Share News

Revanth Reddy Assembly Debate: దోచుకుని.. దబాయింపు

ABN , Publish Date - Sep 01 , 2025 | 03:40 AM

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై శాసనసభలో ఆదివారం వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడగా..

Revanth Reddy Assembly Debate: దోచుకుని.. దబాయింపు

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ పైనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు

  • కేంద్రం అనుమతిచ్చినా తుమ్మిడిహెట్టి వద్ద ఎందుకు కట్టలే?

  • నీటి లభ్యత ఉందన్నా పునఃపరిశీలించాలని ఎందుకడిగారు?

  • శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై వాడీవేడి చర్చ

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై శాసనసభలో ఆదివారం వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడగా.. ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు మాట్లాడారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికలోని పలు అంశాలను హరీశ్‌రావు తప్పుబట్టిన ప్రతిసారీ వారు జోక్యం చేసుకొని సమాధానమిచ్చారు. దీంతో చర్చ పరస్పరం వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘ప్రాణహిత- చేవెళ్ల ఎత్తిపోతల పథకం ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి.. రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్నారు. అందుకు మిమ్మల్ని ఉరి తీయాలి కదా?’’ అని అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాణహిత- చేవెళ్ల ఎత్తిపోతల పథకంపై ఏర్పాటుచేసిన అనంతరాములు కమిషన్‌ ఇచ్చిన నివేదికను, తెలంగాణ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారని అన్నారు. ఇప్పుడేమో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, మొదటి లోక్‌పాల్‌గా పనిచేసిన పీసీ ఘోష్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం లోపాలను ఎత్తిచూపినందుకే ఆ కుటుంబమంతా కలిసి పీసీ ఘోష్‌ను విమర్శిస్తోందన్నారు.

ఉమాభారతి చెప్పినా కాదని..

2015 మార్చి 13న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి.. రాష్ట్రానికి లేఖ రాశారని, గోదావరిలో 205.8 టీఎంసీల నీటి లభ్యత ఉందని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కట్టుకోవచ్చని ఆ లేఖలో రాశారని సీఎం రేవంత్‌ అన్నారు. ఆ లేఖను అప్పటి మంత్రి హరీశ్‌రావు ఎండార్స్‌ చేసి.. ప్రాణహిత- చేవెళ్ల చీఫ్‌ ఇంజనీర్‌కు పంపించారని తెలిపారు. 2014 అక్టోబరు 24న హైడ్రాలజీ క్లియరెన్స్‌ కూడా వచ్చిందని, 236.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర జలసంఘం సైతం స్పష్టం చేసిందని చెప్పారు. ఇన్ని అనుమతులున్న తర్వాత.. ప్రాజెక్టు కట్టుకోవాలా? వద్దా? అని కేంద్రానికి లేఖలు రాయటం విడ్డూరంగా ఉందన్నారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన 665 పేజీల నివేదికలో.. హరీశ్‌రావు తప్పు చేసినట్లు 98వ పేజీలో స్పష్టంగా ఉందన్నారు. మామా అల్లుళ్లు మసి పూసి మారేడు కాయ చేసినట్లు తెలంగాణ సమాజాన్ని ఇంకా మోసం చేస్తామంటే కుదరదన్నారు. ‘‘ఘోష్‌ కమిషన్‌ నివేదికను ప్రజల ముందు పెట్టినం.. ఇప్పుడు మీకేం కావాలి? ఏ విచారణ కావాలి? ఈడీ కావాలా? ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కావాలా? సిట్‌ కావాలా? ఏసీబీ విచారణ కావాలా? ఏదో స్పష్టంగా చెప్పండి’’ అని హరీశ్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.


సిగరెట్‌ పెట్టెపై రాసినట్లు..!

148 మీటర్ల ఎత్తులో కట్టుకుంటే తమకు ముంపు ప్రాంతం తక్కువ ఉంటుందని మాత్రమే మహారాష్ట్ర చెప్పిందని రేవంత్‌ అన్నారు. కేంద్ర జలసంఘం ఏ ప్రాజెక్టుకు అనుమతిచ్చినా.. ఓ హెచ్చరిక తప్పనిసరిగా చేస్తుందని, మరోసారి పరిశీలించుకోవాలని చెబుతుందని అన్నారు. సిగరెట్‌ పెట్టెపై.. సిగరెట్‌ తాగటం ఆరోగ్యానికి హానికరం! అని రాసినట్లుగానే.. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినపుడు ఇదే తరహాలో హెచ్చరిక చేసిందని, అయినా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. పీసీ ఘోష్‌ నివేదికలో 72వ పేజీలో రీడిజైన్లు సహేతుకం కాదని పేర్కొన్నారని తెలిపారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. మసిపూసి మారేడుకాయ చేయటంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడని ఆరోపించారు. ఉమాభారతి రాసిన లేఖలో మొదటి పేజీ మాత్రమే సీఎం చదివారని, మూడో పేజీ కూడా చదవాలని సూచించారు. 165 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు 63 టీఎంసీలు వాడుకుంటే.. ఇంకా 102టీఎంసీలు మాత్రమే మిగులుతాయని, నీళ్లు లేనిచోట ప్రాజెక్టు నిర్మించవద్దని మూడో పేజీలో ఉందన్నారు. కేంద్ర జలసంఘం కూడా ఇదే చెప్పిందని తెలిపారు. నీళ్లున్న చోటికి మార్చుకోవాలంటూ 2013 అక్టోబరు 15న కిరణ్‌కుమార్‌ సీఎంగా ఉన్నపుడు కూడా లేఖలో పేర్కొన్నారని వివరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్‌ క్షమాపణ చెప్పాలన్నారు. చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటూ.. తుమ్మిడిహట్టి మీద 2009-2014లో క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాత నాటి ప్రభుత్వం రూ.5500 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. 2014 తర్వాత అదే ప్రాజెక్టు మీద బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రూ.6100కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు వెళ్లాలని నిపుణులు చెబితే రూ.6100కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని పొంగులేటి ప్రశ్నించారు. రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టారు.రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.18వేల కోట్లకు పెంచి దోచుకున్నారని ఆరోపించారు. దీంతో, హరీశ్‌రావు కల్పించుకుంటూ ‘ఆ సమయంలో మీరు మా పార్టీలోనే ఉన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు’ అని అన్నారు. అయితే.. ‘ఆ సమయంలో నేను మీ పార్టీలో లేను. వైసీపీలో ఉన్నాను’ అని పొంగులేటి బదులిచ్చారు. కేవలం ఒక ఆపరేటర్‌తో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్‌ ప్లాన్‌ చేశారని అన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల వరకు ప్రాణహిత-ప్రాజెక్టుపైనే పనిచేశామని, అయితే మహారాష్ట్ర నుంచి పదే పదే అభ్యంతరాలు రావడంతో తర్వాత మేడిగడ్డ వైపు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీంతో.. రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును ఎలా వదిలివేస్తారని పొంగులేటి ప్రశ్నించగా.. రూ.11 వేల కోట్లు వృధా కాలేదని, నీళ్లు లేని చోటు నుంచి నీళ్లు దొరికే చోటుకు ప్రాజెక్టును మార్చామని బదులిచ్చారు. ఆ నిర్ణయం 25రోజుల్లో తీసుకోలేదని, వ్యాప్కోస్‌ నివేదిక వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు పట్టిందని చెప్పారు. డీపీఆర్‌ లేకుండా టెండర్లకు వెళ్లారని పొంగులేటి వ్యాఖ్యానించగా, ‘మీ హయాంలోనూ ఇలానే జరిగింది కదా!’ అని అన్నారు. సీతారామ ప్రారంభోత్సవానికి పొంగులేటి ఫుల్‌ పేజీ ప్రకటన ఇచ్చారంటూ క్లిప్పింగ్‌ చూపించారు. దీంతో ఒకసారి కాళేశ్వరం, మరోసారి సీతారామ ప్రాజెక్టు అంటున్నారని, తప్పుదోవ పట్టించే బ్యాచ్‌ అని పొంగులేటి విమర్శించారు. 30 శాతం ఖర్చయ్యే డయాఫ్రం వాల్‌కు వంద శాతం ఖర్చుతో సీకెంట్‌ ఫైల్‌ వేశారని విమర్శించారు. రూ.లక్ష కోట్లు గోదాట్లో కొట్టుకుపోవడానికి ఈ సీకెంట్‌ ఫైల్సే కారణమన్నారు. దీనికి అప్పటి సాగునీటి మంత్రితే బాధ్యత అన్నారు.


అన్యాయం జరిగిందనే

2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్‌ వచ్చిందంటున్నారని, మరి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అక్కడ తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్‌ స్పందిస్తూ.. అన్నీ చేయగలిగితే తెలంగాణ ఎందుకు అడగాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లు అన్యాయం చేస్తున్నారని, ప్రాజెక్టులు ప్రారంభించినా పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లోపించిందనే తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. ‘రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేశారు?’ అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి కన్నా మేడిగడ్డ వద్దకు అదనంగా ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయని, ఏ ఉపనదులు కలుస్తాయని ప్రశ్నించారు. దీంతో, ‘‘అది క్యాబినెట్‌ నిర్ణయం. అప్పట్లో మంత్రిగా ఉన్న మీరెందుకు అడగలేదు?’’అని హరీశ్‌ ప్రశ్నించారు. పదే పదే జూపల్లి ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో మహారాష్ట్ర, తెలంగాణలోని వాగుల ద్వారా 120 టీఎంసీల నీరు వస్తుందని హరీశ్‌రావు అన్నారు. నిపుణుల కమిటీ చెప్పిన దాని ప్రకారమే తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. మేడిగడ్డను మాత్రమే కాకుండా పక్కనున్న పోలవరంను చూడాలన్నారు. ఆ ప్రాజెక్టు కట్టించిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ సమయంలో అది ఐదుసార్లు కూలిపోయిందన్నారు. దీనిపై ఉత్తమ్‌ స్పందిస్తూ.. చంద్రశేఖర్‌ అయ్యర్‌ గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఘోష్‌ కమిషన్‌కు నిపుణుల కమిటీ రెండు స్టేట్‌మెంట్లు ఇచ్చిందని, ఆ విషయాన్ని హరీశ్‌ దాచిపెడుతున్నారని ఆరోపించారు. రూ.37వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కమీషన్ల కోసం రూ.1.47లక్షల కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు.

ఇక్కడా న్యాయం జరగలేదు..!

కమిషన్‌ వద్ద తమకు న్యాయం జరగలేదని సభలో కూడా న్యాయం జరగడం లేదని హరీశ్‌రావు అన్నారు. తన ప్రసంగంలో 28సార్లు మంత్రులు అంతరాయం కల్పించారని ఆక్షేపించారు. తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సుంకిశాల కూలిందని, అక్కడకు ఎన్‌డీఎ్‌సఏ రాదని అన్నారు. ఒక్క మేడిగడ్డపైనే ఎందుకు రాజకీయ కక్ష?అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కూలలేదని, కేవలం కుంగిందని అన్నారు. దేశంలో 80 డ్యామ్‌లు దెబ్బతిన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరు అందించారని మీ నివేదికలు చెబుతున్నాయని గుర్తు చేశారు. దీంతో ఉత్తమ్‌ కల్పించుకుంటూ.. మేడిగడ్డ కాళేశ్వరం గుండెకాయ అని బీఆర్‌ఎస్‌ చెప్పిందని, ఆ గుండెకాయే పగిలిందని అన్నారు.


కక్షసాధింపే అయితే రెండో రోజే మొదలయ్యేది: శ్రీధర్‌బాబు

తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనుకుంటే.. ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే మొదలయ్యేదని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తమకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి చాలా గొప్పదని, కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాకపోవటం సరైన పద్ధతి కాదని అన్నారు. శిక్ష తప్పించుకునేందుకే హరీశ్‌రావు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్‌ మాట్లాడాలని, హరీశ్‌కు ఏం హోదా ఉందని ప్రశ్నించారు. కాగా, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పవర్‌ పాయింట్‌ప్రజెంటేషన్‌ ఇచ్చినప్పుడు ఉత్తమ్‌ ప్రిపేర్‌ అయి రాలేదన్నారని హరీశ్‌ అనగా.. ఆయనపై ఉత్తమ్‌ ఫైర్‌ అయ్యారు. హరీశ్‌ హద్దులు దాటుతున్నారని వ్యాఖ్యానించారు.


పీసీ ఘోష్‌ ఇచ్చింది చెత్త నివేదిక: హరీశ్‌రావు

2.jpg

కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక చిత్తుకాగితంతో సమానమని గతంలో చెప్పామని, అదొక చెత్త నివేదిక హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నపుడు ప్రాణహిత- చేవెళ్లకు అనుమతి అడిగామని, కేంద్రంతో పాటు మహరాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకపోవటంతోనే... మేడిగడ్డకు మార్చామని తెలిపారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరంపై కుట్రపూరిత కమిషన్‌ వేశారన్నారు. వానలు, వరదలు, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే... కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో బురద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్‌ కంపెనీ నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ప్రతి పక్షంలో ఉన్నపుడే మేడిగడ్డపై దుష్ప్రచారం మొదలుపెట్టారని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారని, పీసీ ఘోష్‌ కమిషన్‌ పేరుతో ఇప్పుడు కక్షసాధింపునకు దిగుతున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆరోపించారు. రాజకీయ అస్త్రంగా కాళేశ్వరంను వాడుకుంటున్నారని ఆక్షేపించారు. కోర్టుకు వెళ్లే హక్కు తమకు ఉందని హరీశ్‌రావు అన్నారు. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్టు- 1952 ప్రకారం 8-బి, 8-సి నిబంధనలమేరకు కేసీఆర్‌కు గానీ, తనకుగానీ, ఐఏఎస్‌ అధికారులకుగానీ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవటంలో తప్పేముందని ప్రశ్నించారు. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలుచేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని, తామెక్కడ సుప్రీంకోర్టుకు పోయి విచారణ కమిషన్‌ను రద్దు చేయిస్తామోననే భయంతో.. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేసిందన్నారు. ఏ క్షణంలోనైనా కోర్టు స్టే ఇస్తుందన్న భయంతోనే హడావిడిగా అసెంబ్లీ పెట్టి, ఆదివారం చర్చ పెట్టారని విమర్శించారు. గతంలో ఇందిరాగాంధీ, ప్రణబ్‌ ముఖర్జీ, ఎల్‌కే అద్వానీ, కిరణ్‌బేడీ కూడా విచారణ కమిషన్‌ నివేదికలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించారని గుర్తుచేశారు. ‘ఇందిరకు మద్దతుగా మీరు ధర్నాలు చేస్తే తప్పులేదు గానీ.. మేం హైకోర్టుకు పోతే తప్పా?’ అని ప్రశ్నించారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ చట్టబద్ధంగా జరిగిందా? లేదా? అనేదీ చర్చించాలన్నారు.


ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌‌మీట్

మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated Date - Sep 01 , 2025 | 05:43 AM