Share News

Child Abuse: 11 మంది బాలురపై లైంగిక దాడి

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:58 AM

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ జువెనైల్‌ హోంలో స్టాఫ్‌ గార్డ్‌ రహమాన్‌ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Child Abuse: 11 మంది బాలురపై లైంగిక దాడి

  • వెలుగుచూస్తున్న సైదాబాద్‌ హోం అకృత్యాలు

  • స్టాఫ్‌గార్డ్‌ రహమాన్‌పై ఐదు పోక్సో కేసులు

  • బాధితుల సంఖ్య పెరిగే అవకాశం

సైదాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సైదాబాద్‌ జువెనైల్‌ హోంలో స్టాఫ్‌ గార్డ్‌ రహమాన్‌ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండు పోక్సో కేసులు నమోదైన గార్డుపై, తాజాగా మరో ముగ్గురు బాలురపై లైంగిక దాడి ఫిర్యాదులు రావడంతో పోలీసులు మొత్తం ఐదు పోక్సో కేసులు నమోదు చేశారు. కొన్ని నెలలుగా నిందితుడు రహమాన్‌ 11 మందికి పైగా బాలలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు హోంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకుని, బాలలతో మాట్లాడి కీలక వివరాలు సేకరించారు. విచారణలో రహమాన్‌ అకృత్యాలు తెలుసుకుని పోలీసులు సైతం చలించిపోతున్నారు. ప్రస్తుతం దర్యాప్తులో మరో ఆరుగురు బాలురపై కూడా దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో, హోం నుంచి ఇప్పటికే విడుదలైన బాలలను కూడా పిలిపించి సమాచారం సేకరిస్తున్నారు. విచారణ పూర్తయితే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు రహమాన్‌ను కస్టడీకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

Updated Date - Oct 18 , 2025 | 05:58 AM