Share News

Gold Mining: సింగరేణికి గోల్డెన్‌ చాన్స్‌

ABN , Publish Date - Aug 20 , 2025 | 03:52 AM

సుదీర్ఘకాలంగా బొగ్గు గనుల తవ్వకాలలో ఉన్న సింగరేణి సంస్థ.. ఖనిజాల వెలికితీత రంగంలోకి కూడా ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది.

Gold Mining: సింగరేణికి గోల్డెన్‌ చాన్స్‌

హైదరాబాద్‌/గోదావరిఖని/కొత్తగూడెం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా బొగ్గు గనుల తవ్వకాలలో ఉన్న సింగరేణి సంస్థ.. ఖనిజాల వెలికితీత రంగంలోకి కూడా ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చింది. కర్ణాటకలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో.. 37.75ు రాయల్టీని కోట్‌ చేయడం ద్వారా సింగరేణి ఎల్‌-1 బిడ్డర్‌గా నిలిచింది. ఈ వివరాలను సంస్థ సీఎండీ ఎన్‌ బలరాం వెల్లడించారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో దేవదుర్గ్‌ గనుల్లో అన్వేషణను పూర్తి చేస్తామన్నారు. బొగ్గు మైనింగ్‌లో 136 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ తొలిసారిగా బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్సును దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం ప్రకటించారు. ఖనిజాల అన్వేషణలోనూ సింగరేణి.. దేశంలో అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వేలంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 13వ తేదీన మొత్తం 13 కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్స్‌ల కోసం వేలం ప్రక్రియను ప్రారంభించింది.


ఇందులో సింగరేణి సంస్థ పాలుపంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో అన్వేషణకు అనువైన బ్లాక్‌లపై సింగరేణి.. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం జరిపించింది. మధ్యప్రదేశ్‌లోని పదార్‌లో ఉన్న ప్లాటినమ్‌ గ్రూప్‌ ఎలిమెంట్స్‌ బ్లాక్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి వద్ద ఉన్న ఒంటిల్లులోని రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ బ్లాక్‌, కర్ణాటకలోని బంగారం, రాగి బ్లాకులు తమకు అనువైనవని సింగరేణి అధికారులు గుర్తించారు. వీటి కోసం ఈ నెల 13, 14, 19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో సింగరేణి కూడా పాల్గొంది. కర్ణాటకలోని దేవదుర్గ్‌లో ఉన్న బంగారం, రాగి బ్లాక్‌ల అన్వేషణ లైసెన్స్‌ను దక్కించుకుంది. కాగా, కర్ణాటక దేవదుర్గ్‌లో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ జరిపి, తుది ఫలితాలను కేంద్రానికి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆ గనుల్లో తవ్వకాల కోసం కేంద్రం వేలం నిర్వహిస్తుంది. సదరు వేలంలో సింగరేణి కూడా పాల్గొనే అవకాశం ఉంది. వేలంలో గనులను దక్కించుకున్న సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవిత కాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 03:52 AM