Crop Loss: 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:31 AM
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.
భారీ వర్షాలు, వరదలతో 13 జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు
వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా
సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు పరిహారం
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటివరకు 13 జిల్లాల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ఏకంగా 93,925 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి జూన్, జూలై నెలల్లో కాస్త వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. ఆగస్టులో మాత్రం వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా బలంగా విస్తరించడంతో.. కరువు తీరా వర్షాలు పడ్డాయని తొలివారంలో రైతులు సంతోషపడ్డారు. కానీ, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు వారు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షంతో అంతా అతలాకుతలం అయింది. ఊహించని విపత్తుతో భారీగా నష్టం జరిగింది. చెరువు కట్టలు తెగడం, రోడ్లు కొట్టుకుపోవడంతోపాటు కొన్ని పంటలు నామరూపాల్లేకుండా పోయాయి. మొత్తం 61,193 మంది రైతులకు ఈ నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వేలో తేలింది. కాగా, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 41,098 ఎకరాల్లో, సిద్దిపేట జిల్లాలో 7 వేల ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 12,283 ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో సుమారు 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. ఈ 13 జిల్లాల్లో కలిపి సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేయాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు కూడా జారీ చేసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖతోపాటు అనుబంధ శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని, పంట నష్టంపై సమగ్ర సమాచారం సేకరించాలని పేర్కొంది. అయితే 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే నష్ట పరిహారం చెల్లించే అవకాశాలున్నాయి. గతంలో కూడా ఇదే నిబంధన పాటించారు.
ఎకరానికి రూ.10 వేల పంట నష్టం..
ప్రస్తుతం రాష్ట్రంలో పంటల బీమా పథకమేదీ అమలులో లేదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నష్టపరిహారం చెల్లిస్తూ వస్తోంది. అదేక్రమంలో ఇప్పుడు కూడా ఎకరానికి రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించనుంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 2 లక్షల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించటానికి రూ. 200 కోట్ల నిధులు అవసరమవుతాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున.. అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో తుమ్మల మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జిల్లాలలోని రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులపై ఆరా తీశారు. వరద ఉధృతి పెరిగి వాగులు, కల్వర్టుల దగ్గర నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..