Srushti Fertility Center Case : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 07:20 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
పిల్లల్ని అమ్మే ముఠాలతో లింకులు..
సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీలో సంచలన విషయాలను రాబట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. పిల్లల్ని అమ్మే గ్యాంగులతో డాక్టర్ నమ్రత లింకులు పెట్టుకున్నట్లు గుర్తించారు. పిల్లల్ని అమ్మటానికి మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రకు చెందిన గ్యాంగ్లతో నమ్రత సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. గతంలో పిల్లల్ని అమ్ముతూ.. అరెస్ట్ అయిన నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఒక్కొక్క పిల్లాడిని రూ.3 నుంచి రూ.5 లక్షల రూపాయలకు నమ్రత కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు.
బయటపడ్డ సంచలన విషయాలు..
ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాదులోని మరో నాలుగు సెంటర్లు కూడా పిల్లల్ని అమ్మినట్టు గుర్తించినట్లు తెలిపారు. పెట్టికేర్, హెడ్జ్, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లు పిల్లల అమ్మకాలు జరిపినట్లు పేర్కొన్నారు. పిల్లల అమ్మకాలతో పాటు యువతి యువకులను కూడా నమ్రత గ్యాంగ్ ట్రాప్ చేసిందని చెప్పారు. యువతి , యువకుల వీర్యకణాలు అండాలను సేకరించి అమ్మేవారని పోలీసులు స్పష్టం చేశారు.
వెనకున్నది ఎవరు..?
డాక్టర్ సదానందం.. సృష్టి కేసులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సదానందం ప్రమేయంతోనే.. ఇవన్నీ జరిగాయన్నారు. ప్రతి ఆపరేషన్ వెనకాల సదానందం పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం సదానందం గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా కొనసాగుతున్నారు.
తాజా పరిణామం..
తాజాగా.. సృష్టి ఫెర్టిలిటీ కేసులో మహిళా డాక్టర్ అరెస్టయ్యారు. ఈ కేసులో డాక్టర్ విధులత పాత్ర ఇదివరకే వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఆమెపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమెను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. డాక్టర్ విధులత సోమవారం సాయంత్రం విశాఖ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెపై లుకౌట్ నోటీసు ఉండడంతో సిబ్బంది గోపాలపురం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఆమెను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం