Phone tapping: ప్రభాకర్‌రావు అరెస్టుకు అనుమతివ్వండి!
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:54 AM
ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు డీసీపీ విజయకుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది.
ఆయన విచారణకు సహకరించడం లేదు
సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న సిట్
హైదరాబాద్/సూర్యాపేట క్రైం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు డీసీపీ విజయకుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. ప్రభాకర్‌రావును వచ్చే నెల 5 వరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్న ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని, 40గంటలు విచారించినా ట్యాపింగ్ వెనక ఉన్నదెవరన్న విషయాలను ఆయన బయటపెట్టడం లేదని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయనున్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మోసపూరిత విధానాలను అనుసరించారని విచారణలో స్పష్టమైందని చెప్పనున్నారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌కు ప్రేరేపించింది ఎవరు? జర్నలిస్టులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చిందెవరనే విషయాన్ని నిర్ధారించుకోవాలంటే ప్రభాకర్‌రావును కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పనున్నారు.
జానయ్యయాదవ్‌కు సిట్ నోటీసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సూర్యాపేట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్‌కు సిట్ గురువారం నోటీసు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వట్టె జానయ్యయాదవ్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 14న విచారణకు రావాలని సిట్ అధికారులు తెలిపారు. జానయ్యయాదవ్ మాట్లాడుతూ.. గత శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయించి బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News