Share News

BC Reservation: బీసీ రిజర్వేషన్లకు జీవో!

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:11 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

BC Reservation: బీసీ రిజర్వేషన్లకు జీవో!

  • స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పించేలా సవరణ

  • న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం

  • 10న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం

  • ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ

  • రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులే

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అమల్లో ఉన్న ఉత్తర్వులను సవరించి.. వాటిని 42 శాతానికి పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయంలో న్యాయనిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటని విధంగా అమల్లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు పోను.. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గత ఉత్తర్వులు ఉన్నాయి. అయితే.. తాము బీసీల సామాజిక, ఆర్థిక సమాచారాన్నంతా సేకరించామని, కుల సర్వే నిర్వహించామని, తమ వద్ద ఉన్న సమాచారం (ఎంపిరికల్‌ డేటా) ఆధారంగా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చునని న్యాయనిపుణులు సూచించినట్లు తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ దిశగానే ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.


కుల సర్వే, డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు, దాని నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 10న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. క్యాబినెట్‌ భేటీలో దీనికి ఆమోదం లభిస్తే.. సవరణ ఉత్తర్వులకు అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే ఈ జీవోను సవాల్‌ చేస్తూ ఎవరైనా న్యాయస్థానానికి వెళితే.. అక్కడ నిలబడుతుందా, లేదా అన్న చర్చ కూడా ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. అప్పుడు పార్టీ పరంగానైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. కాగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చాలని హైకోర్టు జూన్‌ 23న ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే 15 రోజులు.. అంటే సగం సమయం అయిపోయింది.


రిజర్వేషన్లు ఎంత శాతం అనేది ప్రభుత్వం తేల్చితేనే ఎన్నికలకు సంబంధించి తదుపరి ప్రక్రియ చేపట్టడానికి వీలవుతుంది. ఏయే వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్లు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తే.. దాని ప్రకారం పంచాయతీరాజ్‌ శాఖ క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. గ్రామాల వారీగా, మునిసిపల్‌ వార్డుల వారీగా, జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఎవరెవరికి ఏయే స్థానాలను రిజర్వ్‌ చేయాలనేది నిర్ణయిస్తుంది. ఇందుకుగాను పంచాయతీరాజ్‌ శాఖకు వారం రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియనంతా నెల రోజుల్లో పూర్తిచేసి ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చి రెండు వారాలు కావడం, మరోవైపు పంచాయతీరాజ్‌ శాఖకు వారం రోజుల సమయం కావాల్సి ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. రిజర్వేషన్ల శాతాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారం మాత్రమే గడువు ఉంది.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:11 AM