High Court: సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు పచ్చజెండా
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:15 AM
రాష్ట్రంలో సాదాబైనామాల రిజస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
2020 నాటి స్టే ఎత్తేసిన హైకోర్టు
భూభారతి చట్టంతో సర్కార్‌కు హక్కుంది
కొత్త చట్టం వచ్చినందున పాత జీవోకు కాలం చెల్లింది
కావాలంటే భూభారతిని సవాల్ చేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచన
ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగించిన న్యాయస్థానం
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాదాబైనామాల రిజస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ 2020లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. కొత్తగా భూభారతి చట్టం వచ్చిన నేపథ్యంలో సదరు చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామాలను రిజిస్ట్రేషన్ చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పడిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూమిహక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం-1971 ప్రకారం 2020 అక్టోబరు 12న ఇచ్చిన జీవో 112కు కాలం చెల్లిందని తెలిపింది. సదరు జీవోను కొట్టేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తికి సైతం కాలం చెల్లిపోయిందని వ్యాఖ్యానించింది. కావాలంటే తాజాగా భూభారతి చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ విచారణను ముగిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది.
ఇదీ విషయం..
సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తూ అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవోను కొట్టేయాలని నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ జీవోపై స్టే విధించింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం-2025ను అమల్లోకి తెచ్చింది. సాదాబైనామాలపై కొత్త చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించామని.. గతంలో ఇచ్చిన స్టే ఎత్తేయాలని, రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చిందని, అందులోని సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించే అధికారం సర్కారుకు ఉందని తెలిపారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదిస్తూ.. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు చాలా తక్కువ అని, తమ దరఖాస్తులను అనుమతించరనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోని చిన్న, సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. అనర్హుల దరఖాస్తులే ప్రస్తుతం అనుమతి పొందే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏజీ వాదనతో ఏకీభవించింది. 2020 అక్టోబరు 12 నుంచి 2020 నవంబరు 11 వరకు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించవచ్చని తెలిపింది. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. 2014 జూన్ 2కు ముందు 12 ఏళ్లపాటు భూమి తమ అధీనంలో ఉందనేందుకు ఆధారాలు కలిగిన చిన్న, సన్నకారు రైతుల సాదాబైనామా దరఖాస్తులను క్రమబద్ధీకరించవచ్చని పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..