Share News

High Court: కేసుల సత్వర పరిష్కారంతోనే న్యాయ వ్యవస్థపై విశ్వాసం

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:44 AM

కేసుల సత్వర పరిష్కారంతోనే న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఏర్పడుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అన్నారు. ఇందుకు న్యాయాధికారులు, న్యాయవాదులు దోహదం చేయాలని కోరారు.

High Court: కేసుల సత్వర పరిష్కారంతోనే న్యాయ వ్యవస్థపై విశ్వాసం

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

  • వర్చువల్‌ విధానంలో నిడమనూరు కోర్టు భవనం ప్రారంభం

నిడమనూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కేసుల సత్వర పరిష్కారంతోనే న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఏర్పడుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అన్నారు. ఇందుకు న్యాయాధికారులు, న్యాయవాదులు దోహదం చేయాలని కోరారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో రూ.5.50కోట్ల నిధులతో నిర్మించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన సముదాయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ సుధ, జస్టిస్‌ సుజన, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ మాట్లాడుతూ కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేసినప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందన్నారు.


జనాభా పెరుగుతుండటంతో కేసులు కూడా పెరుగుతున్నాయని, దానికి అనుగుణంగా కోర్టుల ఏర్పాటు కూడా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్కువ వాయిదాలు తీసుకోకుండా కేసులను త్వరితగతిన ముగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కక్షిదారులకు అందుబాటులో ఉంటూ సత్వర న్యాయం ఆందించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. హైకోర్టు ఫోర్టు పోలియో న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నిడమనూరు కోర్టు పరిధిలో కేసులు ఎక్కువగా ఉన్నందున అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయాధికారి నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు సంపూర్ణ ఆనంద్‌, వేణు, నిడమనూరు కోర్టు ఇన్‌ఛార్జి న్యాయాధికారి పవన్‌కుమార్‌, అదనపు ఎస్పీ రమేష్‌, అదనపు కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉన్నం చినవీరయ్య పాల్గొన్నారు..


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 04:44 AM