా నిధులు ఇస్తుందని ఆశిస్తోంది. తెలంగాణలో 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై స్పష్టత లేని నేపథ్యంలో గత ఏడాది కేంద్రం నిధుల విడుదలలో ఆచితూచి వ్యవహరించి ఉంటుందని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రెండో ఏట అడుగు పెట్టినందున.. పని తీరు, కేంద్రంతో సత్సంబంధాలు, సమాఖ్య విధానానికి ఇస్తున్న ప్రాధాన్యం వంటి అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని ఈసారి గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేయొచ్చని ఆకాంక్షిస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచవచ్చని, విభజన సంబంధిత ప్రాజెక్టులకు నిధులిస్తుందని భావిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అయినా నిధులు వస్తాయని భావిస్తున్నారు.
మరోవైపు మోదీ సర్కారు తీరుపై ఇప్పటికే రాష్ట్రం నిరుత్సాహంతో ఉంది. తెలంగాణ పట్ల కాస్త వివక్ష చూపుతోందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాల పట్ల అందునా తెలుగు రాష్ట్రాలపై పక్షపాతాన్ని, సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయ న్న విమర్శలున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పన్నుల వాటాలు, సీఎ్‌సఎ్‌సల కేటాయింపుల్లో అన్యా యం జరుగుతుండగా.. ప్రత్యేక గ్రాంట్లను కూడా విడుదల చేయడం లేదని ఇక్కడి పాలక వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ, టీడీపీ ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ కావడంతో ఇటీవల ఏపీకి కొన్ని రకాల నిధులు మంజూరవుతున్నాయని ఇక్కడి అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా.. రాష్ట్రానికి ఎలాంటి నిధులివ్వడం లేదని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విభజన సమస్యల్లో భాగమైన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసాయాన్ని అందిస్తున్న కేంద్రం.. తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తుచేస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇ వ్వాలని డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం రూ.1,63,559.31 కోట్ల నిధులివ్వాలని కోరుతోంది.
ఇవీ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు..
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. 2014 తర్వాత దేశంలోని ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వడం లేదంటూ కేంద్రం స్పష్టతనిచ్చినందున.. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ఇతర పథకాల కింద 60ు నిధులిస్తామన్న ప్రకటనకు కట్టుబడి నిధులివ్వాలని కోరుతోంది.
హైదరాబాద్ చుట్టూ చేపడుతున్న రీజనల్ రింగు రోడ్డుకు రూ.34,367.62 కోట్లు అవసరమని, 2016 లోనే కేంద్ర రోడ్డు రవాణా శాఖ దీనికి ప్రాథమికం గా అనుమతి ఇచ్చిందని కేంద్రానికి సీఎం, డిప్యూ టీ సీఎంలు వివరించారు. ఈ ప్రాజెక్టు ఉత్తర, దక్షిణ భాగాల భూసేకరణకయ్యే వ్యయం లో 50 శాతాన్ని భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మిగతా నిధులపై స్పష్టతనివ్వాలని కోరుతోంది. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ మధ్య నిర్మిం చే 10 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు కూడా మంజూరు చేయాలని కోరుతోంది.
మెట్రో రైలు రెండో దశలో 76.4 కి.మీ. మేర 5 కారిడార్లను నిర్మించతలపెట్టామని, రూ.24,269 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది.
బాపూఘాట్‌ను ‘గాంధీ సరోవర్’గా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని తెలిపింది. మూసీలోకి మురికినీరు ప్రవేశించకుండా ‘ట్రంక్ ఇంటర్‌సెప్టర్’ ను నిర్మించనున్నామని వివరించింది. దీనికి రూ.14,100 కోట్లు మంజూరు చేయాలని కోరింది.
‘గోదావరి-మూసీ అనుసంధాన’ ప్రాజెక్టును చేపడుతున్నామని, దీనికి రూ.7,440 కోట్లు ఇవ్వాలని అడుగుతోంది.
హైదరాబాద్‌తో పాటు సమీప 27 మునిసిపాలిటీల్లో 7,444 కి.మీ. మేర సీవరేజీ నెట్‌వర్క్ అభివృద్ధికి ‘సమీకృత మురుగు నీటి మాస్టర్ ప్లాన్ (సీఎ్‌సఎంపీ)’ను రూపొందించామని, రూ.17,212.69 కోట్లు అవసరమని వివరించింది.
వరంగల్‌లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి రూ.4,170 కోట్లు కావాలని తెలిపింది.
ఏపీలోని బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూ.17 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది.
విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు రూ.1,350 కోట్లను విడుదల చేయాలని కోరుతోంది.
కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్కులను మంజూరు చేస్తే.. భూములు కేటాయిస్తామని చెబుతోంది. పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కుకు గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలని.. తద్వారా రూ.300 కోట్ల గ్రాంట్లు అదనంగా వస్తాయని చెబుతోంది.
మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులు మంజూరు చేయాలని అడుగుతోంది. తెలంగాణకు 15వ ఆర్థిక సం ఘం రూ.2,233.54 కోట్లను సిఫారసు చేసిందని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతోంది.
యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్(ఎన్‌ఐడీ) మంజూరవగా.. రాష్ట్ర విభజన తర్వాత దాన్ని విజయవాడకు తరలించారని, తెలంగాణకు ఎన్‌ఐడీని మంజూరు చేయాలని కోరుతోంది. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (ఐఐహెచ్‌టీ)ను మంజూరు చేయాలని కోరుతోంది.
తెలంగాణలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీటిని అందించేందుకు వీలుగా ‘పీఎం కుసుమ్’ పథకం కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కోరింది. విద్యుత్తు సరఫరా, నెట్‌వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో 9 ప్రాజెక్టుల నివేదికలను కేంద్రానికి సమర్పించామని, వాటిని మంజూరు చేయాలని కోరుతోంది.
పీఎంఏవై కింద 20 లక్షల ఇళ్లు ఇవ్వండి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)-2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఇటీవల సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. పీఎంఏవై-2.0లో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉందని, రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి