Record Investment Surge at Telangana Global Summit: డబుల్ రైజింగ్!
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:50 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండో రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి! దేశ, విదేశ కంపెనీలు క్యూ కట్టాయి రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో.......
గ్లోబల్ సదస్సులో పెట్టుబడుల వెల్లువ.. 2 రోజుల్లో 5.75 లక్షల కోట్లకు ఎంవోయూలు
రెండోరోజు రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
పెట్టుబడుల్లో సగానికి సగం హరిత ఇంధనానిదే
1.60 లక్షలకుపైగా ఉద్యోగాలకు అవకాశం
మిగిలిన పెట్టుబడులతో మరో లక్ష కొలువులకు చాన్స్
ఫార్మా, డేటా పార్కులు, ఎలకా్ట్రనిక్స్ రంగాల్లోనూ పెట్టుబడులు
70 వేల కోట్లతో గిగావాట్ డేటా పార్క్‌కు ఇన్‌ఫ్రాకీ ఒప్పందం
కొత్త కార్ల తయారీకి భారత్ గరుడ రూ.2,100 కోట్లు
బయోలాజికల్-ఈ 3500 కోట్లు.. భారత్ బయోటెక్ వెయ్యి కోట్లు
యూనిట్ల విస్తరణకు అరబిందో, హెటిరో గ్రూపులు ముందుకు
పర్యాటక రంగంలో 7,045 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
రెండేళ్ల ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా డబుల్ బొనాంజా! తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండింతల పెట్టుబడులు! తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే.. దాదాపు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు! ఒక్క హరిత ఇంధన రంగంలోనే మూడు లక్షల కోట్ల రూపాయలకు ఎంవోయూలు! ఈ ఒక్క రంగంలోనే 1.60 లక్షలకుపైగా ఉద్యోగాలకు అవకాశం! మిగిలిన పెట్టుబడులతో మరో లక్షకుపైగా ఉద్యోగావకాశాలు! అంతేనా.. సదస్సులో సీఎం రేవంత్ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు! రాష్ట్ర భవిష్యత్తుకు 3 మూల స్తంభాలు (ఆర్థిక వృద్ధి, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి); మూడు ఉత్ర్పేరకాలు (సాంకేతికత, ఆవిష్కరణ, సమర్థ ఆర్థిక నిర్వహణ, సుపరిపాలన); మూడంచెల వ్యూహం (క్యూర్, ప్యూర్, రేర్)తోపాటు పది కీలక వ్యూహాలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించారు! రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకే ఈ డాక్యుమెంట్‌ను రూపొందించామని సీఎం వ్యాఖ్యానించారు! వెరసి, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది! అంతేనా.. 2 రోజుల సదస్సులో గత పదేళ్ల పాలనకు సంబంధించి ఒక్క విమర్శ కూడా చేయకుండా రేవంత్ పరిణతిని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!!

హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండో రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి! దేశ, విదేశ కంపెనీలు క్యూ కట్టాయి! రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో మొత్తంమీద రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సదస్సులో తొలిరోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఏకంగా రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదరడం విశేషం.ఈ పెట్టుబడుల్లో సగానికి సగం వాటా హరిత ఇంధనానిదే! గ్రీన్ ఎనర్జీలో ఏకంగా రూ.2.99 లక్షల కోట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 1,61,250 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయా సంస్థలు ప్రభుత్వానికి నివేదించాయి. రూ.1,76,348 కోట్ల పెట్టుబడులకు 11 సంస్థలు తెలంగాణ జెన్‌కోతో ఒప్పందం చేసుకోగా.. టీజీరెడ్‌కోతో రూ.1,23,350 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 12 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే, ఫార్మా, డేటా పార్కులు, ఎలకా్ట్రనిక్స్ తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో ఏకంగా 10,120 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రాలతోపాటు 3 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లు పెట్టనున్నారు. ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే.. తెలంగాణ ముఖ చిత్రం సమూలంగా మారిపోనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కంపెనీలు.. పెట్టుబడుల వివరాలివే..!
ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్ రూ.70 వేల కోట్లతో 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన భారీ డేటా పార్కును అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది.
జేసీకే ఇన్ర్ఫా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్దస్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. దాంతో 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఏజీపీ గ్రూప్ రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
జెన్ టెక్నాలజీ రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
కొత్త కార్ల తయారీ కోసం భారత్ గరుడ రూ.2,100 కోట్లతో ఒప్పందం చేసుకుంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ (సీఐఎ్‌సఎ్‌సఈ) రూ.577.11 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తమ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులతో 2,500 మందికి ఉపాధి లభించనుందని ఆ సంస్థ నివేదించింది.
టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణకు బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) తాజాగా రూ.3,500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి ఇది మొత్తం రూ.4 వేల కోట్లు కానుంది. విస్తరణ ద్వారా 3 వేలకుపైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం-వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దాంతో, 800కు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ర్పేరకాల తయారీకి ఈ సంస్థ రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. తద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ఎలకా్ట్రనిక్ తయారీ సేవల విస్తరణకు కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి ప్రతిపాదించింది.
ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల గ్లోబల్ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది.
అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3 వేలకిపైగా ఉద్యోగాలు సృష్టించనుంది.
హెటిరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దాంతో 9 వేలకి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.
గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500-3 వేల మందికి ఉపాధి ఇవ్వనుంది.
పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనుంది.
ఆహార-పానీయాల తయారీ విస్తరణకు కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకనుంది.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ బయోవరం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి.శ్రీధర్‌బాబు సమక్షంలో బయోవరం చైర్మన్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, ఎండీ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. 250 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు.
వైద్య రంగంలో విప్లవాన్ని సృష్టిస్తున్న విజ్జీ హోల్డింగ్ కంపెనీ మల్టీ ఒమిక్స్ ల్యాబ్స్‌తో కలిసి రానున్న పదేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మానవ శరీరంలో రాబోయే రుగ్మతలు, ప్రాణాంతక వ్యాధులను పరీక్షలతో ఐదేళ్ల ముందే గుర్తించి.. ముందస్తు చికిత్స తీసుకోవడానికి వీలుగా పరిశోధనలు చేయనుంది.
టీడబ్ల్యూఐ గ్రూప్ ప్రపంచంలోనే తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోటార్ బైక్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.1,100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్ర గ్రూపు జహీరాబాద్ యూనిట్ విస్తరణకు నాలుగేళ్లలో రూ.500 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఇండియా ఎక్స్‌ట్రీమ్ అడ్వెంచర్ గ్రూపు 20 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, ఈ-స్పోర్ట్స్ ఎంటర్టైన్‌మెంట్ ఎరీనా ఏర్పాటు చేయనుంది.
జ్యూరిచ్ ఇన్స్యూరెన్స్ ఇండియాలో తన తొలి గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. మూడేళ్లలో దశలవారీగా విస్తరించనుంది.
కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తమ తొలి సంస్థను హైదరాబాద్‌లో స్థాపించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇంజినీరింగ్-సైబర్ హబ్‌గా అభివృద్థి చేయడమే లక్ష్యంగా పేర్కొంది.
మాక్సిమస్ (అమెరికా) గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ- ఆపరేషన్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.
స్పోర్ట్స్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని జీఎంఆర్ అభివృద్ధి చేయనుంది.
అనలాగ్ ఏఐ (అలెక్స్ కిప్‌మాన్) హైదరాబాద్‌లో గ్లోబల్ పరిశోధన, ప్రోటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆల్ట్‌మిన్ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రాన్ని ప్రతిపాదించింది.

ప్రపంచస్థాయి క్రీడా ఈవెంట్లు
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు తెలంగాణ కేంద్ర స్థానం కానుంది. ఇందుకు సహకరించేందుకు ఫీఫా నైపుణ్యాభివృద్ధి పథకం కింద ఫీఫా-ఏఐఎ్‌ఫఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ (పురుషులు)ని ఏర్పాటు చేస్తారు.
ఇంటర్నేషనల్ హాకీ విమెన్స్ వరల్డ్ కప్ క్యాలిఫయర్ 2026లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో 24 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో 8 దేశాలు భాగస్వామ్యం కానున్నాయి. తెలంగాణను గ్లోబల్ హాకి హబ్‌గా మార్చేందుకు ఈ పరిణామం ఉపకరించనుంది.
18 దేశాలు పాల్గొనే ఏసియా రోయింగ్ చాంపియన్‌షిప్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026 ప్రపంచంలోనే అతి పెద్ద చెస్ ఉత్సవం కానుంది.
పర్యాటక రంగంలోనూ...
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. వీటితో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఫుడ్ లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,000 కోట్లు పెట్టుబడులతో ముందుకొచ్చింది.
గోల్ఫ్ అండ్ రిసార్ట్స్‌ను డ్రీమ్‌వ్యాలీ రూ.1,000 కోట్లతో నిర్మించనుంది.
సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,000 కోట్లు, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్ (కామినేని గ్రూప్) రూ.200 కోట్లు, మల్టీవర్స్ హోటల్స్ రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్) రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్ రూ.120 కోట్లు, సలామ్ నమస్తే దోసా హట్ (ఆస్ట్రేలియా), విశాఖ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ ఐఫా ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి రూ.550-600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది.
సల్మాన్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్ స్టూడియోలు..
అజయ్ దేవగణ్ ఫిల్మ్ స్టూడియోలో స్టూడియోలు, వీఎ్‌ఫఎక్స్, వర్క్‌షా్‌పలు వంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్‌ను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయనున్నారు. సల్మాన్‌ఖాన్ కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షి్‌ప, స్టూడి యో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాటితో యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు బ్లాక్‌స్టోన్ ఆసియా ఆసక్తి చూపింది. సుమధుర గ్రూప్ కొత్త టౌన్‌షిప్, మధ్యతరగతి నివాస సముదాయాలను ప్రతిపాదించింది.