Supreme Court: కోదండరాం, అలీఖాన్‌కు షాక్
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:37 AM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌లకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అని పేర్కొంది.
ఎమ్మెల్సీలుగా వారి నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం
గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ
అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని వ్యాఖ్య
ఇద్దరి ప్రమాణ స్వీకారమే సరికాదని స్పష్టీకరణ
వారి పేర్లను మళ్లీ సిఫారసు చేసేందుకు చాన్స్
సెప్టెంబరు 17కు విచారణ వాయుదా
తీర్పు బీజేపీ, కాంగ్రె్‌సలకు చెంపపెట్టు: కేటీఆర్
న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌లకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అని పేర్కొంది. గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవరించింది. ‘‘మేం నాడు పొరపాటు చేశాం. తాజాగా నామినేషన్లు వేయడానికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్టే ఇచ్చాం. హైకోర్టు రూలింగ్‌ను అడ్డుకోవడం కోసం కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఆ ఆదేశాలను సవరిస్తున్నట్టు వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల్లో ‘స్టే’కు సంబంధించిన వాక్యాన్ని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పు వెలువరించింది. అయితే వారి పేర్లను ప్రభుత్వం మరోసారి సిఫారసు చేయవచ్చని, వారి నామినేషన్లను స్వీకరించవచ్చని తెలిపింది. కానీ, ఏ నామినేషన్ వేసినా ఈ అంశంపై తుది తీర్పునకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేయగా.. వారికి రాజకీయ నేపథ్యం ఉందంటూ ఆ ఇద్దరి పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో వివాదం మొదలైంది. గవర్నర్ నిర్ణయాన్ని వారిద్దరూ వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధకారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గతేడాది జనవరి 13న కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫారసు చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు.

మరోసారి హైకోర్టుకు వెళ్లడంతో..
దాసోజు శ్రావణ్, సత్యనారాయణ మరోసారి హైకోర్టుకు వెళ్లగా.. వీరి నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గతేడాది మార్చి 17న హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. అనంతరం కోదండరాం, అలీఖాన్‌ల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేసింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. దీంతో శ్రావణ్, సత్యనారాయణ గతేడాది ఆగస్టు 4న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనల అనంతరం.. గతంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తామిచ్చే తీర్పునకు అనుగుణంగా ఎమ్మెల్సీల నియామకం ఉంటుందని పేర్కొంది. గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధించడాన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసినవారు ప్రమాణ స్వీకారం కూడా చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడమే తప్పు అని తేలిందని న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. అయితే వారిద్దరి పేర్లను మళ్లీ సిఫారసు చేయవచ్చునని, తాజా నామినేషన్లు స్వీకరించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, భవిష్యత్తులో ఏ తాజా నామినేషన్ వేసినా ఈ పిటిషన్‌పై తుది తీర్పునకు అనుగుణంగానే ఉంటుందని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబరు17కు వాయిదా వేసింది.
ధర్మం గెలిచింది..
సుధీర్ఘ పోరాటం తర్వాత ధర్మం గెలిచిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తీర్పు కాపీ పూర్తిగా వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయని, సెప్టెంబరు 17న ఏం చెబుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ పార్టీల అప్రజాస్వామిక విధానాలను ఎంతమాత్రం సాగనివ్వబోమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు బీఆర్‌ఎస్ సలాం చేస్తోందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. మహోన్నత భారత రాజ్యాంగాన్ని గౌరవించకుంటే పరాభవం తప్పదని కేంద్రంలోని బీజేపీ ఇప్పటికైనా గుర్తించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News