Share News

TG Assembly: 30 నుంచి అసెంబ్లీ

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:17 AM

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. శాసనసభతోపాటు శాసనమండలి సమావేశాలు 30న ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి.

TG Assembly: 30 నుంచి అసెంబ్లీ

  • కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక మీద చర్చ

  • డిప్యూటీ స్పీకర్‌గా రాంచందర్‌నాయక్‌ ఎన్నిక!.. అదే రోజు క్యాబినెట్‌ సమావేశం

  • స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతంపై చర్చించనున్న మంత్రివర్గం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. శాసనసభతోపాటు శాసనమండలి సమావేశాలు 30న ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్‌ అనుమతి ఇవ్వడంతో శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అదే రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు శాసనసభలోని కమిటీ హాల్‌లో క్యాబినెట్‌ భేటీ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టి చర్చించనున్నారు.


ఈ చర్చలో వివిధ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిశీలించి తదుపరి అడుగు వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కూడా జరగనుంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగలేదు. స్పీకర్‌ లేని సమయంలో ప్యానెల్‌ స్పీకర్ల ఆధ్వర్యంలోనే శాసనసభ నడుస్తోంది. అయితే ఇటీవల డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచందర్‌ నాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దృష్ట్యా 30 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 05:17 AM