BC Reservations: సీలింగ్ తీసేసి.. రిజర్వేషన్ల పెంపు
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:13 AM
స్థానిక ఎన్నికల విషయంలో సమస్యగా ఉన్న రిజర్వేషన్ల అంశానికి ప్రభుత్వం గురువారం నాటి క్యాబినెట్ భేటీలో తెరదించింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకుగాను..
పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయనున్న ప్రభుత్వం
తర్వాత గవర్నర్ ఆమోదానికి..
అనంతరం ఆర్డినెన్స్, జీవో
దాని ప్రకారమే స్థానిక ఎన్నికల నిర్వహణ
‘క్యాబినెట్’కు అడ్వొకేట్ జనరల్
సలహా తీసుకున్న మంత్రివర్గం కోర్టులో కేవియట్‌కు సిద్ధం
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల విషయంలో సమస్యగా ఉన్న రిజర్వేషన్ల అంశానికి ప్రభుత్వం గురువారం నాటి క్యాబినెట్ భేటీలో తెరదించింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకుగాను.. రిజర్వేషన్లపై ఉన్న గరిష్ఠ పరిమితి (సీలింగ్)ని ఎత్తివేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(ఏ)కు కీలక సవరణ చేయనుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధన ఆ సెక్షన్‌లో ఉంది. దాన్ని సవరిస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచినా ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నిబంధనను సవరిస్తూ రూపొందించిన ఫైలును సర్కారు.. గవర్నర్ ఆమోదానికి పంపనుంది. గవర్నర్ ఆమోదం తరువాత ఆర్డినెన్స్ వస్తుంది. ఆ ఆర్డినెన్స్ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయనుంది. దాని ప్రకారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమలుచేయనుంది. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీకి.. అడ్వొకేట్ జనరల్‌నూ పిలిపించిన సర్కారు ఈ అంశంపై చర్చించి, పంచాయతీరాజ్ చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
నిబంధన.. సవరణ..
వాస్తవానికి 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు 50 శాతం పరిమితి నిబంధన లేదు. 2019లో ఇచ్చిన ఒక ఆర్డినెన్స్ ద్వారా దాన్ని ఆమోదించి చట్టంలో చేర్చారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 50 శాతానికి మించరాదు. దీనికి భిన్నంగా ఇతర సెక్షన్లు ఏవైనా ఉంటే అవి చెల్లుబాటు కావు’’ అని అందులో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకూ కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక సమయాల్లో వాటిని పెంచుకునేందుకు అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రత్యేక అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటి ఆధారంగానే 50 శాతం సీలింగ్ అంశాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ సవరింపుతో రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల శాతాన్ని బట్టి రిజర్వేషన్లను అమలుచేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. ఇదే వివరాలను తెలుపుతూ, 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసిన ఫైలును ఆమోదం కోసం గవర్నర్‌కు ప్రభుత్వం పంపనుంది. రాష్ట్ర పరిధిలోని చట్టం కావడంతో.. గవర్నర్ దగ్గర ఆలస్యం జరగదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్డినెన్స్ రాగానే రిజర్వేషన్ల అమలకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది. అలాగే రిజర్వేషన్ల వ్యవహారం, ప్రత్యేక జీవో జారీ అంశాలకు సంబఽంధించి ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశా లున్న నేపథ్యంలో.. ముందుగానే దీనిపై కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. అలాగే.. పంచాయతీరాజ్‌చట్టానికి సవరణ చేసి, ఆమోదం కోసం గవర్నర్ వద్దకు ఫైల్ పంపించి, ఆర్డినెన్స్ జారీ చేసేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తున్నట్టు గురువారమే ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన తరువాత తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లను మళ్లీ నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించుకునేందుకు అవకాశం ఉంది. ఇందుకు 6 నెలల దాకా సమయం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News