Share News

Telangana bandh over BC reservations: తెలంగాణ బంద్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

ABN , Publish Date - Oct 18 , 2025 | 08:45 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలైంది. జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి.

Telangana bandh over BC reservations: తెలంగాణ బంద్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు
Telangana Bandh

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ (శనివారం) ఉదయం 4 గంటల నుంచే మొదలైంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు నేతలు అడ్డుకున్నారు. తమ బంద్‌కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో ఉండకపోయే అవకాశం ఉంది. అటు ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి.


బీసీ జేఏసీ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బంద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు అంబర్ పేట బంద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వీహెచ్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ రేథిఫైల్ బస్ స్టాండ్ వద్ద బంద్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొననున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద బంద్‌లో మంత్రి వాకాటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొననున్నారు.


అటు బీసీ సంఘాల జేఏసీ ప్రకటించిన బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్‌లో పాల్గొన్నారు. మండల, జిల్లా స్థాయిలో బంద్‌లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


బీసీ జేఏసీ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు తెలిపింది. ఉదయం 8 గంటలకే ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని, న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత మానవహారంలో పాల్గొననున్నారు.


బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ వ్యాప్తంగా నేటి బంద్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ డిపోల్లో నుంచి బస్సులు కదలట్లేదు. దీంతో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. అటు నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు మద్దతుగా సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సహకరించాలని బీసీ సంఘాలు కోరాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో బస్సులు నిచిపోయాయి. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నిరసన తెలుపుతున్నారు. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బస్సు డిపో ముందు బైఠాయించి అఖిలపక్ష నాయకులు, బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేపట్టారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ బీజేపీ వాళ్లూ ధర్నాలో పాల్గొంటున్నారని, అది సంతోషకరమైన విషయం అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ చట్టాలను చేయాల్సిన రెండు పార్టీలు అసెంబ్లీ పార్లమెంటులో సరైన చర్యలు తీసుకోకుండా రోడ్డుపై బైఠాయించడం విడ్డూరమని విమర్శించారు. ఆ రెండు పార్టీల్లో ఉండే బీసీ నాయకులు ప్రస్తుతం ఆలోచనలో పడ్డారని.. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు లభించేదాక బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో బంద్ పిలుపు మేరకు నారాయణపేట ఆర్టీసీ డిపో ముందు బీసీ సంఘం, అఖిలపక్ష నాయకులు బైఠాయించారు. దీంతో డిపోకే బస్సులు పరిమితమయ్యాయి.


ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాపంగా తెలంగాణ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలోనే రెండో పెద్ద బస్టాండ్ ఉన్నటువంటి కరీంనగర్ పట్టణంలో డిపోలకే బస్సులు పరిమితం అయ్యాయి. అటు స్కూళ్లు కూడా బంద్ పాటిస్తున్నాయి. బీసీ బంద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు బైక్ ర్యాలీలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది. హనుమకొండ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో నాయకులు బస్సును వదిలిపెట్టారు. ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా బస్ డిపో ఎదుట నిరసన చేపట్టారు. ఈ బంద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు పాల్గొనున్నారు.


ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీసీ సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. దీంతో డిపో నుంచి బస్సులు కదలట్లేదు. జిల్లాలో బంద్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అటు బందుకు వ్యాపార వాణిజ్య సంఘాలు మద్దతు తెలిపాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బంద్ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో బంద్ చేపట్టారు. ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేటలో విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఈ నిరసనకు అఖిలపక్షం, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కారణంగా కొత్తగూడెంలో డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.


సంగారెడ్డి బస్ స్టాండ్ ముందు బీసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సంగారెడ్డిలో డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట బీసీ సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీసీ బంద్ లో భాగంగా డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ప్రయాణికుల లేక మెదక్ బస్టాండ్ బోసిపోయింది.


ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తెలంగాణ బంద్ కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ బస్ డిపోల ఎదుట బీసీ సంఘాలతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నేతలు ధర్నా చేపట్టాయి. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆటోలు, బైకులు మినహా జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా బీసీ బంద్ చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమల్లోకి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Hyderabad Metro Services Rush: సిటీ బస్సులు బంద్.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ

Child Abuse: 11 మంది బాలురపై లైంగిక దాడి

Updated Date - Oct 18 , 2025 | 10:23 AM