Share News

Gachibowli Forest Restoration: అడవి పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:40 AM

కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో అటవీ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే, మంచి ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాక సుమోటోగా తీసుకున్న చర్యలను కూడా ఉపసంహరించుకుంటామని సీజేఐ జస్టిస్‌ గవాయి వ్యాఖ్యానించారు.

Gachibowli Forest Restoration: అడవి పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక

  • 6 నుంచి 8 వారాల్లో నివేదిక ఇస్తాం

  • కంచ గచ్చిబౌలి కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

  • మంచి ప్రణాళికతో వస్తే ప్రశంసిస్తాం..

  • అన్ని చర్యలను ఉపసంహరించుకుంటాం : సీజేఐ

  • తన పదవీ విరమణలోపే ప్రణాళిక రూపొందించాలని చమత్కారం

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో అటవీ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే, మంచి ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాక సుమోటోగా తీసుకున్న చర్యలను కూడా ఉపసంహరించుకుంటామని సీజేఐ జస్టిస్‌ గవాయి వ్యాఖ్యానించారు. సీజేఐ జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ కె వినోద్‌ చంద్రన్‌తో కూడా ద్విసభ్య ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ పిటిషన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్‌ తరపున ఎస్‌.నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్భంగా అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రస్తుతం పనులన్నీ ఆగిపోయాయని, ఈ అంశంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ధర్మాసనానికి తెలిపారు అడవులు, చెరువులను కాపాడేందుకు ప్రస్తుతం ఓ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకు తమకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఎటువంటి ప్రణాళికలని ప్రశ్నించగా.. తమ ప్రణాళికలను రికార్డు రూపంలో న్యాయస్థానానికి సమర్పించేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువు కావాలని అభిషేక్‌ కోరారు. సీజేఐ స్పందిస్తూ.. మంచి ప్రతిపాదనతో వస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. మంచి ప్రతిపాదనతో వస్తే ప్రశంసిస్తామని, రాష్ట్రంపై సుమోటోగా తీసుకున్న చర్యలను ఉపసంహరించుకుంటామని, పర్యావరణ పరిరక్షణే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో నాశనమైన అడవిని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించాల్సిందేనని పునరుద్ఘాటించారు. అయితే, తన పదవీ విరమణలోపే ఆ ప్రణాళికలు రూపొందించాలంటూ సీజేఐ చమత్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 03:40 AM