Medical Education: గాడినపడనున్న వైద్య విద్య!
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:45 AM
రాష్ట్రంలో వైద్యవిద్యను గాడిన పెట్టే క్రమంలో సర్కారు రికార్డు స్థాయిలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భారీగా భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మరో 1,235 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఇప్పటికే 607 పోస్టులకు నోటిఫికేషన్ జారీ
సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్స్‌గా 44 మందికి పోస్టింగులు.. నేడు జీవో
349 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు
తీరనున్న అధ్యాపకుల కొరత
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్యవిద్యను గాడిన పెట్టే క్రమంలో సర్కారు రికార్డు స్థాయిలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భారీగా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 1,842 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే 607 పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ కాగా.. అదనంగా 1,235 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా వీటితో జతచేయనుంది. ఇందులో 715 పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం లభించింది. మిగిలిన 520 పోస్టులను మంజూరు చేయాలని వైద్యవిద్య సంచాలకుడు(డీఎంఈ) ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. వాటికి కూడా సర్కారు నుంచి వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా చాలా సీరియె్‌సగా ఉన్న విషయం తెలిసిందే..! రిక్రూట్‌మెంట్, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఇటీవల ఆ శాఖ సమీక్ష సందర్భంగా ఆదేశించారు. దాంతో వైద్యశాఖ రంగంలోకి దిగింది. 35 వైద్య కళాశాలల్లో 3,650 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు గాను 2,194 ఖాళీలు ఉన్నట్లు లెక్కతేల్చింది. తాజాగా సోమవారం పదోన్నతులు వచ్చాయి. దీంతో.. ఈ ఖాళీలు మరింత పెరుగుతాయి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూలు లేకపోవడంతో.. ఈ ప్రక్రియ త్వరగా ముగుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
44 మందికి పోస్టింగ్స్ నేడు జీవో
ఒకేసారి 44 మంది అదనపు వైద్యవిద్య సంచాలకులను మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్‌గా, బోధనాస్పత్రులకు సూపరింటెండెంట్‌లుగా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన జీవో మంగళవారం విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో ఐదుచోట్ల మినహా అన్ని ప్రభుత్వ వైద్య కళశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, అన్ని బోధనాస్పత్రులకు రెగ్యులర్ సూపరింటెండెంట్స్‌ను భర్తీ చేసినట్లు అవుతుంది. రాష్ట్రంలో 35(కొడంగల్‌తో కలిపి) ప్రభుత్వ వైద్య కళశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రులున్నాయి. ఉస్మానియా కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎంలను మినహాయిస్తే.. మిగతా కాలేజీలకు 69 అదనపు డీఎంఈ పోస్టులు అవసరం. గత సర్కారు హయాంలో 17 అదనపు డీఎంఈ పోస్టులను మంజూరు చేయగా.. వారిలో ఇద్దరు పదవీవిరమణ పొందారు. దాంతో.. 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 54 పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే.. 44 మందికి మాత్రమే అదనపు డీఎంఈలుగా అర్హతల లభించింది. దాంతో.. వారందరినీ ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్, ఆస్పత్రులకు సూపరింటెండెంట్స్‌గా నియమించింది.
డీహెచ్ నుంచి మరో 300 మంది
ప్రజారోగ్య సంచాలకుల విభాగం(డీహెచ్) నుంచి ఇన్-సర్వీ్‌స కోటాలో పీజీ పూర్తిచేసిన సుమారు 300 మంది స్పెషలిస్టు వైద్యులున్నారు. వారంతా వైద్యవిద్య సంచాలకుల పరిఽధిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమవారం వీరంతా వైద్య మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి.. డీఎంఈ విభాగానికి వచ్చేందుకు సమ్మతిని తెలిపారు. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో 60ు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 40ు డీహెచ్, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని స్పెషలిస్టు వైద్యులను చేర్చుకోవాలి. ఇప్పటికే టీవీవీపీ నుంచి సుమారు 60-70 మంది స్పెషాలిటీ వైద్యులు డీఎంఈకు రాగా.. త్వరలో డీహెచ్ పరిధిలో పనిజేస్తున్న 300 మంది స్పెషలిస్టులను కూడా తీసుఉరానున్నారు. వీరిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా నియమిస్తారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో దాదాపుగా ఖాళీలు అన్నీ భర్తీ అవుతాయి.
భారీగా పదోన్నతులు
అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు సర్కారు నియామకాల ప్రక్రియతోపాటు.. ఏకకాలంలో పదోన్నతులను చేపట్టింది. ముందెన్నడూ లేని విధంగా.. 44 మంది ప్రొఫెసర్లకు అదనపు డీఎంఈలుగా పదోన్నతికి కల్పించింది. అలాగే అర్హత కలిగిన 349 మంది అసోసియేట్ ప్రొఫెసర్స్‌కు ప్రొఫెసర్స్‌గా, మరో 231 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కు అసోసియేట్ ప్రొఫెసర్స్‌గా పదోన్నతి ఇచ్చింది. ప్రొఫెసర్స్ పోస్టింగ్స్ జీవో కూడా వారంలోపే రానున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగులిస్తారు.
అధ్యాపకుల కొరతను అధిగమిస్తాం
వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని రకా ల చర్యలను తీసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఏకకాలంలో పదోన్నతులు, డైరెక్టు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఖాళీ గా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తు న్నాం. ఇప్పటికే టీవీవీపీ నుంచి స్పెషలిస్టు వైద్యులను అబ్జార్బ్ చేసుకున్నాం. నిబంధనల మేరకు డీహెచ్ నుంచి కూడా ఆ ప్రక్రియను చేపడతాం.
- డాక్టర్ నరేంద్రకుమార్, వైద్య విద్య సంచాలకుడు
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి