Madhusudhan Rao: విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం
ABN , Publish Date - Feb 13 , 2025 | 03:46 AM
గతంలో తేజస్ ఎంకే 1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బరంపురం (ఒడిసా)లోని తెలుగు కుటుంబానికి చెందిన కోట హరినారాయణ పనిచేశారు. ఆయన తర్వాత మళ్లీ ఇప్పుడు.. తేజస్ ఎంకే 2 ప్రాజెక్టుకు సైతం తెలుగువాడే అయిన మధుసూదనరావు డైరెక్టర్ కావడం గర్వకారణం.

హెచ్‌ఏఎల్‌కు సామర్థ్యం లేక కాదు.. అర్థం చేసుకోవాలి
తేజస్ ఎంకే1ఏ విమానాల తయారీలో జాప్యంపై
తేజస్ ఏంకే2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.మధుసూదనరావు
‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ
బెంగళూరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి-ఏబీఎన్): తేజస్ ఎంకే1ఏ విమానాలకు సంబంధించి కీలక పరిజ్ఞానాల విషయంలో మనం విదేశాల మీద ఆధారపడి ఉన్నామని.. ఇంజన్లు రాకపోవడం వల్లనే వాటి తయారీ ఆలస్యమవుతోంది తప్ప హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు సామర్థ్యం లేకపోవడంవల్ల కాదని తేజస్ ఎంకే2 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.మధుసూదనరావు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఓపిక పట్టాలని ఆయన పేర్కొన్నారు. తేజస్ ఎంకే1ఏల తయారీలో నెలకొన్న జాప్యం నేపథ్యంలో.. హెచ్‌ఏఎల్ మీద తనకు నమ్మకం లేదంటూ ఎయిర్‌చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మధుసూదనరావు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తేజస్ ఎంకే 1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బరంపురం (ఒడిసా)లోని తెలుగు కుటుంబానికి చెందిన కోట హరినారాయణ పనిచేశారు. ఆయన తర్వాత మళ్లీ ఇప్పుడు.. తేజస్ ఎంకే 2 ప్రాజెక్టుకు సైతం తెలుగువాడే అయిన మధుసూదనరావు డైరెక్టర్ కావడం గర్వకారణం. ‘ఎంబెడెడ్ సిస్టమ్స్’లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ మధుసూదనరావు.. బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో సైంటి్‌స్టగా 1990లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇన్‌శాట్-2ఏ, ఐఆర్‌ఎ్‌స-1సీ శాటిలైట్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. 1993లో ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీలో చేరి.. ఏవియోనిక్స్ సిస్టమ్స్, తేలికపాటి యుద్ధవిమానాల్లో డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ వంటివాటిలో అపార అనుభవాన్ని గడించారు. ఎల్‌సీఏ ఎంకే1ఏ ప్రధాన సమన్వయకర్తగా పనిచేశారు. ఆయన రాసిన పరిశోధన వ్యాసాలు పలు అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. ఫ్లైట్ కంట్రోల్స్, ఏవియోనిక్స్‌కు సంబంధించి పలు జాతీయ అంతర్జాతీయ పేటెంట్లు ఆయన పేరిట ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న ‘ఏరో ఇండియా షో’కు హాజరైన ఆయన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. అందులో ముఖ్యాంశాలు..
తేజస్ ఎంకే1ఏ తయారీలో భారత్ వెనకబడి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయమేమిటి?
మన దేశం వెనకబడడం కాదు. దాని తయారీకి సంబంధించిన కీలక పరిజ్ఞానాల విషయంలో మనం విదేశాల మీద ఆధారపడి ఉన్నాం. ఉదాహరణకు.. ఇంజన్, ఎజెక్షన్ సీటు వంటివి. మనకు ఆ టెక్నాలజీ ఇంకా లేదు. అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఆ పరిజ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఇంజన్లు సమయానికి రాకపోవడం వల్ల హెచ్‌ఏఎల్ ఉత్పత్తి కొంత ఆలస్యమైంది. అంతే తప్ప ఆ సంస్థ సామర్థ్యంలో ఎలాంటి లోపమూ లేదు. వారికి సామర్థ్యం ఉంది. కానీ, సప్లై చైన్‌లో సమస్యల వల్ల ఉత్పత్తి రేటు తగ్గుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఓపిగ్గా వ్యవహరించాలి. ఇప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ కూడా ముందుకొచ్చి వాటిని సరఫరా చేస్తామని చెప్పింది. కాబట్టి, మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది మన దేశ రక్షణ రంగ సంస్థ తప్పు కాదు.. వేరే దేశానికి చెందిన సంస్థ సమస్య. మనచేతుల్లో ఏమీ లేదు. మన హెచ్‌ఏఎల్ మాత్రం సమయానికి వాయుసేనకు సరఫరా చేయగలదు.
తేజస్ ఎంకే 2 ఎప్పటికి సిద్ధమవుతుంది?
ఈ పాజ్రెక్టు ఏ దశలో ఉంది?
ఈ విమానం 4.5+ జనరేషన్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నాం. ఎంకే 1 (4+ జనరేషన్)తో పోలిస్తే చాలా అధునాతనమైనది. వచ్చే ఏడాది మార్చిలోగా ఫస్ట్ ఫ్లయిట్‌కు సిద్ధమవుతుంది. దీంట్లో వాడే పరిజ్ఞానాలు అత్యంత అధునాతనమైనవి. ఉదాహరణకు ఐఆర్‌ఎ్‌సటీ (ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్) టెక్నాలజీ.. ఇది యాక్టివ్ రేడార్‌కు సమానమైనది. కానీ పాసివ్ రేడార్. రెండోది.. మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్. ఏదైనా క్షిపణి మన ఎయిర్‌క్రాఫ్ట్ దగ్గరకు వస్తుంటే దాన్ని గుర్తించి, పైలట్‌కు దాని వివరాలు తెలియజేస్తుంది. దాన్ని తప్పించుకోవాలా? లేక కౌంటర్ మెజర్స్ తీసుకోవాలా? సూచనలిస్తుంది. అయితే, ఈ విమానాల అభివృద్ధికి కావాల్సిన మెటీరియల్ లభ్యత కష్టంగా ఉంది. ఎందుకంటే మార్క్2 ఎయిర్‌క్రాఫ్ట్.. మార్క్1 కంటే పెద్దది. అందుకే మేం దగ్గరుండి మిధాని, ఓఎ్‌ఫఏజేలో మెటీరియల్స్ తయారుచేయించి, ఎయిర్‌క్రా్‌ఫ్టను అభివృద్ధి చేస్తున్నాం. విమానం డిజైన్ పూర్తయ్యింది. డిజైనింగ్‌లో సీడీఆర్, పీడీఆర్ అనే దశలుంటాయి. అవి రెండూ పూర్తయ్యాయి. డ్రాయింగ్ రిలీజ్ ప్రాసెస్ కూడా పూర్తయింది. కాంపొనెంట్ల తయారీ మొదలుపెట్టాం. ఈ మాక్-2 డిజైన్.. మాడ్యూలార్ తరహాలో చేశాం. అంటే చిన్న చిన్న భాగాలుగా తయారుచేశాం. వాటిని అసెంబుల్ చేస్తాం. ఇలా మాడ్యూల్ తరహాలో చేయడం వల్ల వాటన్నింటినీ కలిపి.. విమానాన్ని వేగంగా ఉత్పత్తి చేసి, ఎగిరేలా చేయొచ్చు. ఎంకే1కు మాడ్యులారీటీ లేదు కాబట్టే.. దాని ఉత్పత్తి రేటు తక్కువగా ఉంది. కానీ, ఇప్పుడీ మాడ్యులారిటీ విధానం వల్ల ఏడాదికి 24 ఎంకే2 విమానాలు తయారుచేయొచ్చు. వాటి నిర్వహణ కూడా సులువుగా ఉంటుంది. ఏమాడ్యూల్‌లో సమస్యఉంటే ఆ మాడ్యూల్‌ను మార్చేస్తే సరిపోతుంది. అది లేకపోవడం వల్లే మాక్1 విమానాల నిర్వహణ కష్టం. ఉండడానికి 100 విమానాలున్నా.. 60మాత్రమే అందుబాటులో ఉంటా యి. డిజైన్ నుంచే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడంవల్ల ఎంకే2 విషయంలో ఆ సమస్యలేవీ ఉండవు.
తేజస్ ఎంకే 2 ఐదో తరం విమానాలతో సమానంగా ఉండే అవకాశం ఉందా?
తేజస్ మార్క్2 అనేది ఎయిర్ సుపీరియారిటీ తరహా విమానం. ఎంకే1 ఎయిర్‌క్రాఫ్ట్.. ‘ఎయిర్ డిఫెన్స్’ కేటగిరీకి చెందినది. ఎయిర్ సుపీరియారిటీ కేటగిరీ విమానాల్లో పెద్ద సంఖ్యలో ఆయుధాలను మోసుకెళ్లగలదు. మన డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అన్ని రకాల ఆయుధాలనూ దీన్నుంచి ప్రయోగించవచ్చు. పరిస్థితులను బట్టి 45 రకాల కాన్ఫిగరేషన్లతో ఎగరగలదు. మార్క్-1 విమానాలు 1500 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే.. ఇవి 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. మార్క్1 విమానాల మిషన్ ఎండ్యూరెన్స్ 51 సెకన్లుగా ఉంటే.. మార్క్2లో అది 126 సెకన్లుగా ఉంటుంది. దీని నిర్మాణంలో అత్యంత ఆధునిక సెన్సర్లు.. ఆయుధాలను ఇంటిగ్రేట్ చేశాం. ఈ విమానంలో కాక్‌పిట్ కూడా అత్యంత అధునాతనమైనది. ఎఫ్-35తో సమానమైన కాక్‌పిట్ ఎంకే2లో ఉంది. వీటన్నింటివల్ల.. పైలట్లు ఈ యుద్ధవిమానాన్ని ఎంతగానో ఇష్టపడతారు.
ఐదో తరం యుద్ధవిమానాల తయారీలో భారత్ వెనకబడిందని రక్షణ రంగ విశ్లేషకుల అభిప్రాయం.. దీనికి మీరేమంటారు?
అది అంత నిజం కాదు. మనం ఐదో తరం యుద్ధవిమానం ఆమ్కా (ఏఎంసీఏ) డిజైన్‌ను ఇప్పటికే పూర్తిచేశాం. మార్క్2లో సైతం ఐదో తరం పరిజ్ఞానాలను పొందుపరచాం. ఆమ్కా ఐదో తరం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అయినా.. అందులో పొందుపరుస్తున్న సాఫ్ట్‌వేర్, ఇతర పరిజ్ఞానాలను బట్టి చూస్తే అది 5.5 లేదా 6వ తరం విమానాలతో సమానం. అవి ఆరోతరం విమానాల్లాగా.. ఆప్షనల్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రా్‌ఫ్టలవి. మన భారతదేశం కూడా మరికొన్నేళ్లలోనే ఐదో తరం విమానాలను కలిగి ఉన్న దేశాలతో సమానంగా నిలుస్తుంది.
ఆమ్కా ఎప్పట్నుంచీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడది ఏ దశలో ఉంది?
ఆమ్కా డిజైన్ పూర్తయింది. అదో స్టెల్త్ విమానం. దాని తయారీలో పలు రకాల స్టెల్త్ పరిజ్ఞానాలను వినియోగించాం. ఈ విమానాల ప్రోటోటై్‌పలు రెండేళ్లలో సిద్ధమవుతాయి. ఆ తర్వాత మరో మూడు, మూడున్నరేళ్లలో ఫస్ట్ ఫ్లయిట్ జరుగుతుంది.
ప్రైవేటు సంస్థలను రంగంలోకి దింపడం వల్ల ఈ విమానాల తయారీ వేగవంతమవుతుందా?
కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ ఎయిర్‌క్రా్‌ఫ్టల తయారీలో మన ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీకి ప్రధాన భాగస్వామి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆ దిశగా హెచ్‌ఏఎల్ ఎంతగానో శ్రమిస్తోంది. అయినప్పటికీ వారికి ఇతరత్రా చాలా బాధ్యతలున్నాయి. వారికి ఇది కాకుండా వేరే ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. కాబట్టి, ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములను చేస్తే.. అవి తయారుచేసే 90 శాతం పరికరాలను హెచ్‌ఏఎల్ ఇంటిగ్రేట్ చేస్తే ఉత్పత్తి రేటు పెరుగుతుంది. లేదా మన వైమానిక దళానికి ఏం కావాలో వాటిని హెచ్‌ఏఎల్ ఉత్పత్తి చేసి, ఎగుమతి చేయాల్సిన వాటిని ప్రైవేటు సంస్థల ద్వారా తయారు చేయిస్తే సరిపోతుంది.
నౌకాదళం కోసం ప్రత్యేకంగా ఎలాంటి విమానాలను అభివృద్ధి చేస్తున్నారు?
నేవీ కోసం విమానవాహక యుద్ధనౌకల మీద ల్యాండ్, టేకాఫ్ అయ్యే ఎయిర్‌క్రా్‌ఫ్టను మనం ఇప్పటికే అభివృద్ధి చేశాం. 2003లో ఆ ప్రాజెక్టు మనకు మంజూరైంది. దాన్ని అభివృద్ధి చేసి.. 2009లో టేకాఫ్, ల్యాండింగ్ చేయగలిగాం. ప్రపంచంలోనే ఆ టెక్నాలజీ ఉన్న ఐదో దేశంగా నిలిచాం. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని నేవీ కోసం అడ్వాన్స్‌డ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘టెడ్‌బీఎఫ్ (ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్)’ను అభివృద్ధి చేస్తున్నాం. డిజైన్ ఫైనలైజ్ అయ్యింది. ప్రభుత్వ మంజూరు కోసం ఎదురుచూస్తున్నాం. అదెప్పుడైనా రావచ్చు. వస్తే దాన్ని కూడా వేగంగా అభివృద్ధి చేసి ఇవ్వగలం.